War 2 Movie Review: ‘వార్ 2’ రివ్యూ.. యాక్షన్ డ్రామా ఎలా ఉందంటే!

Telugu BOX Office
2.9
‘వార్ 2’ తెలుగు రివ్యూ

చిత్రం: వార్ 2

న‌టీన‌టులు: హృతిక్‌రోష‌న్‌, ఎన్టీఆర్‌, కియారా అద్వాణీ, అశుతోష్ రాణా, అనిల్ క‌పూర్‌, దిశా సెహ‌గ‌ల్‌, (అతిథి పాత్ర‌ల్లో) అలియాభ‌ట్‌, బాబీ దేవోల్, శ‌ర్వారీ వాఘ్ త‌దిత‌రులు

క‌థ‌, నిర్మాణం: ఆదిత్య చోప్రా

ద‌ర్శ‌క‌త్వం: అయాన్ ముఖ‌ర్జీ

విడుద‌ల తేదీ: 14-08-2025

 

తెలుగులో టాప్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ కలిసి నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2’ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. సినీ ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్; స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించింది.   2019లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఇదే యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ‘వార్’ చిత్రాన్ని స్పై మూవీగా నిర్మించింది. హృతిక్ రోషన్ తో పాటు టైగర్ ష్రాఫ్ నటించిన ఆ సినిమా ఘనవిజయం సాధించింది. దాని సీక్వెల్ గా వచ్చిన ‘వార్ 2’ పూర్తిగా అదే యాక్షన్ ఫార్ములాతో రూపొందింది. ‘బ్రహ్మాస్త్ర‌ తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది? హృతిక్ రోషన్‌, ఎన్టీఆర్‌ల పోరాటాలు మెప్పించాయా? అన్నది రివ్యూలో తెలుసుకుందాం.

 

కథేంటి..

ఇండియన్ మాజీ ఇంటెలిజెన్స్ ఏజెంట్ కబీర్ ధలీవాల్ (హృతిక్ రోషన్)పై దేశద్రోహి ముద్ర పడుతుంది. తనను ఎంతగానో ప్రోత్సహించిన కర్నల్ సునీల్ లూత్రా (అశుతోశ్ రానా)ను కబీర్ కాల్చి చంపుతాడు. దీంతో కబీర్‌ వల్ల దేశానికి ప్రమాదం ఎదురు కాబోతోందని తెలిసి కేంద్ర ప్రభుత్వం రా అఫీసర్ గా విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్)తో పాటు స్పెషల్ యూనిట్స్ ఆఫీసర్ విక్రమ్ (ఎన్టీఆర్)ను రంగంలోకి దింపుతుంది. తన తండ్రి సునీల్ లూత్రాను చంపిన కబీర్ ను మట్టుపెట్టడానికి వింగ్ కమాండర్ అయిన కావ్యా లూత్రా (కైరా అద్వాణీ) కూడా రంగంలోకి దిగుతుంది. మరి వీరందరూ కలసి కబీర్ ఆట కట్టించారా? భారత దేశాన్ని నాశనం చేయాలని కలిగా ఫామ్ అయిన ఇండియా చుట్టు పక్క దేశాల్లోని ప్రముఖులు ఆడిన ఆటను కబీర్ ఎలా ఎదొర్కొన్నాడు. అసలు కబీర్-విక్రమ్ మధ్య రేస్ లో గెలిచిందెవరు!? అన్నదే మిగతా కథ.

 

ఎలా ఉంది..

ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ క‌థ‌లో హీరో ఎవ‌రు? విల‌న్ ఎవ‌రనే ప్రశ్నే సినీ ప్రియుల్ని ఎక్కువగా ఆకర్షించింది. అయితే ఇది హీరో విల‌న్ల క‌థ కాదు, ఇద్ద‌రు హీరోల క‌థ అని ఆరంభ స‌న్నివేశాల‌తోనే చాటుతూ సినిమాని మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. ఇద్ద‌రు హీరోల ప‌రిచ‌య స‌న్నివేశాలు ప్రేక్షకులతో విజిల్స్ కొట్టిస్తాయి. జ‌పాన్‌లో హృతిక్ ఫైట్‌, నౌక‌లో హ్యాపీ దివాలీ అంటూ ఎన్టీఆర్ చేసే హంగామా ఫస్టాఫ్‌లో ఆకట్టుకుంటుంది. క‌బీర్ కోసం విక్ర‌మ్ వేట మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి అస‌లు సిస‌లు వార్ మొద‌ల‌వుతుంది. వారిద్ద‌రూ ఒక‌రికొక‌రు ఎదురుప‌డ‌టం, ఆ నేప‌థ్యంలో యాక్ష‌న్ స‌న్నివేశాలు థ్రిల్‌ని పంచుతాయి. ముఖ్యంగా స్పెయిన్‌లో సాగే ఛేజింగ్, ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విస్ట్ అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. అయితే ఈ సినిమాకి యాక్షన్ సీక్వెన్సే బలం కాగా అవే మైనస్‌గా మారాయి. మంచి కథ రాసుకుని దానికి తగినట్లు స్క్రీన్‌ప్లే రాసుకుంటే మూవీ మరో స్థాయిలో ఉండేది. కానీ ఇద్దరు పెద్ద హీరోలను పెట్టుకుని నాలుగైదు ఫైట్లతో సినిమా తీసేస్తే ప్రేక్షకులు చూస్తారు అన్నట్లుగా మేకర్స్ ఆలోచనగా తెలుస్తోంది. ‘వార్’ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో పోలిస్తే ‘వార్ 2’ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఎందుకూ పనికిరాడని ప్రేక్షకులు తిట్టిపోస్తున్నారంటేనే సినిమా ఎలా చెడగొట్టాడో అర్థం చేసుకోవచ్చు.

ఎవరెలా చేశారు

హృతిక్ రోషన్‌కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. కబీర్ పాత్రలో అంతలా ఒదిగిపోయాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఎన్టీఆర్‌తో కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ఇక సలామ్ అనాలి అనే సాంగ్‌లో ఇద్దరి డ్యాన్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తుంది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇక ఎన్టీఆర్‌.. విక్రమ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన యాక్షన్ అవతారం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. అయితే కొన్ని సన్నివేశాల్లో ఆయన మొహం పీక్కుపోయినట్లుగా కనిపిస్తుంటుంది. దీనిపై దర్శకుడు శ్రద్ధ పెట్టలేదనే అనిపిస్తోంది. సినిమా మొత్తం ప్ర‌ధానంగా హృతిక్‌, ఎన్టీఆర్ చుట్టూనే సాగుతుంది. దాంతో మిగిలిన పాత్ర‌ల‌కి పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు.

‘వార్ 2’ తెలుగు రివ్యూ
2.9
Actiing 3
Fights 3.5
Music 3
Story 2
Production 3
Share This Article
Leave a review