‘కొరియన్ కనకరాజు’ మూవీ రివ్యూ: కామెడీతో మెప్పించిన ఇండో-కొరియన్ రైడ్!

Telugu BOX Office
2.6
Review Overview

వరుస పరాజయాలతో ఈ మధ్య కాస్త వెనకబడిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్‌ కొట్టాలనే పట్టుదలతో చేసిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాలతో మార్క్ కామెడీ అందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రచార చిత్రాలు, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ విశేషమైన ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఒక కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ యువకుడి శరీరంలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. కమెడియన్ సత్య పూర్తిస్థాయి పాత్రలో ఉండటం కూడా ప్రాజెక్ట్‌కి ప్లస్ పాయింట్‌గా మారింది. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘కొరియన్ కనకరాజు’ థియేటర్లలో ఏ స్థాయిలో నవ్వించాడో, అంచనాలను ఏమేరకు అందుకున్నాడో పూర్తి రివ్యూలో చూద్దాం.

కథాంశం (Story):

అనంతపురం జిల్లాలోని పెనుగొండకు చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) ఒక సాధారణ యువకుడు. ఊళ్ళో చెక్క భజన బృందాన్ని నడుపుతూ, దాంతో వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అతని ప్రాణస్నేహితుడు కిష్టప్ప (సత్య) ఒక స్థానిక ఫోటోగ్రాఫర్. ఊళ్ళో ఉండే చెంగారెడ్డి (సునీల్), అతని గ్యాంగ్‌తో కనకరాజుకి తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇదిలా ఉండగా, పెనుగొండలోని ప్రసిద్ధ కియా కార్ ఫ్యాక్టరీలో పనిచేసే చైత్ర (రితిక నాయక్)ను చూసి కనకరాజు మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. చైత్రకు కొరియా సంస్కృతి, కొరియా దేశం అంటే విపరీతమైన పిచ్చి.

మరోవైపు కొరియాలో చనిపోయిన ఒక గ్యాంగ్‌స్టర్ అస్థికలు ఉన్న సీసా అనుకోకుండా చేతులు మారి పెనుగొండకు చేరుకుంటుంది. చెంగారెడ్డి మనుషులతో గొడవపడుతున్న సమయంలో, కనకరాజు అనుకోకుండా ఆ సీసా మూత తీసి అందులోని ద్రవాన్ని మందులో కలుపుకుని తాగేస్తాడు. దాంతో ఆ కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ వచ్చిన తర్వాత కనకరాజు ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ ఎలా మారాయి?, ఆ ఆత్మ తన కోరిక తీర్చుకోవడానికి కనకరాజు, కిష్టప్పలను కొరియాకు ఎలా తీసుకెళ్ళింది?, అసలు ఆ ఆత్మ వెనుక ఉన్న అసలు కథేంటి? చివరికి కనకరాజుకు ఆ ఆత్మ నుంచి విముక్తి కలిగిందా లేదా అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే:

ఫాంటసీ, హారర్ కామెడీ సినిమాల్లో లాజిక్స్ వెతకడం కంటే ఎంతసేపు వినోదం పంచారనేదే ముఖ్యం. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ విషయంలో పూర్తి స్పష్టతతో వ్యవహరించారు. పాత ఆత్మల కాన్సెప్ట్‌నే తీసుకొని దానికి ‘ఇండో – కొరియన్’ బ్యాక్‌డ్రాప్ జోడించి కొత్తగా ప్రెసెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

ఫస్ట్ హాఫ్: ప్రారంభంలో పాత్రల పరిచయాలు, హీరో-హీరోయిన్ల ట్రాక్, సాధారణ ఫైట్స్‌తో కాస్త సాదాసీదాగా సాగుతుంది. అయితే కొరియన్ యువకుడితో బార్‌లో హీరో, సత్య చేసే రచ్చతో సినిమా అసలు ట్రాక్‌లోకి ఎక్కుతుంది. ఆత్మ హీరో శరీరంలోకి ప్రవేశించిన క్షణం నుంచి కథ వేగం పుంజుకుంటుంది. యాక్షన్ సీన్స్, కామెడీ ట్రాక్స్ సమపాళ్ళలో కుదిరి ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్‌పై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తుంది.

సెకండ్ హాఫ్: కథ కొరియాకు మారిన తర్వాత విజువల్స్ స్టైలిష్‌గా మారతాయి. హీరోలో ఉన్న ఆత్మ చేసే విచిత్రమైన పనులు, తనని చంపిన వారి కోసం వెతకడం, మరోవైపు సత్య, మురళీధర్ గౌడ్‌లు వీడియో కాల్ ద్వారా చేసే క్షుద్రపూజల ఎపిసోడ్ థియేటర్‌లో నవ్వుల పువ్వులు పూయిస్తాయి. మధ్యలో బుల్లిరాజు కామెడీ ట్రాక్ కాస్త సాగదీసినట్లు అనిపించినా, క్లైమాక్స్ ముందు ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే క్లైమాక్స్ ఘట్టంలో ఆత్మల మధ్య జరిగే పోరాట సన్నివేశాలు కాస్త సిల్లీగా అనిపిస్తాయి. ఎమోషనల్ ముగింపు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అనవసరమైన హడావుడితో ముగించడం కాస్త అసంతృప్తి కలిగిస్తుంది. అలాగే కొన్ని కొరియన్ సంభాషణలకు తెలుగు సబ్‌టైటిల్స్ ఇచ్చి ఉంటే బాగుండేది.

ఎవరెలా చేశారంటే:

వరుణ్ తేజ్: కనకరాజుగా రాయలసీమ కుర్రాడిగానూ, అలాగే కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ఆవహించిన వ్యక్తిగా రెండు విభిన్నమైన షేడ్స్‌లో అద్భుతంగా నటించాడు. గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్తగా, స్టైలిష్‌గా ఉన్నాయి.

సత్య: ఈ సినిమాకి సత్య ప్రధాన బలమని చెప్పాలి. ప్రతీ సీన్‌లో తన మార్క్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. వరుణ్ తేజ్, సత్య మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగా కుదిరింది.

రితిక నాయక్: కొరియన్ పిచ్చి ఉన్న అమ్మాయిగా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

ఇతర నటులు: సునీల్ విలనిజంలోనూ వినోదాన్ని పంచగా, మురళీధర్ గౌడ్, అవసరాల శ్రీనివాస్ (గెస్ట్ రోల్), వీటీవీ గణేశ్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. కొరియన్ నటీనటులు కూడా తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం:

సంగీతం: ఎస్.ఎస్. తమన్ అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమా స్థాయిని పెంచింది. ముఖ్యంగా యాక్షన్, కామెడీ సీన్లను తమన్ తన ఆర్ఆర్‌తో బాగా ఎలివేట్ చేశారు. పాటలు వినడానికి, చూడటానికి పర్వాలేదనిపిస్తాయి.

సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి కెమెరా పనితనం చాలా బాగుంది. పెనుగొండ లొకేషన్లతో పాటు సెకండ్ హాఫ్‌లో చూపించిన కొరియా విజువల్స్ చాలా గ్రాండ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉన్నాయి.

దర్శకత్వం & నిర్మాణం: మేర్లపాక గాంధీ కథనం కంటే కూడా సందర్బోచిత సంభాషణలు, హస్య సన్నివేశాల రచనపై ఎక్కువ దృష్టి పెట్టి విజయం సాధించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

వరుణ్ తేజ్ వైవిధ్యమైన నటన మరియు లుక్స్

సత్య, మురళీధర్ గౌడ్ లీడ్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ

ఇండో-కొరియన్ బ్యాక్‌డ్రాప్ మరియు కొరియా లొకేషన్స్

తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM)

వీడియో కాల్ క్షుద్రపూజల ఎపిసోడ్

మైనస్ పాయింట్స్:

లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు

కాస్త సిల్లీగా అనిపించే క్లైమాక్స్

కొరియన్ డైలాగ్స్‌కు సబ్‌టైటిల్స్ లేకపోవడం

ఫస్ట్ హాఫ్ ఆరంభంలో సాగదీత

ముగింపు:

మొత్తంగా చెప్పాలంటే, ‘కొరియన్ కనకరాజు’ అనేది పెద్దగా లాజిక్కులు వెతక్కుండా, థియేటర్‌కి వెళ్లి రెండున్నర గంటల పాటు సరదాగా నవ్వుకోవడానికి ఏమాత్రం లోటు లేని పక్కా కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్. చిన్న చిన్న లోపాలు, క్లైమాక్స్ సిల్లీతనాన్ని పక్కన పెడితే… వరుణ్ తేజ్ నటన, సత్య అందించిన నవ్వుల పంట కోసం ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా థియేటర్లలో చూడవచ్చు. కొరియన్ కనకరాజు ప్రేక్షకులకి కావాల్సినంత వినోదాన్ని అందించి నవ్విస్తాడు.

Review Overview
2.6
Acting 3
Story 2
Music 3
Direction 2.5
Production Values 2.5
Share This Article
Leave a review