Coolie Movie Review: రజినీకాంత్ ‘కూలీ’ మూవీ రివ్యూ

Telugu BOX Office
3
కొత్తదనం లేని కథ

చిత్రం: కూలీ

నటీనటులు: రజనీకాంత్‌, నాగార్జున, సౌబిన్‌ సాహిర్‌, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌, సత్యరాజ్‌, ఆమీర్‌ఖాన్‌ తదితరులు

సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌

నిర్మాత: కళానిధి మారన్‌

రచన, దర్శకత్వం: లోకేశ్‌ కనగరాజ్‌

విడుదల: 14-08-2025

సిల్వర్ స్క్రీన్‌పై రజినీ కనిపిస్తే వచ్చే ఊపు.. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవల్. ఆయన నడిచినా, చూసినా, నవ్వినా, అంతెందుకు జుట్టు సరిచేసుకున్నా, సిగరెట్ తాగినా.. ఆఖరికి గిన్నెలు తోమినా కూడా అందులో కూడా ఒక స్టైల్ ఉంటుంది.. అయితే ఇదేదో తెచ్చిపెట్టుకున్నది కాదు రజినీ స్వభావంలోనే ఆ స్టైల్ ఉంది.. అందుకే 50 ఏళ్లుగా ప్రేక్షకులని ఏమాత్రం బోర్ కొట్టకుండా చేయగలుగుతున్నారు. ఆయన్నుంచి సినిమా వస్తోందంటే సినీ ప్రియులకు పండగే.  ‘జైలర్‌’ సినిమా తర్వాత నటించిన ‘లాలా సలామ్’ ‘వేట్టయాన్‌’ చిత్రాలు ఆశించిన ఫలితం అందుకోలేదు. దీంతో లోకేశ్ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ చిత్రంపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా టైటిల్‌ నుంచి రజనీలుక్‌, సింపుల్‌ ట్రైలర్‌లో సినిమాపై హైప్‌ పెంచేశారు మేకర్స్. ఇందులో విలన్‌గా టాలీవుడ్‌ హీరో నాగార్జున, కీలక పాత్రల్లో బాలీవుడ్‌ నుంచి ఆమిర్‌ఖాన్‌, కన్నడ నటుడు ఉపేంద్ర కనిపించడంతో సినిమాకు మరింత హైప్‌ పెరిగింది. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి రజనీ ‘కూలీ’గా మెప్పించారా?.. లేదా? అన్నది రివ్యూలో తెలుసుకుందాం..

కథేంటి

కింగ్‌పిన్‌ లాజిస్టిక్స్‌ అధినేత సైమన్‌ (నాగార్జున) శక్తిమంతమైన డాన్‌. ప్రభుత్వం నుంచి వైజాగ్‌ పోర్టును 99ఏళ్లకు లీజుకు తీసుకుని అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. అక్కడ ప్రతి దాన్ని నియంత్రించేది నమ్మిన బంటు దయాల్‌ (సౌబిన్‌ షాహిర్‌).  పోర్టులో జరిగే వ్యవహారాన్ని ఎవరు బయట పెట్టాలని చూసినా.. వాళ్లని వెతికి పట్టుకుని అక్కడిక్కడే ప్రాణం తీసేస్తుంటాడు. అలా అంతం చేసిన వారి శవాల్ని సాక్ష్యాధారాల్లేకుండా మాయం చేయడం సైమన్‌ ముఠాకు ఓ సవాల్‌గా మారుతుంది. సరిగ్గా అప్పుడే రాజశేఖర్‌ (సత్యరాజ్‌) కనిపెట్టిన మొబైల్‌ క్రిమేటర్‌ కుర్చీ గురించి తెలుస్తుంది. దాని ప్రత్యేకత గురించి తెలుసుకున్న సైమన్‌.. తన నేరాల్ని కప్పిపుచ్చేందుకు రాజశేఖర్‌ను తనతో కలిసి పనిచేయాలని, లేకపోతే ముగ్గురు కూతుర్లను చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో తప్పక ఆ పని చేసేందుకు కూతురు ప్రీతి (శ్రుతిహాసన్‌)తో కలిసి రంగంలోకి దిగుతాడు. కానీ అంతలోనే అనూహ్యంగా రాజశేఖర్‌ హత్యకు గురవుతాడు. దీంతో ఆ హత్యకు కారణమైన వాళ్లను వెతికి పట్టుకుని.. వాళ్లని తుద ముట్టించేందుకు అతని ప్రాణ మిత్రుడు దేవా (రజనీకాంత్‌) వేటకు సిద్ధమవుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు దేవా ఎవరు? అతని గతమేంటి?, దేవాకు, సైమన్‌కు, సంబంధం ఏంటి? అన్నది మిగతా కథ.

ఎలా ఉంది

లోకేశ్‌ కనకరాజ్‌ కథలన్నీ మాఫియా, డ్రగ్‌, అక్రమ రవాణా ఈ తరహాలోనే ఉంటాయి. ‘కూలీ’ కూడా అలాంటి కథే. ప్రమోషన్స్‌లో ఎక్కడా కూడా కథ గురించి ప్రస్తావించలేదు. ట్రైలర్‌ కట్‌ కూడా సాధారణంగా వదిలాడు. దాంతో ఇంకేదో సినిమాలో ఉందని సినీ ప్రియులు అంచనాలు పెంచుకున్నారు. లగ్జరీ వాచ్‌ల దందా అనేది ఇందులో చూపించాడు. అది కాస్త ఫ్రెష్‌గానే అనిపించింది. అయితే లోకేశ్ తీసింది కొత్త కథేమీ కాదు.. రెగ్యులర్‌ రివేంజ్‌ డ్రామానే తీశాడు. తెలిసిన కథకే బలమైన పాత్రలు జోడించి  ఈ సినిమా తెరకెక్కించాడు. దీనికి ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహాన్ని జోడించాడు. రాజశేఖర్‌ కనిపెట్టిన క్రిమేషన్‌ మెషీన్‌ దగ్గర మొదలైన కథ.. అక్కడి నుంచి అక్రమ రవాణ చేసే ఓ వ్యాపారి, అతని నుంచి విదేశాల్లో ఉండే డాన్‌ వరకూ సాగింది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ నుంచి అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అక్కడి నుంచి ఒక్కో ట్విస్ట్‌ రివీల్‌ అవుతుంది. దయాల్‌ పట్టుబడినప్పటి నుంచి ఫ్లాష్‌బ్యాక్‌ ఏంటనేది రివీల్‌ చేశాడు. స్నేహితుడిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనే దిశగా వెళ్తున్న హీరోకు సైమన్‌ గతం తెలియడం కాస్త ఆసక్తి రేకెత్తిస్తుంది.

సైమన్‌ చేసే దందాను, అతని నేర సామ్రాజ్యాన్ని చూపిస్తూ లోకేశ్‌ కథను ఆరంభించిన తీరు ఆసక్తి రేపుతుంది. ఆ వెంటనే పోర్ట్‌ కంట్రోలర్‌గా దయాల్‌ పాత్ర తెరపైకి రావడం, ఆ పాత్రలోని క్రూరత్వాన్ని ప్రేక్షకులకు రుచి చూపించేశారు. ఇక దేవాగా ఓ అదిరే ఎంట్రీ సాంగ్‌తో రజనీ పాత్రను కథలోకి తీసుకొచ్చిన తీరు ఆయన అభిమానులతో విజిల్స్ వేయిస్తుంది. మిత్రుడు రాజశేఖర్‌ హత్యకు గురవ్వడం.. దానికి కారణమైన వాళ్లను వెతికి పట్టుకునేందుకు దేవా రంగంలోకి దిగడంతోనే అసలు కథ మొదలవుతుంది. ఈ ప్రయాణంలో రాజశేఖర్‌ గతాన్ని.. అతను కనిపెట్టిన మొబైల్‌ క్రిమేటర్‌ కుర్చీ ప్రత్యేకతను.. దాన్ని సైమన్‌ ముఠా తమ నేరాలకు వినియోగించుకున్న తీరు ఆసక్తి రేకెత్తించేలా ఉంటుంది. ఎప్పుడైతే సైమన్‌   ముఠాకు దేవా సాయం చేసేందుకు రంగంలోకి దిగుతాడో అక్కడి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. విరామానికి ముందు దయాల్‌ పాత్రలోని మరో కోణం బయటపడటం.. ఈ క్రమంలో నాగ్‌లోని విలనిజాన్ని పతాక స్థాయిలో పరిచయం చేయడం.. వీళ్లిద్దరి మధ్య దేవా ఓ సంకట పరిస్థితుల్లో ఇరుక్కోవడం ఉత్కంఠభరితంగా ఉంటుంది.

ఎవరెలా చేశారు

దేవాగా రజనీకాంత్‌ తనదైన స్టైల్లో చేసుకుంటూ పోయారు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే. డాన్స్‌లు, ఫైట్‌ల విషయంలో పెద్దగా కష్టపెట్టకుండా వయసుకు తగ్గట్టుగా అన్ని సెట్‌ చేశారు. అలాగే యాక్షన్‌, ఎమోషన్స్‌తో మెప్పించారు. సీన్‌కు తగ్గట్టు మౌల్డ్‌ అయ్యారు. ఆయన క్రేజే సినిమాకు ప్లస్‌ అని చెప్పాలి. నాగార్జున విలన్‌గా మెప్పించారు. లుక్‌ కూడా బాగుంది. కానీ ఆయన చెప్పినంతగా సైమన్‌ పాత్రలో కొత్తేమీ లేదు. బలమైన విలన్‌ అని ప్రొజెక్ట్‌ చేసినా అతన్ని అంతం చేసిన తీరు పేలవంగా ఉంటుంది. సైమన్‌ కన్నా దయాల్‌ పాత్రే పవర్‌ఫుల్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. సత్య రాజ్ కనిపించింది కాసేపే అయినా ఆయన పాత్ర చుట్టూనే సినిమా సాగుతుంది. సౌబిన్‌ షాహిర్‌ పాత్ర కూడా సినిమాకు ఎసెట్‌. క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర, ఆమిర్‌ ఖాన్‌ పాత్రలు కూడా సినిమాకు కరెక్ట్‌గా కుదిరాయి. ప్రీతి పాత్రలో శ్రుతి హాసన్‌ మెప్పించింది. ‘మౌనికా’ అంటూ పూజాహెగ్డే ప్రత్యేక గీతంలో మెరిసింది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశాడనే చెప్పాలి.

కొత్తదనం లేని కథ
3
Acting 4
Direction 3
Story 2
Production 3
Share This Article
Leave a review