చిత్రం: రామారావు ఆన్ డ్యూటీ
నటీనటులు: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సార్పట్ట’ ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు
సంగీతం: సామ్ సీఎస్
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
కూర్పు: ప్రవీణ్ కెఎల్
కళ: సాహి సురేష్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
నిర్మాణ సంస్థలు: ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, రవితేజ టీమ్‌వర్క్స్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
విడుదల తేదీ: 29-07-2022
మాస్ హీరో సినిమా విడుదలవుతోందంటే చాలు టాలీవుడ్ బోలెడన్ని ఆశలతో బాక్సాఫీస్ వైపు చూస్తోంది. మునుపటిలా థియేటర్ నిండుతుందా?.. ఎప్పట్లా సందడి కనిపించేనా అని. ప్రేక్షకుల్ని ఇదివరకటిలా ఉత్సాహంగా థియేటర్‌కి తీసుకొచ్చే సినిమాల్లేక, రాక కొన్నాళ్లుగా బాక్సాఫీసు కళ తప్పింది! ఈ వారం మాస్ హీరో రవితేజ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలైంది. ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తించాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది?. రవితేజ ప్రభుత్వ అధికారిగా ఏం చేశారు? అనేది రివ్యూలో చూద్దాం.
రామారావు (రవితేజ) ఓ డిప్యూటీ కలెక్టర్. నిజాయతీగా విధులు నిర్వర్తిస్తాడని పేరు. అనుకోకుండా తన సొంత ఊరికి బదిలీ అవుతాడు. చిత్తూరు జిల్లాల్లోని ఆ ఊరిని కేంద్రంగా చేసుకుని ఎర్రచందనం మాఫియా అక్రమాలకి పాల్పడుతుంటుంది. చిన్నప్పట్నుంచి తనతో కలిసి చదువుకున్న మాలిని (రజీషా విజయన్) కష్టంలో ఉందని తెలుసుకుని రామారావు ఆమె దగ్గరికి వెళతాడు. ఆమె భర్త మిస్సింగ్ అని, అతన్ని వెతకడం కోసం వెళ్లిన మావయ్య కూడా ప్రమాదంలో మరణించాడని తెలుసుకుంటాడు. ఆమెకి సాయం చేయాలని రంగంలోకి దిగుతాడు రామారావు. ఈ క్రమంలో ఎర్రచందనం మాఫియా వెలుగులోకి వస్తుంది. మాలిని భర్తలాగే, ఆ ఊరికి చెందిన మరో 20 మంది పేదల్ని ఆ మాఫియా బలి తీసుకుందని పసిగడతాడు. మరి ఆ మాఫియాని రామారావు ఎలా బయటికి లాగాడు? ఆ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనేదే సినిమా.
రామారావు పాత్రలో రవితేజ తన అనుభవాన్ని చూపిస్తాడు. ఓ ప్రభుత్వ అధికారి తలుచుకుంటే ఏమైనా చేయగలడని నిరూపిస్తాడు. ఓ డిప్యూటీ కలెక్టర్‌కు, ఎమ్మార్వోకు ఇన్ని అధికారులున్నాయా? అని అనిపించేలా ఈ పాత్ర తెరపై దూసుకుపోతుంది. ఇక రామారావుగా రవితేజ మెప్పించేస్తాడు. యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లో రవితేజ అభిమానులకు నచ్చేస్తాడు. అయితే కొన్నిచోట్ల మాత్రం రవితేజ వయసు వల్ల వచ్చిన మార్పులు స్పష్టంగా తెరపై కనిపిస్తాయి. చాలా ఏళ్ల తరువాత ఎంట్రీ ఇచ్చిన వేణుకి మాత్రం ఈ పాత్ర, ఈ సినిమా అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఇదేమీ అంత గొప్ప పాత్రలా అనిపించదు. కానీ వేణు మాత్రం అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్లిద్దరివీ అంత పెద్ద పాత్రలేమీ కాదు. ఓ సీన్, ఓ సాంగ్ అన్నట్టుగా ఉంటుంది. కానీ రజిష, దివ్యాన్షలు కనిపించినంత సేపు తెరపై ఆకట్టుకుంటారు. నరేష్, పవిత్రలు స్క్రీన్‌పై కనిపిస్తే ఈలలు, గోలలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. వారి పాత్రలకు అంత ఇంపార్టెన్స్ లేకపోయినా.. థియేటర్లో మాత్రం ఇంపాక్ట్ చూపించారు. నాజర్, సమ్మెట గాంంధీ, జాన్ విజయ్, రాహుల్ రామకృష్ణ ఇలా అందరూ కూడా చక్కగా నటించేశారు.
1990 కాలంలో సాగే ఓ పరిశోధనాత్మక కథ ఇది. కాలం ఏదైనా కావొచ్చు కానీ, ఇలాంటి నేర నేపథ్యంతో కూడిన కథల్లో ఓ వేగం కనిపించాలి. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత రేకెత్తాలి. ఈ రెండూ ఈ సినిమాలో మిస్సయ్యాయి. ఇక్కడ హీరో రవితేజ కాబట్టి ఆయన శైలి, మాస్ అంశాలకి సంబంధించిన లెక్కలు చూసుకుంటూ ఈ కథని నడిపినట్టు అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి కథల్ని మాస్ హీరోలతో పక్కాగా తీస్తే ఆ ఫలితం, ప్రేక్షకుల్లో కలిగే ఆ అనుభూతి వేరుగా ఉంటాయి. కానీ, దర్శకుడు హీరో ఇమేజ్‌నీ, వాస్తవికతతో కూడిన ఈ కథనీ బ్యాలెన్స్ చేయలేకపోయాడు. హీరోయిజం ఎపిసోడ్‌తో కథని మొదలుపెట్టాడు దర్శకుడు. ప్రథమార్ధంలో కుటుంబ నేపథ్యం, మాలినితో ప్రేమ, ఆమె పెళ్లి తదితర సన్నివేశాలతో సినిమా అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకుంటుంది.
రాహుల్ రామకృష్ణ ఎపిసోడ్ తర్వాతే కథలో సీరియస్‌నెస్ కనిపిస్తుంది. ద్వితీయార్ధంలో అసలు నిందితుల్ని ఎలా బయటికి తీసుకొచ్చాడు? ఆ సన్నివేశాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయన్నదే సినిమాకి కీలకం. ఆ విషయంలో దర్శకుడు అక్కడక్కడా తన ప్రభావం చూపించారు కానీ, అవి సినిమాకి సరిపోలేదు. సినిమాలో సంభాషణలు ఎక్కువగా వినిపిస్తాయే తప్ప, కథ కథనాలు మాత్రం ఎంతకీ ముందుకు సాగుతున్నట్టు అనిపించదు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు మెప్పిస్తాయి. కథని ముగించిన తీరు దీనికి సీక్వెల్ కూడా ఉందనే సంకేతాల్ని పంపుతుంది. రవితేజ, వేణు తప్ప మిగతా ఎవ్వరికీ ఇందులో బలమైన పాత్రలు లేవు. పక్కా మాస్ కథల్లోలాగా కాకుండా ఇందులో రవితేజ ఒక ప్రభుత్వాధికారి కావడంతో అందుకు తగ్గట్టుగానే కనిపించాల్సి వచ్చింది.
కథానాయిక రజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లో కనిపిస్తారు. నరేశ్, నాజర్, రాహుల్ రామకృష్ణ, పవిత్ర లోకేశ్, పృథ్వీ, శ్రీ, అరవింద్ కృష్ణ… ఇలా పలువురు నటులు కనిపించినా ఏ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉండదు. సత్యన్ సూర్యన్ కెమెరా ప్రభావం చూపించింది. స్వతహాగా రచయిత అయిన దర్శకుడు శరత్ మండవ ఎక్కువ సంభాషణలైతే రాసుకున్నారు కానీ, కథని నడిపిన విధానం మాత్రం మెప్పించదు. నిర్మాణం బాగుంది. శామ్ సీఎస్ సంగీతం, నేపథ్యం సంగీతం ఓకే అనిపిస్తాయి. సంతోష్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. 90వ దశకాన్ని చూస్తున్నట్టుగా ఎక్కడా కూడా అనిపించదు. ఇక క్యాస్టూమ్స్ అయితే నాటి కాలంలోవేనా? అని అనుమానం కలుగుతుంది. ఎడిటింగ్ విభాగం ఎన్నో సీన్లకు కత్తెర వేయాల్సిందనిపిస్తుంది. మాటలు కొన్ని చోట్ల పేలినట్టు అనిపిస్తాయి. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.