గత కొన్నేళ్లుగా డిజాస్టర్ల బాటలో పయనిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ‘పఠాన్’తో విజయాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో ఏకంగా రూ.వెయ్యి కోట్ల క్లబ్లో చేసిన షారుక్.. ‘జవాన్’తో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. దీంతో ఒకే ఏడాదిలో రెండుసార్లు వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించిన హీరోగా గతంలో ఎవరికీ దక్కని రికార్డును సొంతం చేసుకున్నాడు. ‘జవాన్’ థియేటర్లలోకి వచ్చిన నెల దాటిపోయినా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘జవాన్’ ఓటీటీ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది.
షారుక్ ఖాన్ తండ్రికొడుకుగా నటించిన ‘జవాన్’ మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తీశాడు. కథ పరంగా చూస్తే చాలా రొటీన్. కానీ స్క్రీన్ ప్లేతో పాటు ప్రతి సీన్లోనూ ఎలివేషన్, భారీతనం కనిపించింది. దీంతో సినీ ప్రేక్షకులు మిగతా విషయాల్ని పట్టించుకోకుండా సినిమాని ఎంజాయ్ చేశారు. దీంతో రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ ఇప్పటివరకు వచ్చాయి.
జవాన్ డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇప్పుడు షారుక్ పుట్టినరోజు సందర్భంగా నవంబరు 2న ‘జవాన్’ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే థియేటర్లలో లేని సీన్స్‌ని కూడా ఓటీటీ కట్లో ఉండబోతున్నాయని సమాచారం. దీన్నిబట్టి చూస్తుంటే ఓటీటీలోనూ ‘జవాన్’ రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అనిపిస్తుంది.