హనుమంతుడికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు.. ఫలితం ఏంటి?

ఒకసారి సీతాదేవి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన హనుమంతుడు శ్రీరాముడిని ”స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే హనుమంతుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమల పాకులను కట్టుకొని గంతులు వేస్తూ ఆనందంగా వచ్చాడట. హనుమంతుడు ఎక్కువగా తమలపాకు తోటలలోనూ,అరటి తోటలలోనూ విహరిస్తాడు. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీ దళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష పరిహారం అవుతుంది.

మరో కథ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతాదేవికి హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక. అందుకే హనుమంతునికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.

ప్రయోజనాలు..!

 1. లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఉన్న వారికి త్వరగా గుణం కనిపడుతుంది.
 2. హనుమంతుని(ఆంజనేయస్వామి)కి తమల పాకుల మాల వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి.
 3. సంసారంలో ప్రశాంతత లేని వారు తమల పాకుల మాల వేస్తే సంసారంలో సుఖం లభిస్తుంది.
 4. చిన్న పిల్లలు కొందరు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. ఇలాంటి వారు తమలపాకుల మాల వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు.
 5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే తమలపాకుల మాల వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది
 6. శనైశ్చర స్వామి వల్ల ఇబ్బంది ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది
 7. సుందర కాండ పారాయణం చేసి తమలపాకుల మాల వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.
 8. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించి తమలపాకుల మాల సమర్పించి, ప్రసాదం తీసుకుంటే విజయం మీదే అవుతుంది.
  9.హస్త, మృగశిర నక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం.
 9. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్లు ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది.