చిత్రం: ఓజీ
నటీనటులు: పవన్‌కల్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి, శుభలేఖ సుధాకర్, తేజ్ సప్రు, హరీశ్ ఉత్తమన్, రాహుల్ రవీంద్రన్, అభిమన్యు సింగ్ తదితరులు
సంగీతం: తమన్
ఎడిటింగ్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్, మనోజ్ పరమహంస
నిర్మాత: డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి
రచన, దర్శకత్వం: సుజీత్
విడుదల: 25-09-2025

ఈ ఏడాది తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో ‘ఓజీ’ (OG Movie) ఒకటి. అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. సుజీత్ దర్శకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా మొదటగా విడుదలైంది. అయితే భారీ అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలంతా గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ఓజీ’ (OG Movie) మీదనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఓజాస్ గంభీర పాత్రలో పవన్ తెరపై ఎలా విజృంభించారు? ఎలాంటి థ్రిల్ పంచారు? రివ్యూలో తెలుసుకుందాం..
కథేంటి
అనగనగా ఒక రాజు. అతనికి రక్షణగా నిలిచిన ఓ యోధుడు. కానీ, శత్రువుల ప్రార్థనలు ఫలించి ఆ యోధుడు పదేళ్లపాటు కన్నతండ్రిలాంటి రాజుకి దూరమవుతాడు. ఇదే అదనుగా శత్రు మూక చెలరేగిపోతుంది. ఆ రాజుని ఇబ్బందులపాలు చేసి, అతని రాజ్యాన్ని అక్రమ కార్యకలాపాలకి అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తుంది. రాజుకీ, రాజ్యానికీ కష్టం వచ్చిందని తెలిశాక ఆ యోధుడు మళ్లీ తిరిగొచ్చాడు. అతను వచ్చాక ఏం జరిగిందన్నదే ఈ కథ. ఇందులో రాజు సత్యదాదా(ప్రకాష్‌రాజ్), యోధుడు ఓజెస్ గంభీర(పవన్ కళ్యాణ్). చిన్నతనంలో తనని రక్షించిన అండర్ వరల్డ్ డాన్ సత్యదాదాకు కుడిభుజంగా నిలుస్తాడు ఓజీ. ఓ హార్బర్ ను బేస్ చేసుకుని సత్యదాదా తన సామ్రాజ్యాన్ని కొనసాగిస్తుంటాడు. ఇద్దరు కొడుకులున్న సత్య దాదా ఓజీని తన మూడో కొడుకుగా భావిస్తుంటాడు. అయితే అనుకోని అవాంతరం కారణంగా ఓజీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ డాక్టర్ కన్మణి (ప్రియాంక అరుల్ మోహన్)ని పెళ్ళి చేసుకుంటాడు. ఎప్పుడైతే ఓజీ ముంబైని విడిచి వెళ్ళిపోతాడో అప్పుడు సత్యాదాదా ఒకప్పటి స్నేహితుడైన పొలిటీషియన్ మిరాజ్ కర్ (తేజ్ సప్రూ) కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) అండర్ వరల్డ్ పై పట్టు బిగించే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో కొడుకులిద్దరినీ పోగొట్టుకున్న సత్య దాదాకు ఓజీ అవసరం పడుతుంది. మరి సత్యా దాదా కోసం ఓజీ తిరిగి ముంబైకి వచ్చాడా? మిరాజ్ కర్ కొడుకులకు ఓజీ ఎలా బుద్థి చెప్పాడు? ముంబై అండర్ వరల్డ్ ను ఒకప్పుడు గడగడలాడించిన ఓజీ అసలు ఎందుకు అజ్ఞాతం లోకి వెళ్ళాల్సి వచ్చింది?… అన్నది మిగతా కథ.

ఎలా ఉంది
ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ రకంగా చూస్తే ‘ఓజీ’ కోసం సుజీత్ రాసుకున్న కథేమీ కొత్తది కాదు. అయితే హీరో, విలన్ తో పాటు ఇతర పాత్రలకు సుజీత్ ఇచ్చిన ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. జపాన్‌లో కథ మొదలు కావడంతో ఏదో కొత్త విషయాన్ని సుజీత్ చెప్పబోతున్నాడనే భావన ఆడియెన్స్ కు కలుగుతుంది. జపాన్ నుండి ముంబై మహా నగరానికి వచ్చిన తర్వాత సత్యదాదా నేర సామ్రాజ్యాన్ని ఓజీ విస్తరింప చేయడం, పార్లర్‌గా గవర్నమెంట్ నడింపించే వరకూ వెళ్ళడం ఆసక్తికరంగా ఉంది. రొటీన్ అండర్ వరల్డ్ స్టోరీగా ఇది పైకి కనిపించినా… సుజీత్ తనదైన మార్క్ స్క్రీన్ ప్లేతో లేయర్స్ గా ఈ కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. సత్యా దాదా కుటుంబానికి ఓజీ దూరం కావడం, అజ్ఞాతంలో అతను గడిపిన జీవితం, భార్యతో అనుబంధం, కూతురు కోసం పరితపించే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ సాగే బ్లడ్ షెడ్ ఒకింత అసహనానికి గురి చేసినా షార్ప్ ఎడిటింగ్ కారణంగా అదేమంత పెద్ద అవరోధంగా అనిపించదు. 1993లో ముంబై నగరాన్ని కుదిపేసిన బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్ ను జ్ఞప్తికి తెచ్చేలా ఈ కథను సుజీత్ రాసుకున్నాడు. క్యారెక్టర్స్ ఎలివేషన్స్ మీద పెట్టిన శ్రద్థ స్టోరీ మీద పెడితే ‘ఓజీ’ రేంజ్ మరింత పెరిగేది.
ప్రేమకథ, సత్యదాదా – ఓజీ అనుబంధంపై భావోద్వేగ కోణాన్ని ఇంకాస్త బలంగా ఆవిష్కరించాల్సింది. అయితే ఎలివేషన్స్ కారణంగా వీటిని ప్రేక్షకులు పట్టించుకోరు. ఇంటర్వెల్‌కి ముందు, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. పోలీస్ స్టేషన్‌లో సన్నివేశాలు రక్తికట్టిస్తాయి. ఆ తర్వాత నుంచే సినిమా గమనం కాస్త గాడి తప్పినట్టు అనిపిస్తుంది. పలు ఉపకథలతో సాగే సన్నివేశాలు కాస్త గందరగోళంగా అనిపిస్తాయి. సుజీత్ ఈ సినిమా కోసం పలు పార్శ్వాలున్న కథని సిద్ధం చేసుకున్నారు. అది అంతగా హైలైట్ కాలేదు. స్క్రీన్‌ప్లే కూడా ఫ్లాట్‌గానే అనిపిస్తుంది. జానీ సినిమాని గుర్తు చేస్తూ సాగే పతాక సన్నివేశాలు అభిమానుల్లో మరింత జోష్‌ని నింపుతాయి. రెండో భాగానికి కావల్సినంత సరుకు ఈ కథలో ఉంది. పవన్‌కల్యాణ్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కనిపించనంత స్టైలిష్‌గా ఇందులో కనిపించారు. ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తాయి. ఓవరాల్‌గా ఇది పవన్ కళ్యాన్ వన్ మ్యాన్ షో. ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi) కూడా స్టైలిష్‌గా కనిపించినా, కథానాయకుడికి దీటుగా ఆ పాత్రను ఇంకాస్త బలంగా చూపించాల్సింది. కణ్మని పాత్రలో ప్రియాంక మోహన్ అందంగా కనిపించింది. సత్య దాదా పాత్రలో ప్రకాశ్‌రాజ్ (Prakash Raj), గీత పాత్రలో శ్రియారెడ్డి, జిమ్మీగా సుదేవ్ నాయర్, అభిమాన్యు సింగ్ కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. జాకీష్రాఫ్, లాల్ తెరపై కొన్ని క్షణాల పాటు కనిపించి సుజీత్ గతంలో తీసిన ‘సాహో’ సినిమాని గుర్తు చేస్తారు. స్టైలిష్ మేకింగ్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
