ఈ గుడిలో కృష్ణుడికి ఆకలెక్కువ.. రోజుకు 10సార్లు నైవేద్యం పెట్టాల్సిందే

హిందూ సంప్రదాయాల ప్రకారం గ్రహణం వేళ దేవాలయాలన్నీ మూసివేస్తారు. కానీ అక్కడ మాత్రం గ్రహణం సమయంలోనూ ఆ గుడి తెరిచే ఉంటుంది. అర్ధరాత్రి అయినా సరే ఆ ఆలయంలో కన్నయ్యకు పూజలు జరుపుతూనే ఉంటారు. అంతేకాదు ఆ గుడిలోని వేణు మాధవుడికి ఎడతెగని ఆకలి ఉంటుదట. రోజుకు కనీసం 10 సార్లు నైవేద్యం సమర్పిస్తే స్వామి వారు సంతృప్తి చెందరని అక్కడి పండితులు చెబుతారు. ఏ ఒక్కరోజు కన్నయ్యకు నైవేద్యం తక్కువైనా స్వామి వారి విగ్రహం సైజు తగ్గిపోతుందట. ఈ ఆలయంలో ఇప్పటికీ కొన్ని అంతుచిక్కని రహస్యాలు అలాగే మిగిలిపోయాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఆ ఆలయం ఎక్కడుంది.. గోపాలుని గుడిలో ఇక్కడ ఏమేమీ వింతలు.. విశేషాలున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మన దేశంలో అందరూ కృష్ణాష్టమి వేడుకలను ఉట్టిని పగులగొట్టి.. గ్రామోత్సవాలు, చిన్ని కృష్ణుడిని అందంగా అలంకరించి వేడుకలను జరుపుకుంటారు. కానీ అక్కడ మాత్రం చాలా విభిన్నంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఆలయంలో అనేక రహస్యాలు ఉన్నాయి. కన్నయ్య కొలువైన ఉన్న ఈ ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్పు లేదా తిరువేరపులో ఉంది. కొట్టాయం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వారికి ఆంధ్రా, తెలంగాణ నుంచి రైలు, విమాన, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా కొచ్చి లేదా కొట్టాయానికి చేరుకుంటే ఆలయానికి వెళ్లేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి.

ఇక్కడ కొలువైన కన్నయ్యకు ఎడతెగని ఆకలి ఉంటుందట. ఈ గుడిలోని గోపాలుని విగ్రహానికి సుమారు 1500 సంవత్సరాల చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు. ఈ గుడిలోని కన్నయ్య విగ్రహానికి ప్రతిరోజూ కనీసం 10సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక్కడ ఓ పాత్రలో ఉంచిన ప్రసాదం క్రమంగా తగ్గిపోతుందని భక్తులు కూడా చెబుతారు. అందుకే ఇది అనేక రహస్యాలున్న ఆలయంగా పరిగణించబడుతుంది.

​గ్రహణం వేళ..

ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏంటంటే.. గ్రహణం సమయంలోనూ ఈ గుడిని తెరిచే ఉంచుతారు. అంతేకాదు స్వామివారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. సాధారణంగా గ్రహణం వేళ అన్ని గుళ్లను మూసివేస్తారు. ఈ గుడిలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలనేవి అస్సలు రావని చాలా మంది నమ్ముతారు.

​విగ్రహం సైజు తగ్గుదల..

పురాణాల ప్రకారం, కృష్ణుని మేనమామ కంసుడిని వధించిన తర్వాత ఎడతెగని ఆకలితో ఉన్నాడని.. అందుకే ఇక్కడి విగ్రహం ఆకలితో బాధపడుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఇక్కడి గుడిలో స్వామివారికి నైవేద్యం సమర్పించడంలో కొంచెం లేటైనా కూడా విగ్రహం సైజు తగ్గిపోవడం ప్రారంభమవుతుందట.

ఈ గుడిలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ప్రతిరోజూ కేవలం రెండు నిమిషాల పాటే ఆలయం తలుపులను మూసివేస్తారు. అంటే 11:58 గంటలకు మూసేసి.. సరిగ్గా 12 గంటలకు తెరుస్తారు. ఇక్కడి శ్రీ కృష్ణుని విగ్రహం కేవలం రెండు నిమిషాలు మాత్రమే కునుకు తీస్తుందని చెబుతారు. మరోవైపు గుడికి సంబంధించిన తాళాలతో పాటు గొడ్డలిని కూడా పూజారికి ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ తాళాలతో తలుపులు తెరచుకోకపోతే గొడ్డలిని ఉపయోగించి తలుపులను పగులగొట్టి గుడిని తెరవొచ్చు. ఇలా చేయడానికి పూజారికి అనుమతి కూడా ఉంది. ఇక్కడ కొన్ని వందల ఏళ్ల నుండి ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం సమర్పిస్తారు.