Pushpa Review: ‘పుష్ప’ రివ్యూ… సినిమా ఎలా ఉందంటే..

Telugu Box Office

‘అల వైకుంఠ‌పురంలో’ వంటి క్లాస్ మూవీ త‌ర్వాత ప‌క్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప: ది రైజ్ పార్ట్ 1’ తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు అల్లు అర్జున్. ఆర్య, ఆర్య-2 వంటి విజయాల తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. దీంతో కొబ్బరికాయ కొట్టడం నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం హాట్‌టాపిక్‌గా మారింది. బన్నీని ఊరమాస్‌ లుక్‌లో ‘పుష్ప’గా పరిచయం చేసిన తర్వాత ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించటం, రష్మిక డీగ్లామర్‌ పాత్ర చేయటం, సునీల్‌, మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకులుగా నటిస్తుండటం ఆసక్తిని కలిగించింది. బన్నీ కెరీర్లో తొలి పాన్‌ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందే 250 కోట్ల వరకు ప్రీ రిజీజ్ బిజినెస్ చేసి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప’ ఎలా ఉంది? పుష్పరాజ్‌గా మాస్‌ లుక్‌లో అల్లు అర్జున్‌ ఎలా నటించారు? అసలు ఈ సినిమా కథేంటి.. తెలుసుకుందామా..

పుష్పరాజ్‌(అల్లు అర్జున్‌) కట్టెల దుకాణంలో కూలీగా పనిచేస్తుంటాడు. అయితే అతడి పుట్టుకకు సంబంధించిన విషయంలో సమాజంలో ఎప్పుడూ అవమానాలే ఎదుర్కొంటూ ఉంటాడు. దీంతో జీవితంలో ఎలాగైనా ఉన్నతస్థాయికి ఎదగాలన్న కాంక్ష అతడిలో రగులుతుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను కొట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేసే సిండికేట్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాడు కొండారెడ్డి(అజయ్‌ ఘోష్‌). ఈ విషయం తెలుసుకున్న పుష్పరాజ్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తే డబ్బులు బాగా వస్తాయని ఆ సిండికేట్‌ తరఫున కూలీగా అడవుల్లోకి వెళతాడు. ఒక కూలీగా ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో అడుగు పెట్టిన పుష్పరాజ్‌ ఆ సిండికేట్‌కు నాయకుడుగా ఎలా ఎదిగాడు? స్మగ్లింగ్‌ చేసే ఎర్రచందనం పోలీసులకు చిక్కకుండా పుష్పరాజ్‌ ఎలా తరలించాడు? ఈ క్రమంలో అడ్డు వచ్చిన మంగళం శ్రీను(సునీల్‌), కొండారెడ్డిలను ఎలా ఎదిరించాడు? పోలీసు ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌(ఫహద్‌ ఫాజిల్‌) నుంచి పుష్పరాజ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? శ్రీవల్లి(రష్మిక) ప్రేమను ఎలా పొందాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఫస్టాప్
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా అల్లు అర్జున్ మాస్ ఎంట్రీ అదిరిపోయింది. వాయిస్ ఓవర్‌తో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే చిత్తూర్ యాసతో సినిమా అసలు కథాంశంలోకి వెళుతుంది. హరీష్ ఉత్తమన్ పోలీస్ ఆఫీసర్ గోవిందప్పగా పరిచయం అవుతాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ సాంగ్ *దాక్కో దాక్కో మేక వచ్చి’ బన్నీ మాస్ స్టెప్పులతో అలరిస్తాడు. పుష్ప కొండారెడ్డితో చేతులు కలుపుతాడు. అప్పుడే శ్రీవల్లిగా రష్మిక పరిచయమవుతుంది. ఈ నేపథ్యంలో బన్నీ – రష్మికల మధ్య శ్రీవల్లి సాంగ్ వచ్చి ఆకట్టుకుంటుంది. ఇక మంగళం శీనుగా సునీల్‌, ద్రాక్షాయణిగా అనసూయ భరద్వాజ్ పాత్రలు పరిచయమవుతాయి. ఆ తర్వాత ఓ ఆసక్తికరమైన స్మగ్లింగ్ సన్నివేశం. ఈ నేపథ్యంలో సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా… ఊ ఊ అంటావా’ వచ్చి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఈ సాంగ్ తర్వాత భారీ యాక్షన్ సీన్.. “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్” అంటూ బన్నీ చెప్పిన మాస్ డైలాగ్‌తో ఇంటర్వెల్.

సెకండాఫ్..
కొన్ని పరిస్థితుల్లో పుష్ప మంగళం శీనుకి ఎదురుతిరుగుతాడు. శ్రీవల్లి కోసం కొండారెడ్డి సోదరులకు వ్యతిరేకమవుతాడు. దీంతో కథలో మంచి ఆసక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే సాలీడ్ మాస్ ఫైట్ బాగా ఆకట్టుకుంది. ఈ ఫైట్ తర్వాత వచ్చిన సామీ సామీ అనే మాస్ సాంగ్‌కి థియేటర్స్‌లో ఈలలు అరుపులతో మోగిపోయాయి. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. మొహం కనిపించకుండా అడవిలో పుష్ప చేసే ఫైట్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఫైట్ సెకండాఫ్‌లో హైలెట్ అని చెప్పొచ్చు. దీని తర్వాత వచ్చే ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్ అలరిస్తుంది. ఇక షికావత్‌గా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. క్లైమాక్స్‌లో పుష్పకు షికావత్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. దీని తర్వాత పుష్పకు పెళ్లి జరుగుతుంది. అనంతరం కథ ఎన్ని మలుపులు తీసుకుంటుందనేది రెండో భాగం ‘పుష్ప: ది రూల్‌’ చూడాల్సిందే

ఇప్పటి వరకూ వివిధ మాఫియాల నేపథ్యంలో వందల కథలను దర్శకులు వెండితెరపై చూపించారు. హవాలా, డ్రగ్స్‌, ఆయుధాలు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదీ ఒక సబ్జెక్ట్‌ అవుతుంది. ‘పుష్ప’ కోసం దర్శకుడు సుకుమార్‌ ‘ఎర్రచందనం’ స్మగ్లింగ్‌ నేపథ్యాన్ని, మాస్‌లో మంచి క్రేజ్‌ ఉన్న అల్లు అర్జున్‌ని కథానాయకుడిగా ఎంచుకున్నాడు. ఈ పాయింటే ‘పుష్ప’పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. అందుకు తగినట్లుగానే ప్రేక్షకులను మెప్పించేలా కథ, కథనాలను తీర్చిదిద్దడంలో సుకుమార్‌ కొంతవరకూ సఫలమయ్యాడు. మాస్‌ ప్రేక్షకులు మెచ్చేలా పుష్పరాజ్‌ను పరిచయం చేయడం, ఎర్రచందనం రవాణా, సిండికేట్‌ తదితర వ్యవహారాలతో కథను ప్రారంభించిన దర్శకుడు ఆసక్తి కలిగించేలా ఆయా సన్నివేశాలను గ్రాండ్‌ లుక్‌తో తెరపై చూపించాడు. ప్రతి సన్నివేశం కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసేలా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా బన్నీ అభిమానులకు కనులపండువగా ఉంటుంది. ఒకవైపు పుష్పరాజ్‌ ప్రయాణాన్ని చూపిస్తూనే, మరోవైపు సిండికేట్‌ వెనుక ఉన్న అసలు పాత్రలను పరిచయం చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచాడు దర్శకుడు.

పుష్పరాజ్‌ కూలీ నుంచి సిండికేట్‌ నాయకుడిగా అడుగులు వేయడానికి దోహద పడేందుకు అవసరమైన బలమైన సన్నివేశాలు తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. విరామం ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. దీంతో ‘పుష్ప’ పాత్ర పతాక స్థాయికి వెళ్లిపోతుంది. ఎర్రచందనం సిండికేట్‌ నుంచి వచ్చే పోటీని పుష్పరాజ్‌ ఎలా ఎదుర్కొంటాడన్న ఆసక్తితో ద్వితీయార్ధం చూడటం మొదలు పెట్టిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. తెరపై సన్నివేశాలు వస్తున్నా, కథ ముందుకు నడవదు. మధ్యలో శ్రీవల్లి ప్రేమ ప్రయాణం, పాటలు బాగున్నా, ఒక సీరియస్‌ మోడ్‌లో సాగుతున్న కథకు చిన్న చిన్న బ్రేక్‌లు వేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ క్రమంలోనే పోలీస్‌ ఆఫీసర్‌ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర పరిచయంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడి నుంచి పుష్పరాజ్‌- భన్వర్‌ సింగ్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని ఆశించినా ఆయా సన్నివేశాలన్నీ సాదాసీదాగా సాగుతుంటాయి. ఒక బలమైన ముగింపుతో తొలి పార్ట్‌ ముగుస్తుందని ఆశించిన ప్రేక్షకుడు పూర్తి సంతృప్తి చెందడు. పార్ట్‌-2 కోసం చాలా విషయాలను ప్రశ్నార్థంగానే వదిలేసినట్లు అర్థమవుతుంది.

ఎవరెలా చేశారంటే..
‘పుష్ప: ది రైజ్‌’ అల్లు అర్జున్‌ వన్‌ మ్యాన్‌ షో అనే చెప్పాలి. కథ మొదలైన దగ్గరి నుంచి పుష్పరాజ్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్‌ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టేశాడు. ఏ సన్నివేశం చూసినా ‘తగ్గేదేలే’ అంటూ ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయించాడు. చిత్తూరు యాసలో బన్నీ పలికిన సంభాషణలు అలరిస్తాయి. శ్రీవల్లిగా డీగ్లామర్‌ పాత్రలో రష్మిక నటన సహజంగా ఉంది. కమెడియన్‌గా ప్రేక్షకులకు సుపరిచితమైన సునీల్‌ ఇందులో ప్రతినాయకుడు మంగళం శ్రీను పాత్రలో నటించాడు. ఈ పాత్ర కోసం సునీల్‌ మారిన తీరు, ఆయన డిక్షన్‌ బాగున్నాయి. అనసూయ, అజయ్‌ ఘోష్‌, రావు రమేశ్‌, ధనుంజయ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సమంత ఐటమ్‌ సాంగ్‌ మాస్ ప్రేక్షకులతో విజిల్స్‌ వేయిస్తుంది.

‘పుష్ప’ టెక్నికల్‌గా మరో లెవల్‌లో ఉంది. సినిమాటోగ్రాఫర్‌ కూబా గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సన్నివేశాన్ని రిచ్‌లుక్‌లో చూపిస్తూనే, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించారు. యాక్షన్‌ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధం నిడివి పెరిగిందేమోననిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను ఇంకాస్త ఎడిట్ చేస్తే బాగుండేది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు బాగున్నాయి. ‘సామి సామి’, ‘ఊ అంటావా’, ‘ఏ బిడ్డా’ పాటలు తెరపైనా అలరించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఓకే. అడవి వాతావరణం చూపించడానికి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. తనదైన మార్క్‌ కథలతో ప్రేక్షకులను అలరించే దర్శకుడు సుకుమార్‌ ‘రంగస్థలం’ తర్వాత మరో మాస్‌ కథను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు. పుష్పరాజ్‌ పాత్రతో సహా మిగిలిన పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ముఖ్యంగా కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసిన విధానం, అందుకు తగిన సన్నివేశాలు మెప్పిస్తాయి.

చివరిగా..: ‘పుష్ప’ పక్కా మాస్ ఎంటర్‌టైనర్.

Share This Article