తొండం లేని వినాయకుడి ఆలయం.. ఎక్కడుందో తెలుసా..

Telugu BOX Office

హిందూ మతంలో ప్రతి ఒక్కరూ ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం ఆనవాయితీ. ఎలాంటి విఘ్నాలు రాకుండా ఆయన చూస్తాడని అందరికీ నమ్మకం. అందుకే గణేశుడిని విఘ్నేశ్వరుడిగానూ పిలుస్తారు. దేశంలోనే అనేక ప్రసిద్ధి చెందిన గణేశుడి ఆలయాలున్నాయి. వీటిలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే తొండం లేకుండా దర్శనమిచ్చే గణేశుడి విగ్రహం ఒకేఒక్కటి ఉంది. తొండం లేని గణేషుడిగా పూజలందుకున్న ఆ ఆలయం రాజస్థాన్‌లో ని ఆరావళి పర్వతం మీద కొలువై ఉంది. గర్ గణేష్‌గా ప్రసిద్ధి చెందిన ఇక్కడ వినాయకుడిని వినాయక చవితి నాడు దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

18వ శతాబ్దంలో జైపూర్ స్థాపన కోసం సవాయి జైసింగ్ గుజరాత్ నుండి పండితులను ఇక్కడికి పిలిపించి అశ్వమేధ యాగం నిర్వహించి గర్ గణేష్ ఆలయాన్ని స్థాపించాడని చెబుతారు. ఈ ఆలయంలో శ్రీ గణేశుడి కళ్ళు చెక్కుచెదరకుండా ఉండటానికి ఆయన ఆశీర్వాదం మొత్తం జైపూర్‌పై ఉండేలా గణేశుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉండే విధంగా ప్రతిష్టించారు. ఆరావళి పర్వతంపై 500 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయానికి చేరుకోవాలంటే 365 మెట్లు ఎక్కాలి. గణేశుడి దర్శనం కోసం ప్రతిరోజూ భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై నిషేధం ఉంది.

ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఆలయంలో జైపూర్ రాజు సిటీ ప్యాలెస్ నుండి నిలబడి హారతి దర్శనం చేసుకునే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. కొండపై ఉన్న గర్ గణేష్, గోవింద్ దేవ్ టెంపుల్, సిటీ ప్యాలెస్, ఆల్బర్ట్ హాల్ ఒకదానికొకటి సమాంతరంగా ఒకే దిశలో నిర్మించబడ్డాయి. దూరం నుంచి చూస్తే దాన్ని గమనించొచ్చు.

ఇక్కడ వినాయకుడిని దర్శించుకునే వారికి గణేశుడిపై ప్రత్యేక విశ్వాసం ఉంటుంది. ఇక్కడికి నిత్యం వచ్చే భక్తులు గణేశుడికి తమ కోరికలను లేఖలల్లో రాసి ఆయన పాదాల దగ్గర ఉంచుతారు. దాన్ని నెరవేర్చమని కోరడంతో పాటు వరుసగా ఏడు బుధవారాలు గఢ్ గణేశుడిని దర్శించుకోవడం ద్వారా కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలో మెట్లు ఎక్కిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద రెండు ఎలుకలను అమర్చారు. భక్తులు ఆ ఎలుకల చెవుల్లో తమ కోరికలు చెబితే వాటిని వినాయకుడి చేరవేస్తాయని విశ్వసిస్తుంటారు.

Share This Article
Leave a comment