నవరాత్రుల్లో అమ్మవారి రూపాలు, వాటి విశిష్టతలు

Telugu BOX Office
మానవ అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలో దుర్గా మాత అనాహత చక్రం అధిష్టాన దేవతగా అధివసించి ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం పొంది, సహజయోగ సాధన చేస్తున్న సాధకులలో ఈ హృదయచక్రం వికసించి, దుర్గాదేవి తత్త్వం వ్యక్తమవుతుంది.భగవంతుణ్ణి ఆరాధించేవారినందరినీ రాక్షసులు బాధలకు గురిచేసేవారు. భక్తుల ప్రార్థన మేరకు… దుర్గాదేవి ఈ భూమిపై తొమ్మిది సార్లు అవతరిచింది. రాక్షస సంహారం చేసింది. ఈ సంప్రదాయం శక్తిపీఠాలలో ప్రధానంగా కనిపిస్తుంది. ఆ రూపాలు, వాటి విశిష్టతల గురించి తెలుసుకుందాం.
మొదటి రోజు – శైల పుత్రి
శైలపుత్రి పర్వతరాజైన హిమవంతుడి కుమార్తె. ఆమే పార్వతీ దేవి. నవదుర్గల్లో మొదటి అవతారం. ఆమె శివుణ్ణి వివాహం చేసుకుంది. శైలపుత్రి కుడి చేతిలో త్రిశూలాన్ని, ఎడమ చేతిలో తామరపువ్వును ధరించి ఉంటుంది. వృషభ వాహనంపై… చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంటుంది.
రెండో రోజు – బ్రహ్మచారిణి
నిరంతరం తపోదీక్షలో ఉండే దేవత బ్రహ్మచారిణి. ‘బ్రహ్మము’ అంటే తపస్సు, ‘చారిణి’ అంటే ఆచరించేది అని అర్థం. ఆమె కుడిచేతిలో జపమాలను, ఎడమ చేదిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది. ఆమెనే ఉమాదేవి అని పిలుస్తారు. తనను ఆరాధించే భక్తులకు జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తుంది.
మూడో రోజు – చంద్రఘంట
ఈ రూపంలో దుర్గమాత పది చేతులు, మూడు నేత్రాలు కలిగి ఉంటుంది. బంగారు కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ… ఎనిమిది చేతుల్లో ఆయుధాలు ధరించి, మిగిలిన రెండు చేతులతో భక్తులకు అభయం ఇస్తుంది. పులి వాహనంపై ఆసీనురాలైన చంద్రఘంట భక్తులకు శాంతిని, శుభాన్ని చేకూరుస్తుంది.
నాలుగో రోజు – కూష్మాండ దేవి
కూష్మాండదేవి రూపంలోని దుర్గామాత… సింహవాహిని. సౌర వ్యవస్థను తన ఆధీనంలో ఉంచుకొని, చుట్టూ సూర్యకాంతిని వెదజల్లుతుంది. ఆమెకు ఎనిమిది చేతులు. ఆరు చేతుల్లో ఆయుధాలను, మిగిలిన రెండు చేతుల్లో తామర పువ్వు, జపమాలను ధరించి ఉంటుంది. తెల్ల గుమ్మడి అంటే ఆమెకు ఇష్టం కాబట్టి ‘కూష్మాండ దేవి’ అని పిలుస్తారు.
అయిదో రోజు – స్కందమాత
స్కందుడు అంటే కుమారస్వామికి తల్లిగా… స్కందమాత రూపంలో అమ్మవారిని కొలుస్తారు. ఆమెకు మూడు నేత్రాలు, నాలుగు చేతులు. రెండు చేతుల్లో తామర పూలు ధరించి, రెండు చేతులతో భక్తులకు ఆశీస్సులను, అభయాన్ని ప్రసాదిస్తుంది. ఆమె వాహనం సింహం.ఆ తల్లి అనుగ్రహంతో మూర్ఖులు కూడా జ్ఞానులవుతారు. ఆమె కటాక్షంతోనే కాళిదాసు మహాకవి అయ్యాడు.
ఆరో రోజు – కాత్యాయని
కాత్యాయన మహర్షి దీర్ఘకాలం పాటు చేసిన కఠోర తపస్సుకు జగన్మాత ప్రసన్నురాలైంది. ఆ మహర్షి కోరిక మేరకు ఆయన కుమార్తెగా జన్మించి… కాత్యాయని అయింది. ఆమెకు మూడు కళ్ళు, నాలుగు చేతులు ఉంటాయి. వజ్రమండల దేవతగా పూర్వులు పేర్కొన్న ఆమె సింహాన్ని అధిష్టించి ఉంటుంది.
ఏడో రోజు – కాళరాత్రి
ఆదిశక్తిని దేవతలు ‘‘దేవీ! నీవెవరివి?’’ అని అడిగినప్పుడు ‘‘నేను ఆనందాన్ని. దానికి అతీతమైన పరమానందాన్ని, నేను జ్ఞానాన్ని. దానికి అతీతమైన బ్రహ్మ జ్ఞానాన్ని’’ అని చెబుతుంది. ఈ రూపంలో అమ్మవారి శరీరం చీకటిలా నల్లగా ఉంటుంది. కాబట్టి ఆమెను ‘కాళరాత్రి’ అంటారు. జుత్తు విరగబోసుకొని, నాసిక ద్వారా అగ్ని జ్వాలలు వెదజల్లుతూ… అంధకారాన్నీ, అజ్ఞానాన్నీ నాశనం చేస్తుంది.
ఎనిమిదో రోజు – మహాగౌరి
మల్లెపువ్వులా తెల్లటి రంగులో, చంద్ర కాంతితో ప్రకాశించే మహా గౌరి మూడు నేత్రాలు, నాలుగు చేతులను కలిగి, వృషభ వాహనాన్ని అధిష్టించి ఉంటుంది. త్రిశూలం, కమండలం ధరించిన ఆమె తెల్లని లేదా ఆకుపచ్చని వస్త్రాలు ధరించి… భక్తులను కటాక్షిస్తుంది. ఈ రోజు ‘దేవీ మహాత్మ్యం’లోని పదకొండో అధ్యాయాన్ని మననం చేసుకుంటూ, అమ్మవారిని ప్రార్ధన చేయాలి.
తొమ్మిదోరోజు – సిద్ధి ధాత్రి
నవదుర్గల్లో తొమ్మిదవ రూపమైన సిద్ధిధాత్రిని మహాశక్తి’ అని కూడా పిలుస్తారు. అణిమాది అష్టసిద్ధులను ఆమె ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు ఆ మహా శక్తిని ఆరాధించి… ఈ అష్ట సిద్థులను పొందాడని దేవీ పురాణం చెబుతోంది. ఆమె సింహాన్ని అధిరోహించి ఉంటుందని కొన్ని, కమలంపై ఆసీనురాలై ఉంటుందనీ మరికొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆధ్యాత్మిక ఉన్నతి కోరుకొనేవారు ఆమెను ఆరాధించాలి.
పదోరోజు – విజయదశమి
నవరాత్రులు ముగిసిన తరువాత… పదోరోజున విజయదశమిగా, దసరాగా దేశమంతటా జరుపుకొంటారు. మహిషాసుర మర్దనం జరిగిన రోజుగా దీన్ని పరిగణించి… దేవీ ఆరాధన చేస్తారు. దేవీ నవరాత్రులలో వివిధ రూపాల్లో అమ్మవారిని పూజించాలి. అంతర్గతంగా మనలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనను పరిశీలించుకోవాలి. సన్మార్గంలో నడుస్తూ… అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలి.
Share This Article
Leave a comment