తమిళనాడు సీఎం విజయ్ చివరి చిత్రం ‘జన నాయకుడు’.. మూవీ రివ్యూ

అభిమానులకు మాత్రమే నచ్చే ‘జన నాయకుడు’

Telugu BOX Office
Highlights
  • విజయ్, మమితా బైజు నటన
  • యాక్షన్ ఎపిసోడ్స్
  • అనిరుధ్ మ్యూజిక్
2.5
Review Overview

Jana Nayagudu Movie Review & Rating: దళపతి విజయ్ కథానాయకుడిగా, హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘జన నాయగన్’ తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. మమిత బైజు, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియమణి, నాజర్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించగా, సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. దర్శకుడు అనిల్ రావిపూడి అందించిన మూల కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

సెన్సార్ వివాదాలు.. విడుదల కష్టాలు

వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావలసి ఉంది. అయితే రాజకీయ కారణాలు, సెన్సార్ పరమైన చిక్కులు, ఇతర ఒడుదొడుకుల కారణంగా విడుదల ఆలస్యమైంది. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుని, విజయ్ సీఎం పీఠాన్ని అధిష్టించిన తర్వాత.. పైరసీ భయాలు, సెన్సార్ కష్టాలన్నింటినీ దాటుకుని ఎట్టకేలకు ఈ చిత్రం గురువారం (జూలై 23, 2026) థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తోంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం…

కథాంశం

దళపతి వెట్రి కొండాన్ (విజ‌య్‌) ఓ జైలులో ఖైదీగా జీవితం గడుపుతుంటాడు. జైలుపై దాడి చేసిన ఒక ముఠాను ఎదిరించి, నిజాయితీపరుడైన జైలర్ (గౌతమ్ మేనన్) దృష్టిలో పడతాడు. జైలర్ సాయంతో ఆగస్టు 15న క్షమాభిక్షపై బయటకు వస్తాడు వెట్రి. అయితే అంతలోనే ఆ అధికారి ప్రమాదవశాత్తు మరణించడంతో, ఆయన కుమార్తె విజ్జి (మమిత బైజు)ని పెంచే బాధ్యతను వెట్రి తీసుకుంటాడు. చిన్నతనంలో తల్లి దారుణంగా హత్యకు గురవడం చూసిన విజ్జి, భయంతో పిరికిదానిలా మారుతుంది. ఆమెలోని భయాన్ని పోగొట్టి ధైర్యవంతురాలిగా మార్చి, ఆర్మీలో చేర్పించాలని వెట్రి శ్రమిస్తుంటాడు.

మరోవైపు, గతంలో రోజా రంగస్వామి (ప్రకాశ్ రాజ్) అనే దుర్మార్గుడైన రాజకీయ నాయకుడి వల్ల తీవ్ర అవమానానికి గురై, వ్యవస్థపై పగబట్టిన మాజీ పోలీస్ అధికారి అమ్రేష్ పూజారి/జాన్ హిమ్లర్ (బాబీ డియోల్) అంతర్జాతీయ క్రిమినల్‌గా మారతాడు. ఎమ్.ఎమ్ పేరుతో భారతదేశంలో విద్వేషాలు రగిల్చేందుకు కుట్ర పన్నుతాడు. ఈ క్రమంలో విజ్జిని లక్ష్యంగా చేసుకుని ఆమెను అంతం చేసేందుకు ముఠాను పంపుతాడు. అసలు అంతర్జాతీయ క్రిమినల్ జాన్ హిమ్లర్ విజ్జిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు?… విజ్జిని వెట్రి ఎలా కాపాడుకున్నాడు?… దేశాన్ని నాశనం చేయాలనుకున్న విలన్ కుట్రలను వెట్రి ఎలా తిప్పికొట్టాడు? అనేది తెరపై చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే..

  • విజయ్: వెట్రి పాత్రలో తనదైన మాస్ మేనరిజమ్స్, యాక్షన్ సన్నివేశాలు, పంచ్ డైలాగులతో చెలరేగిపోయారు. ముఖ్యంగా ‘కచ్చేరీ’ పాటలో ఆయన వేసిన స్టెప్పులు థియేటర్లలో అభిమానులకు పండగ వాతావరణం తెస్తాయి. తన రాజకీయ ఆశయాలకు అనుగుణంగా ఉన్న సన్నివేశాల్లో విజయ్ పవర్ ఫుల్ నటనను కనబరిచారు.
  • మమిత బైజు: విజ్జి పాత్రలో భయం, ధైర్యం కలగలిపిన హావభావాలతో మెప్పించింది. క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె చేసిన పోరాటాలు ఆకట్టుకుంటాయి.
  • బాబీ డియోల్: అమ్రేష్ పూజారి అలియాస్ జాన్ హిమ్లర్ పాత్రలో నెగెటివ్ షేడ్స్‌ను అద్భుతంగా పండించారు. ద్వితీయార్ధంలో ఆయన పాత్రలో వచ్చే మార్పులు మంచి డ్రామాను పండించాయి.
  • పూజా హెగ్డే పరిధి తక్కువే ఉన్నప్పటికీ తెరపై హుందాగా కనిపించింది. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ మేనన్, నాజర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సినిమా ఎలా ఉందంటే..

తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన విజయవంతమైన ‘భగవంత్ కేసరి’ స్ఫూర్తితో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్రథమార్థం దాదాపుగా మాతృకను అనుసరిస్తూ సాగుతుంది. తండ్రి స్థానంలో ఉన్న కథానాయకుడు, భయస్తురాలైన అమ్మాయిని ధైర్యవంతురాలిగా మార్చే క్రమం ‘భగవంత్ కేసరి’ని గుర్తుచేస్తుంది. అయితే దర్శకుడు హెచ్. వినోద్ ఈ కథకు అంతర్జాతీయ క్రిమినల్ బ్యాక్‌డ్రాప్, తీవ్రవాద కోణాన్ని జోడించి కాన్వాస్‌ను పెంచారు. ద్వితీయార్ధంలో సింహభాగం విజయ్ రాజకీయ అజెండా, తమిళనాడు రాజకీయ విమర్శలు, వారసత్వ-మత రాజకీయాలపై ఎక్కుపెట్టిన విమర్శలతో సాగుతుంది. విజయ్ అభిమానులకు, టీవీకే కార్యకర్తలకు ఈ సన్నివేశాలు పూనకాలు తెప్పిస్తాయి. అయితే రాజకీయ అంశాలు, వాణిజ్య అంశాలు ఎక్కువవడం వల్ల మాతృకలో ఉన్న ప్రధాన భావోద్వేగాలు (గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ వంటి అంశాల తీవ్రత) కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

  • విజయ్ ఎనర్జీ, డ్యాన్సులు, పవర్ ఫుల్ ఎలివేషన్ సీన్స్ సినిమాకి ప్రధాన బలం.
  • ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతూ రాసుకున్న సన్నివేశాలు అభిమానులను బాగా అలరిస్తాయి.
  • అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ థియేటర్లలో హై ఇస్తాయి.

మైనస్ పాయింట్స్

  • విలన్ ప్లాట్ పెద్దది చేయడం వల్ల, ప్రధాన పాత్రల మధ్య ఉండాల్సిన మాతృక స్థాయి భావోద్వేగాలు మరుగున పడ్డాయి.
  • సెకండాఫ్‌లో రాజకీయ డ్రామా ఎక్కువై సినిమా కాస్త నెమ్మదించిన భావన కలుగుతుంది.
  • తెలుగు డబ్బింగ్‌లో కొన్ని చోట్ల నాణ్యత తగ్గడం, విజువల్ ఎఫెక్ట్స్ సాధారణంగా ఉండటం నిరాశపరుస్తుంది.

ముగింపు

మొత్తంగా ‘జన నాయకుడు’ చిత్రం దళపతి విజయ్ అభిమానులకు, మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక పూర్తి స్థాయి విజువల్ ఫీస్ట్. ‘భగవంత్ కేసరి’ భావోద్వేగాలను పూర్తిగా మోసుకురాకపోయినా, విజయ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా హెచ్. వినోద్ తీర్చిదిద్దిన మాస్ ఎలివేషన్లు, పొలిటికల్ డ్రామా ప్రేక్షకులను అక్కడక్కడా మెప్పిస్తాయి. అయితే నిడివి ఏకంగా 3 గంటలు ఉండటంతో చాలాసీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విజయ్ రాజకీయ పార్టీ టీవీకే మొన్నటి ఎన్నికల్లో బ్లాక్‌బస్టర్ కొట్టినట్లుగా మాత్రం ‘జన నాయకుడు’ మెప్పించలేకపోయింది.

Review Overview
2.5
Acting 3
Direction 2
Music 3
Production Values 2
Share This Article
Leave a review