చాలామందికి ఉదయం లేవగానే పరగడుపున టీ తాగే అలవాటు ఉంటుంది. ఇతర దేశాల్లో ఉండే బెడ్ కాఫీ అలవాటు మన దేశంలో చాలా మందికి బెడ్ టీ గా ఉంటుంది. ఇలా లేవగానే వేడిగా ఓ ఛాయ్ పడితే ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. దీని వల్ల నిద్రమత్తు ఒక్క దెబ్బకు పోతుంది. అయితే దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.
పరగడుపునే టీ తాగడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి. ఈ అలవాటు నోటిలోని బ్యాక్టీరియా షుగర్ లెవెల్స్‌ను పెంచుతుంది. టీలో ఉండే పదార్థాలు శరీరంలో మూత్రస్థాయిని కూడా పెంచుతాయి. దీని వలన శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే డీహైడ్రేషన్‌కు కూడా గురయ్యే ప్రమాదం ఉంటుంది.
టీ లేదా కాఫీలో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వలన ఎసిడిటికీ కారణమవుతుంది. టీ తాగితే మనకు చాలా సేపు ఆకలి అనిపించదు. దీనికి కారణం జీర్ణక్రియ క్షీణించడమే. దీని వల్ల శరీరానికి శక్తి అందదు. ఆ కారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అంతే కాదు టీ కారణంగా మలబద్దకం లాంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. నిద్రలేమి, బరువు పెరగడం, ఆకలి మందగించడం, రక్తపోటు వంటి సమస్యలు కూడా టీ తాగడం వల్ల కలుగుతాయి. అందువల్ల ఉదయాన్నే టీ లేదా కాఫీ అలవాటు మానుకోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.