నేడే రథసప్తమి.. సూర్యుడిని ఇలా పూజిస్తే అన్నీ శుభాలే!

Telugu BOX Office

భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని ఏడోరోజు సప్తమి తిథిని రథ సప్తమిగా జరుపుకుంటారు. రథసప్తమి నాడు సూర్యభగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలు పెట్టాడు. కనుక దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు.

సూర్యుడి రథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు. ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు నిత్యం స్వారీ చేస్తుంటాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తుంటాడు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు.. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది.

ద్వాదశ రాశులలో సంచారం..
విశ్వం ఒక వృత్తంలా భావిస్తే.. దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణితశాస్త్రం చెబుతోంది. సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలకూ ఆధి దేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు.


ఉత్తర దిశలో ప్రయాణం..
మాఘమాసంలో “అర్క” నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనా, రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయణం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి, పితృ, దేవరుషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు.

శత్రు బాధలు తొలగిపోవడానికి..
సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే ‘యోపం పుష్పం వేదా, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి’ అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ ‘డి’ లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం.. సంధ్యావందనం, సూర్యనమస్కారాలు, ఆర్ఘ్యప్రధానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది.

రథ సప్తమి నాడు నదీ స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. ఈ నమ్మకం కారణంగానే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. రథసప్తమి స్నానాన్ని ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం నాడు ఆచరించాల్సి ఉంది.

ఎవరికైనా పవిత్ర నదులలో స్నానం చేయటం సాధ్యం కాకుంటే గంగా జలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకుని చేసినా ఫలితం ఉంటుంది. రథ సప్తమి నాడు సూర్యభగవానుడిని పూజించవలసిన విధానం విషయానికి వస్తే రథసప్తమి రోజున సూర్యోదయం సమయంలో స్నానం ఆచరించి సూర్యుడికి అభిముఖంగా నిలబడి, అర్ఘ్యం సమర్పించి నమస్కరిస్తారు. అనంతరం నెయ్యి దీపం వెలిగించి ఎర్రటి పువ్వులను సమర్పించి పూజలు చేస్తారు.

ఈ విధంగా సూర్యుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి రథసప్తమి సరైన సమయమని… ఇంట్లో సూర్య యంత్రాన్ని స్థాపించి పూజలు నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. నీళ్లలో ఎర్రచందనాన్ని, బెల్లాన్ని, ఎర్రటి పువ్వులను వేసి, సూర్యుడికి సమర్పిస్తే, ఆదిత్య హృదయాన్ని పఠిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుందని నమ్మకం.

Share This Article
Leave a comment