Mass Jathara Review: ‘మాస్ జాతర’ రివ్యూ.. రవితేజ హిట్టు కొట్టాడా?

Telugu BOX Office
2.4
‘మాస్’ ఉంది కానీ ‘జాతర’ లేదు

చిత్రం: మాస్‌ జాతర; నటీనటులు: రవితేజ, శ్రీలీల, నవీన్‌ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేశ్, ప్రవీణ్, వీటీవీ గణేశ్, హైపర్‌ ఆది, అజయ్‌ ఘోష్, హిమజ తదితరులు

సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో

ఛాయాగ్రహణం: విధు అయ్యన్న

రచన, దర్శకత్వం: భాను భోగవరపు

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య; 

విడుదల తేదీ: 01-11-2025

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ లో ఒక్కో తరహా కథలు ఎక్కువగా వస్తుంటాయి. అలా ప్రస్తుతం గంజాయి కథలు సినిమా ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నాయి. విలన్స్ గంజాయి దందా చేస్తుంటారు లేదా గంజాయిని వరి పండించినట్టు రైతులతో ఎవరికీ తెలియకుండా పండించేస్తుంటాడు. ఆ పండించే రైతుల శ్రమను దోచుకుంటాడు. వారి రక్షించడానికి హీరో వస్తాడు. విలన్ కు బుద్ధి చెబుతాడు. లేదంటే హీరోనే… ఓ గొప్ప సమాజ కార్యం కోసం తప్పు అని తెలిసినా హీరోయిన్ తో కలిసి గంజాయి వ్యాపారం చేసేస్తుంటాడు. ఆ తర్వాత గంజాయి దందా వల్ల సమాజానికి జరుగుతున్న అన్యాయం తెలుసుకుని తన పైన ఉన్న బాస్ ను అంతం చేసేసి, మంచోడిగా మారిపోతాడు.  దాదాపుగా ఇలాంటి కథలే ఇప్పుడు టాలీవుడ్ లో రాజ్యమేలుతున్నాయి. తాజాగా మాస్ మహరాజా రవితేజ, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘మాస్ జాతర’ కూడా అలాంటి కథే.

కధేంటి?

ఖాకీ కథలు రవితేజకు బాగా అచ్చొచ్చిన జానర్‌. ‘క్రాక్‌’, ‘పవర్‌’, ‘విక్రమార్కుడు’.. ఇలా ఆయన కెరీర్‌లో పోలీస్‌ కథలతో కొట్టిన హిట్లు అనేకం. ఇప్పుడాయన ‘మాస్‌ జాతర’ కోసం రైల్వే పోలీస్‌గా మారారు.  ఇది రవితేజ (Raviteja) 75వ చిత్రం. అంటే ఓ లాండ్ మార్క్ మూవీ! అలాంటి సినిమా ఎంత కొత్తగా ఉండాలి? దాని కోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలి? అదేమీ లేకుండా రొటీన్ మీటర్ లో మూవీని చుట్టేస్తే లాభం ఏమిటీ? విలన్ క్రూరత్వం, హీరో ఎలివేషన్, నాలుగు కామెడీ సీన్స్, వాటిని మ్యాచ్ చేస్తూ ఐటమ్ సాంగ్స్ ను తలపించే మూడు నాలుగు పాటలు! క్లయిమాక్స్ ఫైట్ లో పునకాలు వచ్చేలా దండకాలు నేపథ్యంలో తలలు నరికేయడాలు? ఇదే ఇవాళ్టి సినిమా ఫార్ములా. దానికి కాస్తంత కూడా అటూ ఇటూ వెళ్ళకుండా జాగ్రత్త పడుతూ దర్శకుడు భాను భోగవరపు (Bhanu Bhogavarapu) ‘మాస్ జాతర’ మూవీని తీశాడు.

పోలీస్ అవ్వాలన్నది లక్ష్మణ్‌ భేరీ (రవితేజ) చిన్నప్పటి కోరిక. అయితే నిజాయితీ పరుడైన కొడుకును, కోడలిని పోగొట్టుకున్న అతని తాత (రాజేంద్ర ప్రసాద్ Rajendra Prasad) మనవడికి నచ్చచెప్పి రైల్వే పోలీస్ ను చేస్తాడు. అక్కడైతే రిస్క్ తక్కువ అని చెబుతాడు. కానీ లక్ష్మణ్‌ భేరీ ఎవరి మాట వినేరకం కాదు. అతను ఎక్కడికి ట్రాన్స్ ఫర్ కోసం వెళ్ళినా… రైల్వే స్టేషన్ మాత్రమే కాదు… ఊరు మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తీసుకుని శుద్ధి చేసే రకం. అతని ట్రాక్ రికార్డ్ గమనించిన పై అధికారి అజిత్ నారాయణ ఉత్తరాంధ్రలోని ‘అడవివరం’కు పంపుతాడు. అక్కడ గంజాయి వ్యాపారాన్ని చేసే శివుడు (నవీన్ చంద్ర)కు లక్ష్మణ్‌ భేరీ ఎలా బుద్ధి చెప్పాడన్నదే మిగతా సినిమా. వయసు దాటిపోతున్నా తాత కారణంగా పెళ్ళి పెటాకులు లేకుండా ఉండిపోయిన లక్ష్మణ్‌ భేరీకి అడివి వరంలో గంజాయి వనంలో తులసి మొక్కలా తులసీ (శ్రీలీల Sreeleela) అనే అమ్మాయితో పరిచయం అయ్యి అది ప్రేమగా మారుతుంది. ఊహించని ట్విస్ట్ లతో సాగే ఆ లవ్ ట్రాక్ ఎలా సుఖాంతం అయ్యిందన్నది మరో కథ!

ఎలా ఉంది?

ఇందులో హీరో రైల్వే పోలీస్ కావడంతో ‘ట్రాక్’ అనే పదాన్ని బాగానే యూజ్ చేశారు. మాస్ మహరాజ రవితేజ ట్రాక్ రికార్డ్ ను చూసి, ఆయనకు ఇలాంటి కథలే సూట్ అవుతాయని ఈ కథను రాసుకుని, ఆయనతో చేసినట్టుగా ఉంది తప్పితే ఎలాంటి కొత్తదానికీ మేకర్స్ ప్రయత్నించలేదు. చిత్రం ఏమంటే… సినిమా ప్రారంభంలోనే కథ ట్రాక్ తప్పేసింది. అక్కడ నుండి ముగింపు వరకూ ఎక్కడా మళ్ళీ ట్రాక్ అనేది ఎక్కలేదు. రవితేజ నుంచి కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్, మాస్‌ యాక్షన్‌ అంశాల్ని మేళవిస్తూనే ఆయన ఒకప్పటి బెంచ్‌ మార్క్‌ హిట్స్‌ను గుర్తు చేసుకునేలా కొన్ని హైమూమెంట్స్‌ను అందించే ప్రయత్నం చేశారు. అవన్నీ ఫ్యాన్స్‌కు విజిల్‌ మూమెంట్సే. అయితే కథలో కొత్తదనం కనిపించలేదు. రవితేజ ఇప్పటికే ఇలాంటి రొటీన్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చాలా చేసేశాడు కదా అని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. రవితేజలోని హైఎనర్జీని రుచి చూపిస్తూ మంచి యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఆయన పాత్రను తెరకు పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఆ వెంటనే తన కుటుంబ నేపథ్యాన్ని.. తాతతో ఉన్న అనుబంధాన్ని.. పెళ్లి కాకపోవడానికి వెనకున్న కారణాల్ని ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు. శివుడిగా నవీన్‌చంద్ర విలనిజాన్ని.. తన గంజాయి స్మగ్లింగ్‌ దందాను పరిచయం చేస్తూ కథలో సంఘర్షణకు బీజం వేసిన విధానం ఫర్వాలేదనిపిస్తుంది. హీరో అడవివరంకి ట్రాన్స్‌ఫర్‌ అవడం.. అక్కడ తనకు శివుడి గ్యాంగ్‌కు మధ్య జరిగే చిన్నపాటి గొడవలతో కథ కాస్త వేగం పుంజుకుంటుంది. ప్రీక్లైమాక్స్‌లో రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌గా హనుమాన్‌ భేరి పాత్రలో రాజేంద్రప్రసాద్‌ చేసే యాక్షన్‌ హంగామా అలరిస్తుంది.   కథ కొత్తగా లేకపోయినా ఫర్వాలేదు. కనీసం సన్నివేశాలనైనా కొత్తగా తీయాలి కదా! అదీ ఇందులో లేదు. ఇటీవల వస్తున్న గంజాయి బ్యాక్ డ్రాప్ కధలను జనాలు చూసి చూసి విసిగిపోయారు. పూర్తి స్థాయిలో దాని మీదే తీసిన ‘ఘాటీ’ (Ghaati) డిజాస్టర్ అయింది. అయినా కూడా మనవాళ్లు మారినట్లుగా కనిపించడం లేదు.

ఎవరెలా చేశారంటే

ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎవరికి వారు కంఫర్ట్ జోన్ లో హాయిగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. రవితేజను స్క్రీన్ మీద అందంగా చూపించడానికి సినిమాటోగ్రాఫర్ విధూ అయ్యన్న బాగానే కష్టపడ్డాడు. శ్రీలీల కొన్ని కీలక సన్నివేశాల్లో తేలిపోయింది. డైరెక్టర్ భాను ‘గ్యాంగ్ లీడర్’లో చిరంజీవి – విజయశాంతి టైపులో అంటూ ఏదేదో చెప్పారు కానీ ఇక్కడ అంత సీన్ లేదు. రాజేంద్ర ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినవి ప్రగల్భాలే! నరేశ్‌ పాత్రనూ సరిగా ఉపయోగించుకోలేదు. అజయ్ ఘోష్, హైపర్‌ ఆది, ప్రవీణ్‌, సముద్రఖని, తారక్ పొన్నప్ప, వీటీవీ గణేశ్‌, నవ్య సామి ఆ పాత్రల పరిధి మేరకు నటించారు. విధూ అయ్యన్న సినిమాటోగ్రఫీ బాగుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం మోత తప్ప శ్రావ్యంగా అనిపించలేదు. చూస్తుంటే ఆయన కూడా తమన్ బాటలోకి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తోంది  ఓవరాల్‌గా చూస్తే నిర్మాత సూర్యదేవర నాగవంశీకి మళ్లీ షాక్ తప్పేలా లేదు.

‘మాస్’ ఉంది కానీ ‘జాతర’ లేదు
2.4
Acting 3
Direction 2
Music 2
Production Values 2.5
Share This Article
Leave a review