ఉద్యోగులు ఎటువైపు… పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ట‌మిలో జోష్ పెంచిందా?

Telugu BOX Office

పోస్టల్ బ్యాలెట్ ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్నే మ‌లుపు తిప్పనుందా.. అధికార‌, ప్రతిప‌క్ష కూట‌మిలో అదే ఉత్కంఠ‌త. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు రచిస్తూ పావులు కదుపుతుండగా… మ‌రోవైపు జగన్‌ను ఎలాగైనా గద్దె దించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు, బీజేపీ కూట‌మి జోరుగా ప్రచారం చేస్తోంది. ఇరు ప‌క్షాలు మండుటెండలను సైతం లెక్కచేయకుండా రోజుకి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్రతి ఓటు కీల‌కంగా మారింది.

ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ గెలుపు ఓట‌ముల నిర్ణయంలో కీల‌కంగా మార‌నుంది. మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుందని సర్వేలు చెబుతున్నాయి. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది. ఉద్యోగులు కూడా ఈసారి నూటికి నూరు శాతం ఓట్లు వేయడానికే మొగ్గు చూపించారు.

పోలింగ్ రోజైన మే 13వ తేదీ నాడు విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్, రెండు రోజుల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆరంభమైన ఈ ఓటింగ్.. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఉపాధ్యాయులు సహా వివిధ శాఖలు, విభాగాల్లో పని చేస్తోన్న అయిదు లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు 85 ఏళ్ళు నిండిన వయో వృద్ధుల కోసం ఈ నెల 3న ప్రారంభమైన హోం ఓటింగ్ పదో తేదీ వరకు కొనసాగనుంది.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ తీరు చూస్తే, ప్రభుత్వ ఉద్యోగ‌ుల్లో అధికార పార్టీపై వున్న అస‌హ‌నం, ఆగ్రహం స్పష్టంగా క‌న‌బ‌డినట్లు తెలుస్తోంది. ఉద్యోగులంతా తమవైపే అనుకున్న వైసీపీ ఇప్పుడు ఆలోచనలో పడినట్లుగా సమాచారం. పోస్ట‌ల్ బ్యాలెట్ తీరు చూస్తే ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థమవుతోందని సోషల్ మీడియాలో విశ్లేషణలు వ‌స్తున్నాయి. ఉద్యోగుల ఓట్లన్నీ తమకేనని నిన్న మొన్నటి వరకు ధీమాగా ఉంది అధికార పార్టీ, ఇప్పుడు చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. జీతాలు సమయానికి ఇవ్వకుండా ఉద్యోగులను తిప్పలు పెట్టారని, టీచర్లకు వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేశారని, వారితో స్కూల్లో టాయిలెట్లు కడిగించారని, ఇతర డిపార్ట్ మెంట్లలో కూడా ఉద్యోగుల స్వేచ్ఛను హరించినందుకు ఉద్యోగ‌స్తులు తమ ఆగ్రహాన్ని బ్యాలెట్ ఓట్ల రూపంలో చూపించినట్లుగా తెలుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగుల అతి ముఖ్యమైన డిమాండ్ సీపీఎస్ రద్దు. అయితే దీని మీద ఈసారి ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడేందుకే సాహసించలేదు. మరోవైపు చూస్తే కొత్త పీఆర్సీ విషయంలో పార్టీలు సానుకూలంగా మాట్లాడుతున్నా కూడా రేపు అధికారంలోకి వచ్చాక ఎంత వరకూ నెరవేరుస్తాయన్నది అనుమానమే అన్న భావన ఉంది. వైసీపీ, టీడీపీ కూటమి ఒకరిని మించి మరొకరు సంక్షేమ పధకాలను ప్రకటించారు. ఖజనా పరిస్థితి ఏమిటో ఉద్యోగులకు మాత్రమే తెలుసు. ఏ మాత్రం తేడా వచ్చినా మొదట తమ జీతాలకే కోత పెడతారని వాళ్ళు భ‌య‌ప‌డుతున్నారు. అందుకే ఉద్యోగుల ఓట్లు ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్నాయి.

Share This Article
Leave a comment