‘ది రాజా సాబ్’ రివ్యూ.. ప్రభాస్-మారుతి మూవీ ఎలా ఉందంటే!

Telugu BOX Office
2.5
సంక్రాంతికి కిక్కు సరిపోలేదు రాజా సాబ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే అభిమానులకు అది పండగే. ముఖ్యంగా ‘కల్కి 2898ఏడీ’ తర్వాత ఆయన నుంచి 2025లో ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడంతో, ప్రభాస్‌ను మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై చూడాలన్న ఉత్కంఠ మరింత పెరిగింది. ఆ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం ది రాజా సాబ్. దర్శకుడు మారుతి తొలిసారి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో, అదీ హారర్ ఫాంటసీ కామెడీ జోనర్‌లో సినిమా చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా, 8వ తేదీనే ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కథ – బలం ఉన్న ఐడియా, తడబడిన కథనం

డబ్బే దేవుడని నమ్మే కనకరాజు (సంజయ్ దత్) కథతో సినిమా మొదలవుతుంది. దేవనగర సామ్రాజ్య జమిందారిణి గంగాదేవి (జరీనా వాహెబ్) సంపదపై కన్నేసిన అతడు, క్షుద్ర శక్తుల సాయంతో ఆమె జీవితాన్ని ఛిద్రం చేస్తాడు. ఆ తర్వాత తరతరాలుగా సాగే ప్రతీకారం, ఆస్తి, ఆత్మల కథలోకి నాయనమ్మ కోరిక మేరకు తాతను వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వచ్చిన రాజు (ప్రభాస్) ఎంట్రీ ఇస్తాడు. నర్సాపూర్ ఫారెస్ట్‌లోని కోట చుట్టూ తిరిగే ఈ కథలో ఫాంటసీ, హారర్ అంశాలకు మంచి స్కోప్ ఉన్నా, అనవసరమైన సన్నివేశాలు అసలు కథను నీరుగార్చాయి.

నటీనటులు – వింటేజ్ ప్రభాస్ ప్లస్

ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు. సరదా స్వభావం, వెటకారపు డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ అభిమానులకు ట్రీట్‌లా ఉంటుంది. నాయనమ్మ కోసం ఏమైనా చేయగల మనవడిగా, ముగ్గురు భామల ప్రేమలో ఇరుక్కున్న యువకుడిగా, చివరికి ప్రతీకారంతో పోరాడే వ్యక్తిగా ప్రభాస్ బాగా మెప్పించాడు. కనకరాజుగా సంజయ్ దత్ తన నటనతో వెయిట్ చూపించాడు. డైలాగులు తక్కువైనా, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రభావం చూపాడు. జరీనా వాహెబ్ సెంటిమెంట్ సీన్స్‌లో ఆకట్టుకోగా, క్లైమాక్స్‌లో ఆమె రాణిగా చేసిన ఎంట్రీ హైలైట్. హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధికుమార్‌లకు గ్లామర్ తప్ప కథలో పెద్ద ప్రాధాన్యం దక్కలేదు. ముగ్గురిలో మాళవికాకు కొంత స్పేస్ ఉంది. సముద్రఖని లాంటి నటుడిని సరిగా వాడుకోకపోవడం నిరాశ కలిగిస్తుంది. వీటీవీ గణేష్, సప్తగిరి, సత్య కామెడీ ఆశించిన స్థాయిలో వర్క్ కాలేదు.

టెక్నికల్ టీమ్ – గ్రాండ్ ప్రయత్నం, మిస్ అయిన ఇంపాక్ట్

కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ విజువల్‌గా బాగుంది. ప్రభాస్‌ను స్టైలిష్‌గా చూపించేందుకు కెమెరా బాగా ఉపయోగపడింది. అయితే కొన్ని షాట్స్‌లో లుక్ అసమానంగా అనిపిస్తుంది. గ్రాఫిక్స్ విషయంలో టీజర్ సమయంలో వచ్చిన విమర్శలను మేకర్స్ సీరియస్‌గా తీసుకున్నారనుకున్నా, ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం నిరాశపరిచింది. కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్‌ఎక్స్ చాలా వీక్‌గా ఉన్నాయి. తమన్ సంగీతం ఈ సినిమాకు పెద్ద మైనస్. హారర్ సినిమాను నిలబెట్టే నేపథ్య సంగీతం ఇక్కడ థ్రిల్‌ను సృష్టించలేకపోయింది. అవసరానికి మించిన శబ్దాలు తప్ప, భయపెట్టే అనుభూతి లేదు. పాటలు కూడా కథా ప్రవాహాన్ని ఆపినట్టే అనిపిస్తాయి. మూడు గంటల తొమ్మిది నిమిషాల నిడివి సినిమాను మరింత భారంగా చేసింది. ఎడిటింగ్‌లో కనీసం అరగంట ట్రిమ్ చేసి ఉంటే అనుభవం కొంత మెరుగ్గా ఉండేదేమో.

ఎలా ఉందంటే

‘ది రాజా సాబ్’లో దమ్మున్న కథ ఉంది, వింటేజ్ ప్రభాస్ ఆకర్షణ ఉంది. కానీ ఆ కథను బలంగా నడిపించే స్క్రీన్‌ప్లే లేకపోవడం, అనవసరమైన హంగులు జోడించడం వల్ల సినిమా ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది. భారీ స్టార్ ఇమేజ్ కోసం కథను త్యాగం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పే ఉదాహరణగా ఈ సినిమా నిలుస్తుంది. అభిమానులకు ప్రభాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కొంత రిలీఫ్ ఇస్తుంది గానీ, పూర్తిస్థాయి పండగ అనుభూతిని మాత్రం ‘రాజా సాబ్’ ఇవ్వలేకపోయింది

సంక్రాంతికి కిక్కు సరిపోలేదు రాజా సాబ్
2.5
Acting 3
Direction 2
Music 2
Production Values 3
Share This Article
Leave a review