శయన రూపంలో దర్శనమిచ్చే శ్రీరాముడు

Telugu BOX Office

ఏ రామాలయానికి వెళ్లినా… రామచంద్రమూర్తి సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా నిల్చుని భక్తులకు కనిపిస్తాడు. కానీ ఇక్కడ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మాత్రం స్వామి ఎక్కడా లేనివిధంగా శయనరూపంలో కొలువుదీరి కోరిన కోర్కెలను నెరవేర్చే భక్తవరదుడిగా పూజలు అందుకుంటున్నాడు. రామకోటి స్థూపం, అద్దాలమండపం కూడా ఉండే ఈ ఆలయంలో రాముడు స్వయంభువుగా కొలువుతీరాడని ప్రతీతి. రాముడు స్వయంభువుగా దర్శనమిస్తూ… శారీరక, మానసిక అనారోగ్యాలను నయం చేస్తూ… భక్తుల పూజలు అందుకుంటున్న ఆలయమే ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి గుడి.

కరీంనగర్‌ జిల్లా, జమ్మికుంటకు దగ్గర్లో ఇల్లందకుంట మండలంలో కనిపిస్తుంది. గర్భగుడిలో రాతిగుహ మధ్య ఉత్తర ముఖాన శేషతల్పంపైన అనంతశయన రాముడిగా కొలువుదీరిన ఈ స్వామిని పూజిస్తే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. రామకోటి స్థూపం, అద్దాల మండపం… వంటి ప్రత్యేకతలున్న ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది.

ఇల్లంద అంటే ఓ చెట్టు పేరు, కుంట అంటే పల్లపు ప్రాంతం అని అర్థం. త్రేతాయుగంలోనే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందనీ కాలక్రమేణా అదే ఇల్లందకుంటగా మారిందనీ ప్రతీతి. త్రేతాయుగంలో తండ్రి ఆజ్ఞను శిరసావహించిన శ్రీరాముడు… సీతాదేవి, లక్ష్మణుడి సమేతంగా అరణ్యానికి బయలుదేరాడు. ఆ క్రమంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తండ్రి మరణవార్త గురించి తెలిసిందట. దాంతో ఇక్కడున్న ఇల్లంద అనే చెట్టు గింజలతోనే తండ్రికి తర్పణాలను వదిలాడట. అలా ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకునేందుకు కొద్దిసేపు శయనించాడనీ… తరువాత ఇక్కడే స్వయంభువుగా వెలిశాడనీ కథనం. అలాగే ఈ ఆలయంలోని ఉత్సవమూర్తుల ఏర్పాటు వెనుకా ఓ ఆసక్తికరమైన కథనం ఉంది.

స్వామి మూల విరాట్టుతో పాటు ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కూడా ఉండాలని ఒకప్పుడు మహర్షులు తలపెట్టారట. ఆ ప్రయత్నంలో భాగంగా రుషులు దేవతామూర్తుల రూపాలను చెక్కేందుకు ఎంత ప్రయత్నించినా విఫలమయ్యారట. కొన్నాళ్లకు రాముడే ఆకాశవాణి ద్వారా తానే ఆ విగ్రహాలను తీర్చిదిద్దుతానంటూ చెప్పాడట. అలా స్వామి ఓ శిల్పి రూపంలో ఆలయానికి చేరుకుని ఉత్సవ విగ్రహాలను చెక్కాడనీ… అందులో భాగంగా ఆ మూర్తులకు మనుషులకు ఉన్నట్లుగా పుట్టుమచ్చలు కూడా పెట్టాడనీ… అవి ఇప్పటికీ భక్తులకు కనిపిస్తాయనీ అంటారు.

గర్భగుడిలో శయనరూపంలో దర్శనమిచ్చే స్వామి దివ్యమంగళస్వరూపాన్ని చూసి తరించాల్సిందే. శేషతల్పంపైన స్వామి విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉంటే… సీతాదేవి పాదసేవ చేస్తున్నట్టు, లక్ష్మణుడు వింజామర వీస్తున్నట్లుగా కనిపించడం విశేషం. స్వామిని పూజించే భక్తులు… ఆ తరువాత ఈ ప్రాంగణంలో ఉన్న రామలింగేశ్వరస్వామి ఉపాలయాన్నీ, హనుమంతుడినీ కూడా దర్శించుకోవచ్చు. శివాలయంలో వినాయకుడూ కొలువుదీరి తండ్రితోపాటుగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ. దేవతామూర్తుల్ని పూజించాక… స్వామి సేదతీరే అద్దాలమండపాన్నీ చూడొచ్చు. అలాగే… భక్తులు రాసిన రామకోటి ప్రతులను నిక్షిప్తం చేసి స్థూపంగా మార్చిన రామకోటి స్థూపం కూడా ఆకట్టుకుంటుంది.

శ్రీరామ పుష్కరిణిగా పిలిచే ఇక్కడున్న కోనేటికి ఔషధగుణాలున్నాయని చెబుతారు. అనారోగ్యాలతో బాధపడేవారు స్వామిని పూజించి ఈ ప్రాంగణంలో నిద్రించి, తీర్థప్రసాదాలను స్వీకరించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అలా నిద్రించినప్పుడు… స్వామి కలలో కనిపించి అనారోగ్యాలను నయం చేస్తాడని నమ్మకం. అలాగే అనారోగ్య సమస్యలు తీరేందుకూ, కోరిన కోర్కెలు నెరవేరేందుకూ మొక్కుకునే భక్తులు… ఇక్కడున్న ఇల్లంద వృక్షాలకు ముడుపులు కట్టేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆలయంలోని స్వామికి రోజువారీ చేసే పూజలతోపాటు… శ్రీరామనవమిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా పదమూడు రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలను చూసి తీరాల్సిందే. అదేవిధంగా ఉత్సవ విగ్రహాలను విడిగా గ్రామంలోని మరో ఆలయంలో ఉంచుతారు. ఇక, సీతారాముల కల్యాణం అయిన మూడు నెలల వరకూ భక్తులు ఇక్కడకు వచ్చి స్వామిని పూజించి… శక్తికొలదీ కానుకలు సమర్పించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.

ఎలా చేరుకోవాలి..
ఈ ఆలయం కరీంనగర్‌ జిల్లా నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్‌ జమ్మికుంట వరకూ రైలు లేదా బస్సుల్లో చేరుకుంటే… అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి వెళ్లేందుకు ఆటోలు ఉంటాయి.

Share This Article
Leave a comment