అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’… వనదేవతల చరిత్ర ఇదే

Telugu BOX Office

శివసత్తుల పూనకాలతో, కోయదొరల విన్యాసాలతో ఎంతో వైభవంగా జరిగే జాతర ఏదైనా ఉందంటే అది మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరే. అమ్మవార్లకు నివేదించే బంగారాన్ని భక్తులు మహా ప్రసాదంగా స్వీకరించడం, వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడం… ఇలా ఈ వేడుకలో ప్రతి ఘట్టం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సమ్మక్క-సారలమ్మ జాతర… రెండేళ్లకోసారి మాఘమాసంలో నాలుగురోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా కోటిమందికి పైగా భక్తులు తరలివస్తారు. కుంభమేళా తరువాత అతి పెద్ద జాతరగా ప్రసిద్ధి పొందిన ఈ సంబరం తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతుంది.

కోయ గిరిజనుల ఉనికి కోసం పోరాడి వీర మరణం పొందిన సమ్మక్క, -సారలమ్మ జాతర ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడు కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర.1996లోనే ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించారు. మేడారం జాతర గురించి రెండు చారిత్రక ఆధారాలున్నట్లుగా రాష్ట్ర సర్కారు చెప్తోంది. ఈ ఆధారాల ప్రకారం రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి.

మొదటి కథ
13వ శతాబ్దంలో మేడారం కాకతీయ రాజుల పరిపాలనలో ఉండేది. అడవిలో గిరిజనులు ఒకరోజు వేటకు వెళ్లగా అక్కడ సింహాలు కాపలాగా ఉన్న పసిపాపను గమనించారు. ఆ పాపను వారు దైవ స్వరూపంగా భావించారు. ఆమెకు ‘సమ్మక్క’ అని పేరు పెట్టారు. పెరిగి పెద్దయిన తర్వాత గిరిజన రాజైన పగిడిద్ద రాజుతో పెండ్లి చేశారు. వారికి జంపన్న, సారలమ్మ, నాగులమ్మ అనే ముగ్గురు పిల్లలు కలిగారు. ఓసారి మేడారంలో కరువు కాటకాలు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో కప్పం కట్టమని మేడారాన్ని పాలిస్తున్న కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పగిడిద్ద రాజుకు ఆదేశం పంపాడు. తమకు పంటలు లేవని, కప్పం చెల్లించలేమని పగిడిద్ద రాజు వేడుకున్నాడు. అయినా పట్టించుకోని ప్రతాపరుద్రుడు గిరిజనులపై యుద్ధం ప్రకటించాడు. ‘‘సంపంగి వాగు” అనే ప్రాంతం దగ్గర భీకర యుద్ధం ప్రారంభం అయ్యింది. శత్రుసైన్యం పగిడిద్ద రాజును వెనకనుండి పొడిచి చంపారు.

ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క, కూతురు సారలమ్మ, అల్లుడు గోవిందరాజు యుద్ధంలోకి ప్రవేశించారు. సమ్మక్క అసామాన్య యుద్ధ ప్రతిభకు కాకతీయ సైన్యం కనుమరుగు కాసాగింది. దీంతో భ్రాంతి చెందిన శత్రుసైన్యం సమ్మక్క, సారలమ్మలను కూడా వెనుకనుండి పొడిచారు. జంపన్నను చంపి వాగులో పడేశారు. అప్పటినుంచి అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. సమ్మక్క మాత్రం శరీరం నిండా ఉన్న బాణాలతో నడుస్తూ ముందుకు సాగింది. ఆమెను వెతుక్కుంటూ గిరిజనులు వెళ్లారు. కానీ అక్కడ సమ్మక్క కనిపించలేదు. కానీ వారికి చిలకలగుట్ట ప్రాంతం వద్ద ఉన్న నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణె కనిపించింది. సమ్మక్క తల్లి.. కుంకుమ భరిణెగా మారిందని, సారలమ్మ మేడారంలోని కన్నెపల్లిలో వెలిసిందని నమ్ముతారు.

రెండో కథ
13వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా ఇప్పటి జగిత్యాల జిల్లాలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు. తన ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం జరిపించారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు ‘‘పగిడిద్దరాజు’’ కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ప్రతాపరుద్రుడు ఆగ్రహంతో ఉంటాడు.

అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు.

పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు… జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలకల గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది.

సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

మారిన మేడారం జాతర తీరు
సుమారు 900 ఏండ్ల చరిత్ర కలిగిన మేడారం జాతరను1940 వ సంవత్సరం వరకు చిలకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ప్రతీ జాతరకు భక్తులు పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మల చిహ్నంగా మేడారంలో గద్దెలు ఏర్పాటు చేశారు. రాను రాను మేడారం జాతర తీరు మారిపోయింది. మొదట్లో రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు మహా జాతర నిర్వహించేవాళ్లు. మేడారంలోని గద్దెలపైకి జాతర రోజు అమ్మల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను తీసుకు వస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుంచి సుమారు కోటి మందికి పైగా భక్తులు అమ్మలను దర్శించుకుంటారు.

వైభవంగా వేడుకలు
ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ జరగనున్న ఈ జాతరకు వచ్చే భక్తులు మొదట ఊరి పొలిమేరలోని జంపన్నవాగులో స్నానం చేసి తరువాత సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్తారు. ఈ వేడుకలో వెదురుకర్ర, కుంకుమభరిణెల్నే ఉత్సవ మూర్తులుగా కొలుస్తారు. మొదటిరోజు సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజులు, తండ్రి పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. కన్నేపల్లి నుంచి సారలమ్మను పూజారులు తీసుకొస్తే… కొత్తగూడ మండలం పోనుగుండ్లలోని మరో పూజారి బృందం పగిడిద్దరాజుతో బయలుదేరుతుంది. గోవిందరాజులును ఏటూరు నాగారం ప్రాంతంలోని కొండాయి గ్రామం నుంచి తీసుకొస్తారు. చివరగా సమ్మక్కను కుంకుమభరిణె రూపంలో చిలకల గుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు తెచ్చి గద్దెపైన ప్రతిష్ఠిస్తారు. మూడో రోజున భక్తులు బంగారం (బెల్లం), ఇతర కానుకల్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. నాలుగో రోజున దేవతలు వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది.

Share This Article
Leave a comment