Ettam Kodanda Rama Swamy Temple History | కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారంగా, ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఎత్తం శ్రీ కోదండరామస్వామి ఆలయం. ఈ దివ్య క్షేత్రంలో గత రెండు వందల సంవత్సరాలుగా అఖండజ్యోతి దేదీప్యమానంగా వెలుగుతుండటం ఇక్కడి విశేషం. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో, కోడేరు మండల పరిధిలోని ఎత్తం గ్రామంలో కొలువైన ఈ ఆలయంలో సీతారామలక్ష్మణుల మూలవిరాట్టులను దర్శించుకునేందుకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

రెండు వందల ఏళ్ల చరిత్ర
దేశ్‌ముఖ్ వంశస్థుడైన ధరణిపతి శ్రీ పెద్ద వెంకటరామారావు 1837కి పూర్వమే గ్రామానికి నడిబొడ్డున ఈ దివ్య మందిరాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో ఆలయ నిత్య ధూపదీప నైవేద్యాల కోసం, అర్చక స్వాముల జీవనోపాధి కోసం ఏకంగా 1,050 ఎకరాల భూములను కేటాయించారు. ఈ భూములను గ్రామంలోని కొందరు రైతులకు కౌలుకు ఇస్తున్నారు. కాలక్రమేణా ఈ క్షేత్రం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చి, నిత్య పూజలతో విలసిల్లుతోంది. గర్భగుడిలోని మూలవిరాట్టుల ఎదుట నిరంతరం వెలిగే అఖండజ్యోతిని పూర్వకాలంలో మట్టిపాత్రలో నెయ్యితో వెలిగించేవారు. ప్రస్తుతం కంచు దీపపు కుందులలో నిత్యం మంచి నూనెతో ఈ అఖండ దీపాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు కిలో నూనెను ఉపయోగిస్తూ, దీపం కొండెక్కకుండా అర్చకులు ఎంతో నిష్ఠతో కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.
భక్తిశ్రద్ధలకు నిలయమైన ఈ పుణ్యక్షేత్రం సుందరమైన ప్రాకారాలతో అలరాలుతోంది. ఆలయ ప్రధాన ముఖద్వారం వద్ద శోభాయమానమైన రాజగోపురం, విమాన గోపురం, కళ్యాణ మండపం, హోమ మండపం, రామానుజుల మండపంతో పాటు అళ్వార్ల సన్నిధి, రథశాల (తేరు) ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఏటా శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఏడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఎంతో కనులవిందుగా జరుగుతాయి. రాములోరిని దర్శించుకుని అఖండజ్యోతిని తిలకిస్తే సకల పాపాలు తొలగి, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
