సాగర సంగమ తీరాన, వేదనాదం మార్మోగే పవిత్ర క్షేత్రంలో కొలువుదీరిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య పరిణయోత్సవాలు ఆదివారం రథసప్తమితో ఘనంగా ప్రారంభం కానున్నాయి. సూర్యభగవానుడి జన్మదినంగా భావించే ఈ పుణ్యవేళ, స్వామి–అమ్మవారి కల్యాణ ఘట్టానికి తొలి అడుగుగా నిలవనుంది. పది రోజుల పాటు భక్తి, సంప్రదాయం, ఉత్సవ వైభవం కలగలిసిన ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

తొలిపొద్దు చీకట్లను చీల్చుకుంటూ ఉదయించే బాలభానుడి కాంతులు సాగర అలలపై ప్రతిబింబించే ఈ క్షేత్రంలో, రథసప్తమి నాడు దర్శనం పొందితే పాపనాశనం కలుగుతుందన్న విశ్వాసం ఉంది. ఆరోగ్యప్రదాత అయిన సూర్యుని సాక్షిగా ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు, అంతర్వేదిని ఆధ్యాత్మిక కాంతులతో వెలిగించనున్నాయి.
ముద్రికాలంకరణతో ఉత్సవాలకు శ్రీకారం
ఈనెల 25వ తేదీ (ఆదివారం) ఉదయం స్వామివారికి విశేషార్చనలు నిర్వహించి, సూర్య వాహనం, చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం ముద్రికాలంకరణ ఘట్టంతో స్వామి–అమ్మవారిని నూతన వధూవరులుగా అలంకరిస్తారు. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం, ఈ కార్యక్రమం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
26వ తేదీన హంస, శేష వాహనాలపై గ్రామోత్సవం, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 27వ తేదీన హనుమద్వాహనం, సింహవాహన సేవలతో క్షేత్రం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది.
పరిణయ మహోత్సవం… అర్ధరాత్రి కల్యాణ ఘట్టం
28వ తేదీన పంచముఖ ఆంజనేయస్వామి, కంచు గరుడ వాహనాలపై స్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహిస్తారు. అదే రోజు అర్ధరాత్రి 1.56 గంటలకు అత్యంత పవిత్రమైన కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. స్వామి–అమ్మవారి మాంగల్య ధారణ ఘట్టం వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.

దివ్య రథోత్సవం – భక్తుల ప్రధాన ఆకర్షణ
29వ తేదీన మధ్యాహ్నం 2.05 గంటలకు దివ్య రథోత్సవం ప్రారంభమై 16 కాళ్ల మండపం వరకు సాగుతుంది. స్వామి వారి రథాన్ని లాగేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చి తమ భక్తిని చాటుకుంటారు. 30వ తేదీన గజ, పొన్న వాహనాలపై ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు.
31వ తేదీన రాజాధిరాజ, అశ్వ వాహనాలపై గ్రామోత్సవం నిర్వహించడంతో పాటు పండిత సదశ్యం జరుగుతుంది. అదే రోజు 16 కాళ్ల మండపం వద్ద చోర సంవాద ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
చక్రస్నానోత్సవంతో పరమ పావనం
ఫిబ్రవరి 1న పౌర్ణమి సందర్భంగా చక్రస్నానోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. సాగర సంగమంలో స్వామి చక్రస్నానం చేయడం ద్వారా క్షేత్రం పరమ పావనంగా మారుతుందని భక్తుల విశ్వాసం. ఫిబ్రవరి 2న పుష్పక, హంస వాహనాలపై గ్రామోత్సవం, తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆలయంలో శ్రీపుష్పయాగం, పవళింపు సేవలతో ఈ పది రోజుల దివ్య పరిణయోత్సవాలు ముగియనున్నాయి. భక్తుల సౌకర్యార్థం రవాణా, భద్రత, వసతి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సుమారు 1500 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత కల్పించడంతో పాటు, తీర్థ ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సాగర సంగమం సాక్షిగా, సూర్యభగవానుడి ఆశీస్సులతో ప్రారంభమవుతున్న ఈ దివ్య పరిణయోత్సవాలు… అంతర్వేదిని మరోసారి ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలపనున్నాయి.
