చిత్రం: కింగ్డమ్
నటీనటులు: విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేశ్, అయ్యప్ప పి.శర్మ, రాజ్‌కుమార్ కసిరెడ్డి, మహేష్, గోపరాజు రమణ తదితరులు
సంగీతం: అనిరుధ్
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
విడుదల: 31-07-2025

విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే యువతలో అమితాసక్తి నెలకొంటుంది. వరుస సినిమాలు చేస్తున్నా, బాక్సాఫీస్ వద్ద మేజిక్ క్రియేట్ చేయడంలో తడబడుతున్నారు. అతడు హిట్ చూసి చాలా కాలమైంది. అలాగే “మిస్టర్ బచ్చన్” తో అరంగేట్రం చేసిన భాగ్యశ్రీకి ఆ చిత్రం కలిసిరాలేదు. ఎప్పుడో “జెర్సీ”తో తన ఉనికిని చాటుకున్న గౌతం తిన్ననూరి ఆ స్థాయి సినిమా చేసింది లేదు. ఈ ముగ్గురి కలయికలో వచ్చిన ‘కింగ్డమ్” టీజర్ తో “కేజీఎఫ్” వైబ్స్ తీసుకొచ్చింది. ట్రైలరుతో అంచనాలు ఏర్పడ్డాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచింది. మరి.. విజయ్ దేవరకొండ కెరీర్‌కి ఎంతో కీలకమైన ఈ సినిమా ఎలా ఉంది? యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?.. రివ్యూలో తెలుసుకుందాం…
కథేంటి
‘కింగ్‌డమ్’ కథ 1920 లొ శ్రీకాకుళంలో మొదలవుతుంది. అక్కడ తెల్లదొరలతో ఓ తెగ పోరాడుతుంది. ఆ తెగ నాయకుడు (విజయ్ దేవరకొండ) పిల్లల్ని మాత్రం కాపాడి వీరమరణం చెందుతాడు. ఆ పిల్లలు సముద్రం దాటి శ్రీలంకకు చేరి అక్కడ బతుకుతూ ఉంటారు. ఎప్పటికైనా స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలన్న ఆశతో తమ నాయకుడి రెండో రాక కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తూ ఉంటారు. అక్కడ సీన్ కట్ చేస్తే… సూరి (విజయ్ దేవరకొండ) హైదరాబాద్‌లో ఓ కానిస్టేబుల్. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్యదేవ్) జాడ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్ అధికారులకీ సూరికి మధ్య గొడవ జరిగి పై అధికారుల వరకూ వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించని రీతిలో సూరికి ఓ అండర్ కవర్ ఆపరేషన్ అప్పగిస్తారు. అతడి అన్న శ్రీలంకలోని ఆ తెగకి నాయకుడిగా ఉన్నాడని, అతడిని కలుసుకుని ఇండియాకి తీసుకురావాలని ఆదేశిస్తారు. పై అధికారి చెప్పినట్టే సూరి శ్రీలంకలో అడుగు పెడతాడు. అత్యంత ప్రమాదకరమైన స్మగ్లింగ్ కార్టెల్ అదుపాజ్ఞల్లో ఉన్న దివిలోకి సూరి ఎలా అడుగు పెట్టాడు?.. ఇంతకీ శివ ఆ దివికి ఎందుకు వెళ్లాడు?… ఆ ద్వీపంలో ఉన్న తెగకీ, శివకీ సంబంధం ఏమిటి? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తూ ఉంటుంది?.. అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘కింగ్‌డమ్’ చూడాల్సిందే.
ఎలా ఉంది
ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. తెలుగులో గతంలో ఇలాంటి కథలు వచ్చినా దీన్ని కాస్త విభిన్నంగా తెరకెక్కించాడు గౌతమ్ తిన్ననూరి. అన్నదమ్ముల బంధం, ద్వీపంలో చిక్కుకుపోయిన ఓ తెగ నేపథ్యం ఈ చిత్రాన్ని భిన్నంగా నిలిపింది.. గ్యాంగ్‌స్టర్ కథలకి డ్రామా చాలా కీలకం. ఆ విషయంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రచన బలమైన ప్రభావమే చూపిస్తుంది. డ్రామాతో పాటు కథా ప్రపంచంలో లీనం చేసే విజువల్స్, వాటికి మరింత బలాన్నిచ్చే సంగీతం, తెరపైన పాత్రలు తప్ప నటులే కనిపించని అభినయాలు… ఇలా అన్నీ ఉన్నా ఆ స్థాయిలో భావోద్వేగాలు బలంగా పండించలేకపోయారు. ఫస్టాఫ్‌లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గూడెం వాసులు బ్రిటీషర్స్ నుండి తప్పించుకుని శ్రీలంక చేరడం, తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం అక్కడ స్మగ్లర్లుగా మారడం, వారిని అడ్డం పెట్టుకుని అండర్ వరల్డ్ గ్యాంగ్ అ్రకమ ఆయుధాలను సరఫరా చేయడం… ఇవన్నీ ఆసక్తిని కలిగిస్తాయి. ఇక ఇల్లు వదిలి పారిపోయిన అన్నను సూరి కలవడం కోసం చేసే ప్రయత్నం, అందులో ఎదురైన సమస్యలను ఎదుర్కొన్న తీరు చూస్తే గూజ్ బంప్స్ వస్తాయి. ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందనే భావన ఇంట్రర్వెల్ వరకూ కలుగుతుంది.
అయితే… అసలు కథ ఆ తర్వాతే మొదలుతుంది. సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళి కూర్చోపెట్టిన డైరెక్టర్ అక్కడి నుండి సీన్ సీన్‌కి మూవీ గ్రాఫ్‌ని కిందకు దించేశాడు. ఎక్కడ హీరోను ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయో అక్కడంతా మౌనం వహించాడు. దాంతో థియేటర్లలోని ప్రేక్షకులలో అసహనం పెరిగిపోతుంది. అసలు కథను ఎలా ముగించబోతున్నాడో అర్థం కాదు. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మళ్లీ పట్టాలెక్కడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటారు. ‘కింగ్డమ్’ ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో నటీనటులు, సాంకేతిక బృందం పడిన శ్రమతో తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. సీక్వెల్‌కి ఛాన్స్ ఉండేలా కథన ముగించారు.
ఎవరెలా చేశారంటే
నటుడిగా విజయ్ దేవరకొండని మరో పది మెట్లు ఎక్కిస్తుంది ఈ చిత్రం. ఆయన నటన అంత అద్భుతంగా ఉంది. సినిమాలో మొత్తం మూడు విభిన్నమైన కోణాల్లో కనిపిస్తూ అన్నింట్లోనూ మెప్పించాడు. ముఖ్యంగా స్పై పాత్ర కోసం ఆయన మారిపోయిన విధానం, శ్రీలంక నేపథ్యంలో సాగే ఆ సన్నివేశాలపై బలమైన ప్రభావం చూపించారు. యాక్షన్ సన్నివేశాల్లో మరింత రెచ్చిపోయాడు. ఇక శివ పాత్రలో సత్యదేవ్ పరకాయ ప్రవేశం చేసినట్లుంది. తనకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. అందువల్లే అలవోకగా చేసుకుంటూ పోయాడు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. సాంకేతికతంగా సినిమా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ విజువల్ పరంగా ఆకట్టుకుంటుంది. అనిరుధ్ రవిచందర్ తన మ్యూజిక్‌తో సినిమాకి ప్రాణం పోశాడనే చెప్పాలి. సినిమా టేకింగ్, మేకింగ్ విషయంలో దర్శకుడి ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో కథపై ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే సినిమా మరో రేంజులో ఉండేది.
