
‘రోజుకో గుడ్డు తింటే మంచిది’ అన్నమాటని ఇప్పుడు మనం పిల్లలకే పరిమితం చేస్తున్నాం. ముప్పై ఏళ్లు దాటాక రోజూ గుడ్డు తింటే చెడుకొవ్వు (ఎల్‌డీఎల్) పెరుగుతుందని భయపడుతున్నాం. చెడు కొవ్వులే తీవ్ర హృద్రోగ సమస్యలకి దారితీస్తుంటాయి కాబట్టి ఎగ్స్‌కి దూరంగా ఉండటం మంచిదనే భావన అందరిలోనూ ఉంటోంది. కానీ ఇదంతా ఒట్టి అపోహేనని కొట్టిపారేస్తున్నారు సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. గుడ్లు చెడుకొవ్వుని పెంచవు సరికదా బాగా తగ్గిస్తాయని చెబుతున్నారు వాళ్లు. ఎల్‌డీఎల్ పెరుగుదలకి ప్రధానంగా సంతృప్త కొవ్వులే(శాచురేటెడ్ ఫ్యాట్స్) కారణమని అంటున్నారు. బాగా ఉప్పు దట్టించి వేయించి తినే మాంసాహారాల వల్లా, నూనెల వల్లా ఏర్పడే కొవ్వులివి! ‘ఎల్‌డీఎల్ పెరగడానికి కారణమేంటీ గుడ్డా? శాచురేటెడ్ కొవ్వులా?’ అన్నదానిపైన ఇటీవల వాళ్లు విస్తృత పరిశోధన చేశారు. ఈ తరహా పరిశోధన ప్రపంచంలో ఇదే తొలిసారట. ఆస్ట్రేలియాలో కొవ్వుశాతం అధికంగా ఉన్న వ్యక్తులకి రోజూ రెండు గుడ్లు తినమని చెప్పారు. వాళ్ల ఆహారంలో శాచురేటెడ్ కొవ్వులున్న ఆహారాన్నీ తక్కువగా ఉండేలా చూశారు. అలా తీసుకున్న వాళ్లందరిలోనూ ఎల్‌డీఎల్ గణనీయస్థాయిలో తగ్గిందట. కాబట్టి, నూనెల్నీ వేపుళ్లనీ తగ్గించి రోజూ రెండుగుడ్లు తింటే మంచిదేనని వివరిస్తున్నారు.
