చిత్రం: నారీ నారీ నడుమ మురారి
నటీనటులు: శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య, నరేశ్, సునీల్, వెన్నెల కిశోర్, సత్య, తదితరులు
సంగీతం: విశాల్ చంద్ర శేఖర్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
విడుదల తేదీ: 14-01-2026
వరుస పరాజయాలతో కొంతకాలంగా కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు హీరో శర్వానంద్. ఒకప్పుడు ‘ప్రస్థానం’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ వంటి సినిమాలతో సాలిడ్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ హీరో, ఇటీవల మాత్రం ఆశించిన స్థాయి హిట్స్‌ను అందుకోలేకపోయాడు. కంటెంట్ ఉన్న సినిమాలు చేసినా… అవి బాక్సాఫీస్ దగ్గర నిలబడకపోవడం శర్వా కెరీర్‌పై ప్రశ్నార్థకం వేసింది. ఇలాంటి సమయంలో… సంక్రాంతి బరిలో చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘నారి నారి నడుమ మురారి’. పెద్దగా హడావుడి లేని ప్రమోషన్లు, కానీ ట్రైలర్ రిలీజయ్యాక ఆసక్తి పెరిగిన ఈ సినిమా… శర్వానంద్‌కు మళ్లీ హిట్ ట్రాక్ తెచ్చిపెడుతుందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథేంటంటే…
ఆర్కిటెక్ట్ గౌతమ్ (శర్వానంద్)… నిత్య (సాక్షి వైద్య)తో ప్రేమలో ఉంటాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన గౌతమ్ తన తండ్రి కార్తిక్ (నరేశ్)ని ఎంతో గౌరవిస్తాడు. వయసు పైబడినా కూడాతండ్రి జీవితంలో ప్రేమ లేకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో ఆయన ప్రేమించిన యువతి పల్లవి (సిరి హనుమంతు)తో గౌతమ్ స్వయంగా పెళ్లి జరిపిస్తాడు. ఇక తన ప్రేమ నిత్యని పెళ్లి చేసుకోవాలనుకుంటే… ఆమె తండ్రి రామలింగయ్య (సంపత్ రాజ్) తొలుత తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. కూతురు బాధను చూడలేక చివరకు ఒప్పుకున్నా… ఒక షరతు పెడతాడు. అదేమిటంటే… రిజిస్టర్ ఆఫీస్‌లోనే పెళ్లి జరగాలి. అలా పెళ్లి దరఖాస్తు కోసం రిజిస్టర్ ఆఫీస్‌కు వెళ్లిన గౌతమ్‌కు ఊహించని సమస్య ఎదురవుతుంది. అక్కడే కథలోకి ఎంటర్ అవుతుంది దియా (సంయుక్త). ఆమె ఎవరు? గౌతమ్‌తో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? పెళ్లి కోసం కొడుకు చెప్పే అబద్ధాల వల్ల కార్తిక్–పల్లవిల దాంపత్య జీవితంలో ఎలాంటి మలుపులు వస్తాయి? చివరకు గౌతమ్–నిత్యల పెళ్లి జరుగుతుందా లేదా? ఈ కథలో లవకుశ (సత్య), గుణశేఖర్ (వెన్నెల కిశోర్), సత్యమూర్తి (సునీల్) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
కథనం ఎలా ఉందంటే…
కామెడీ సినిమాలకు కథ కొత్తగా ఉండాల్సిన అవసరం అంతగా ఉండదు. ప్రేక్షకుడు థియేటర్‌కి వెళ్లి నవ్వాడా? లేదా? అన్నదే అసలు కొలమానం. ఆ విషయంలో దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి తన మార్క్ చూపించాడు. ‘సామజవరగమన’ తర్వాత అదే తరహా క్లీన్ కామెడీని ఈ సినిమాలోనూ కొనసాగించాడు. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా… స్క్రీన్‌ప్లే, డైలాగులు సినిమాను ముందుకు నడిపిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ సీన్ నుంచే నవ్వుల యాత్ర మొదలవుతుంది. ఆరు పదుల వయసులో హీరో తండ్రి ప్రేమ, పెళ్లి… ఆ పెళ్లిని కొడుకే చేయించడం… ఈ కాన్సెప్ట్‌నే ఫుల్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేశాడు దర్శకుడు. గౌతమ్–నిత్యల లవ్‌స్టోరీని ‘పులిహోర’తో ముడిపెట్టి చూపించిన తీరు బాగా వర్కౌట్ అయింది. రిజిస్టర్ ఆఫీస్ ఎపిసోడ్ నుంచి అసలు కథ ఊపందుకుంటుంది. దియా ఎంట్రీతో కథలో ట్విస్ట్ వస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై మంచి ఆసక్తి పెంచుతుంది. ద్వితీయార్ధంలో కామెడీ డోస్ మరింత పెరుగుతుంది. వెన్నెల కిశోర్ ఎంట్రీ, సీమంతం ఎపిసోడ్, విడాకుల పేరుతో నడిచే కోర్ట్ డ్రామా… అన్నీ నాన్‌స్టాప్‌గా నవ్విస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో కథ కాస్త ఎమోషనల్‌గా మారినా… క్లైమాక్స్‌లో మళ్లీ కామెడీతోనే ముగిస్తారు. ఒకటి రెండు డైలాగులు తప్ప ఎక్కడా అసభ్యత లేకుండా… ఫ్యామిలీ మొత్తం చూసేలా సినిమాను తెరకెక్కించారు.
నటీనటుల ప్రతిభ…
గౌతమ్ పాత్రలో శర్వానంద్ పూర్తిగా ఒదిగిపోయాడు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడిగా… అతని ఫ్రస్టేషన్ ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతుంది. శర్వా టెన్షన్ పడే ప్రతిసారి థియేటర్‌లో నవ్వులు ఆగవు. లుక్స్ పరంగానూ చాలా ఫ్రెష్‌గా కనిపించాడు. ఈ సినిమాకు అసలు రెండో హీరో నరేశ్. లేటు వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్న కార్తిక్ పాత్రలో ఆయన జీవించేశాడు. ఆయన రియల్ లైఫ్ ఇమేజ్‌కు ఈ పాత్రకు మధ్య ఉన్న పోలికలు… డైలాగులకు మరింత బలం చేకూర్చాయి. సెకండాఫ్‌లో, ముఖ్యంగా కోర్ట్ సీక్వెన్స్‌లో ఆయన టైమింగ్ అదిరిపోతుంది. సాక్షి వైద్య, సంయుక్త ఇద్దరూ తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు. సత్య, వెన్నెల కిశోర్, సునీల్, సుదర్శన్… ఇలా ప్రతి పాత్రకు సరైన స్పేస్ ఇచ్చి… అక్కడక్కడా నవ్వులు పండించారు. గురువుపై విపరీతమైన ప్రేమ చూపించే గుణశేఖర్ పాత్రలో వెన్నెల కిశోర్ హిలేరియస్‌గా ఉంటాడు.
సాంకేతిక అంశాలు…
భాను భోగవరపు అందించిన కథ, డైలాగులు సినిమాకు పెద్ద ప్లస్. ప్రతి పాత్రకు పంచ్ డైలాగులు పడటం విశేషం. విశాల్ చంద్రశేఖర్ సంగీతం కథకు తగ్గట్లుగా ఉంది. పాటలు పెద్దగా గుర్తుండకపోయినా… నేపథ్య సంగీతం బాగుంది. జ్ఞానశేఖర్, యువరాజ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
బలాలు
- కథా నేపథ్యం, పాత్రల రూపకల్పన
- శర్వానంద్ – నరేశ్‌ల కామెడీ టైమింగ్
- క్లీన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్
బలహీనతలు
– ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా సాగడం
– కథలో కొత్తదనం లేకపోవడం
చివరిగా…
నవ్వాలనిపిస్తే… ఆలోచించకుండా థియేటర్‌కి వెళ్లే సినిమా ‘నారి నారి నడుమ మురారి’. కథలో కొత్తదనం ఆశించకుండా… ఫ్యామిలీతో కలిసి క్లీన్ కామెడీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా సరైన ఎంపిక. శర్వానంద్‌కు ఇది కెరీర్‌లో మరో రిలీఫ్ ఇచ్చే హిట్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు సాలిడ్ ఎంటర్‌టైనర్
రేటింగ్: 3/5
