గోదావరిలో ‘పులస’ హంగామా షురూ: తొలి చేప ఎంతకి అమ్ముడుపోయిందో తెలుసా?

Telugu BOX Office

గోదావరి జిల్లాల పేరు వినగానే మర్యాదలు, మాటల్లోని వెటకారం ఎంతగా గుర్తుకొస్తాయో.. వర్షాకాలంలో మాత్రమే లభించే నోరూరించే ‘పులస చేప’ కూడా అంతే వేగంగా జ్ఞాపకానికొస్తుంది. “పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే” అనే సామెత ఊరికే పుట్టలేదు; గోదావరి నదీ ప్రవాహంలో ఎదురీదే ఈ అరుదైన చేపకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఏటా వర్షాకాలంలో మొదలయ్యే ఈ పులసల పండగ, ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది.

గౌతమి గోదావరిలో తొలి పులస సందడి

గోదావరికి ఎర్రటి వరద నీరు తోడవ్వడంతో ఈ ఏడాది పులసల హంగామా మొదలైంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లికి చెందిన మత్స్యకారులు గౌతమి గోదావరిలో వేటకు వెళ్లగా, ఈ సీజన్ లోనే మొదటి పులస చేప వలకు చిక్కింది. సుమారు 1.250 కిలోల బరువున్న ఈ తొలి పులసను యానాం రేవుకు తరలించి వేలం నిర్వహించారు. పొన్నమండ రత్నం, భద్రం దంపతులు ఈ చేపను పోటీపడి రూ. 14,000కు కైవసం చేసుకుని ఆ తర్వాత వెంటనే వేరొకరికి రూ. 500 లాభంతో విక్రయించడం విశేషం.

ఇలస’ నుంచి ‘పులస’ వరకు..

పులస శాస్త్రీయ నామం హిల్సా (టెనులోసా ఇలిషా). ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల సముద్ర జలాల నుంచి ప్రయాణించి, హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించేటప్పుడు వీటిని ‘ఇలస’ లేదా ‘విలస’ అని పిలుస్తారు. జులై నుంచి సెప్టెంబర్/అక్టోబర్ మధ్య గోదావరి ఎర్రటి వరద నీరు సముద్రంలో కలిసే సముద్ర సంగమ ప్రాంతాలైన అంతర్వేది, యానాం గుండా ఇవి నదిలోకి ప్రవేశిస్తాయి. సముద్రపు ఉప్పు నీటి నుంచి గోదావరి తీపి నీట్లోకి వచ్చి, ప్రవాహానికి ఎదురీదే క్రమంలో వీటి శరీరంలో విచిత్రమైన మార్పులు జరుగుతాయి. అలా ఇలస కాస్తా అత్యంత రుచికరమైన ‘పులస’గా మారుతుంది. అంతర్వేది, యానాం నుంచి మొదలై రాజమహేంద్రవరం, ధవళేశ్వరం బ్యారేజీ వరకు ఇవి సంతానోత్పత్తి (గుడ్లు పెట్టడం) కోసం ఎదురీదుతాయి. ఒడిశాలోని మహానదిలోకి కూడా ఇవి ప్రవేశిస్తుంటాయి, కానీ గోదావరి ఎర్రనీటిలో ఎదురీదిన పులసకు ఉండే రుచి మరిదేనికీ ఉండదు.

 సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఫుల్ గిరాకీ

పులస లభించే ఈ మూడు నెలలు గోదావరి తీరంలో పండగ వాతావరణం నెలకొంటుంది. సాధారణంగా మార్కెట్లో లభించే చేపల లాగా కాకుండా, పులస చిక్కితే యానాం, కోనసీమ రేవుల్లో బహిరంగ వేలం నిర్వహిస్తారు. విదేశాల్లో ఉండే గోదావరి వాసుల నుంచి హైదరాబాద్ లోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖుల వరకు అందరూ పులస కోసం ఆరా తీస్తుంటారు. ముందస్తుగా అడ్వాన్సులు ఇచ్చి మరీ తెప్పించుకోవడం ఇక్కడ పరిపాటి. గతంలో కిలోన్నర బరువున్న పులస రూ. 25,000 వరకు పలికిన సందర్భాలు ఉన్నాయి. ఆడ పులస చేపలకు మార్కెట్లో మరి కాస్త డిమాండ్ ఎక్కువ. పులస చేప వేటాడిన తర్వాత రెండు రోజుల వరకు పాడవకుండా ఉండటం దీని మరో ప్రత్యేకత.

ప్రత్యేక వంటకాలు

పులస చేపను గోదావరి జిల్లావాసులు చాలా రకాలుగా వండుతారు. ముఖ్యంగా బెండకాయ, వంకాయ కలయికతో మామిడికాయ గుజ్జు లేదా పాత చింతపండు పులుసు పెట్టి వండితే ఆ ఘుమఘుమలు ఊరంతా వ్యాపిస్తాయి. మరుసటి రోజు తింటే ఈ పులుసు రుచి మరీ అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి ఈ ఏటి వరద నీటితో పాటు గోదావరిలోకి పులసలు అడుగుపెట్టడంతో మత్స్యకారుల ఇళ్లలో కాసుల వర్షం కురుస్తుండగా, భోజన ప్రియులు పులస రుచిని ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు.

Share This Article
Leave a Comment