ప్రేమలో విఫలమైతే కన్నీళ్లు పెట్టుకుని కుంగిపోయే యువత గురించి మనం చాలాసార్లు విన్నాం. కానీ ఒక కుర్రాడు మాత్రం ఆ విఫలతని విజయంగా మలచుకున్నాడు. అదే ఈరోజు భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన ఫుడ్ బ్రాండ్ “వావ్ మోమోస్” స్థాపకుడు సాగర్ దర్యానీ (Sagar Daryani). ఓ బ్రేకప్ బాధతో మొదలైన ఈ ప్రయాణం, రూ. 3,000 కోట్ల విలువ గల వ్యాపార సామ్రాజ్యంగా ఎదగడం ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక కథ.

2008 సంవత్సరం. కోల్‌కతాకు చెందిన సాగర్ బీకాం చివరి సంవత్సరం చదువుతున్నాడు. జీవితం బాగానే సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా ప్రేమలో విఫలమయ్యాడు. లవ్ ఫెయిల్యూర్‌తో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. చదువుపై దృష్టి లేకుండా రోజులు గడిపేవాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు వినోద్, ఒక నేపాలీ విద్యార్థి, అతనిని ఉత్సాహపరచడానికి తరచూ కలుస్తుండేవాడు. చదువుతూనే మాగీ, బర్గర్, పిజ్జాలు తింటూ ఉండేవారు. ఒక రోజు వినోద్ అన్నాడు “అన్నింటికీ బ్రాండ్ ఉంది… కానీ మేము ఇష్టపడే మోమోలకి మాత్రం బ్రాండ్ లేదు!”. ఆ మాట సాగర్ మనసుని తాకింది. “మనం ఎందుకు చేయకూడదు?” అనుకున్నాడు. ఆ ఒక్క ఆలోచననే తరువాత అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
సాగర్ తండ్రి చిన్న బట్టల దుకాణం నడిపేవారు. వ్యాపారం అంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేది. తండ్రి నుంచి కేవలం ₹30,000 తీసుకుని రోడ్డువారన మోమోలు అమ్మే చిన్న కియాస్క్ ప్రారంభించాడు. ఉదయం లేవగానే మోమోలు తయారు చేసుకొని, మధ్యాహ్నం వాటిని అమ్మేవాడు. చాలామంది “డిగ్రీ చదివి వీధిలో మోమోలు అమ్ముతున్నావా?” అంటూ ఎగతాళి చేశారు. కానీ సాగర్ ఆ మాటల్ని పట్టించుకోలేదు. ప్రతి కస్టమర్‌ని చూసి పసుపు రంగు టీ షర్ట్ వేసుకుని “ఒక్కసారి మా మోమోలు రుచి చూడండి సర్!” అని చెబుతూ అమ్మేవాడు. కొందరు తిన్నాక “వావ్!” అని అనగానే — ఆ మాటనే తన బ్రాండ్ పేరుగా మార్చుకున్నాడు — “వావ్ మోమోస్”.
మోమోలు రోడ్డు వారన చవకగా దొరికేవి, కానీ శుభ్రత ఉండేది కాదు. అందుకే “హైజీన్ ఫుడ్‌ని మాల్స్‌లో అమ్మితే?” అని ఆలోచించాడు. ఆ ఐడియాకి అనుగుణంగా కోల్‌కతాలోని స్పెన్సర్ మాల్‌లో చిన్న కియాస్క్ అద్దెకు తీసుకున్నాడు. మొదట్లో కస్టమర్లు తక్కువగా ఉన్నా, రుచి చూసిన వాళ్లు మళ్లీ రావడం మొదలుపెట్టారు. ఆ లాభాలను తిరిగి వ్యాపారంలో పెట్టి కొత్త రకాల ఫ్యూజన్ మోమోలు రూపొందించాడు —
తందూరీ మోమోస్, సిజ్లర్ మోమోస్, మోమో బర్గర్, చాక్లెట్ మోమోస్ — ఇవన్నీ యువతకు కొత్తగా అనిపించాయి.
ఆ రుచి గురించి నోటి మాట ప్రచారం వావ్ మోమోస్‌ని ఎదగనిచ్చింది. కొద్దికాలంలోనే కోల్‌కతా మొత్తం, ఆ తర్వాత చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి నగరాల్లో అవుట్‌లెట్లు తెరిచారు. “వావ్ మోమోస్” పేరు భారతీయ క్యూఎస్‌ఆర్ (Quick Service Restaurant) మార్కెట్‌లో ఒక సూపర్ బ్రాండ్‌గా మారింది. ప్రతి మాల్‌లో వావ్ మోమోస్ కౌంటర్ ఉండటం యువతకు ఒక హ్యాపీ ఫుడ్ స్పాట్‌గా మారింది.
రూ.30 వేల నుంచి రూ.3వేల కోట్ల వరకూ ప్రయాణం
ప్రారంభంలో మిత్రులు, కుటుంబం తప్ప ఎవరూ నమ్మలేదు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ వావ్ మోమోస్ విజయగాధ పెద్ద ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. “ఎలివేషన్ క్యాపిటల్”, “లైట్స్పీడ్ ఇండియా” వంటి ప్రముఖ సంస్థలు ₹1100 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. ప్రస్తుతం వావ్ మోమోస్‌కి 75 నగరాల్లో 750 అవుట్‌లెట్లు, 6000 పైగా ఉద్యోగులు, మరియు రూ.3000 కోట్ల మార్కెట్ విలువ ఉంది. ఇదే నిజమైన ‘Made in India’ సక్సెస్ స్టోరీ. కోవిడ్ సమయంలో అన్ని రెస్టారెంట్లు మూసుకుపోయాయి. ప్రజలు బయట తినడం ఆపేశారు. అప్పుడు సాగర్ ఆలోచించాడు — “ప్రజలు బయటకు రాకపోతే, మా ఉత్పత్తులు వాళ్లింటికి వెళ్లాలి.” అలా రెడీ టు కుక్ మోమోలు, ఫ్రోజెన్ ప్యాకేజింగ్, ఆన్‌లైన్ డెలివరీ మొదలుపెట్టాడు. ఆ మార్పు వావ్ మోమోస్‌కి నూతన ఊపునిచ్చింది. లాక్‌డౌన్ సమయంలోనే అమ్మకాలు పెరిగి, కంపెనీ లాభాల్లోకి వచ్చింది.
సాగర్ చెప్పిన మాటలు ప్రతి యువకుడికి స్ఫూర్తి కలిగిస్తాయి —
“ఓటమి అనేది ఎప్పుడూ అంతం కాదు. అది కొత్త ఆరంభానికి అవకాశం. బ్రేకప్ నాకు ఓ మలుపు ఇచ్చింది. కోవిడ్ కూడా అంతే. నేను వాటిని భయపడి పారిపోలేదు… ఎదుర్కొని గెలిచాను.” ఈ ఆలోచనే వావ్ మోమోస్‌ని దేశవ్యాప్తంగా ఫేమస్ చేశాయి.
ఇప్పటివరకు ఇండియన్ మార్కెట్‌లో డామినోస్, మెక్‌డోనాల్డ్స్, కేఎఫ్‌సీ వంటి విదేశీ బ్రాండ్‌లు ఆధిపత్యం చెలాయించాయి. కానీ వాటి మధ్య వావ్ మోమోస్ అనే భారతీయ బ్రాండ్ కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సంస్థ అంతర్జాతీయ విస్తరణకూ సిద్ధమవుతోంది. ఓ బ్రేకప్ నుంచి ఓ బ్రాండ్ పుట్టింది. ఓ డిప్రెషన్ నుంచి ఓ దిశ వచ్చింది. ప్రస్తుతం సాగర్ దర్యానీ కథ భారత యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. జీవితంలో ఎప్పుడు ఓటమి ఎదురైనా, అది ముగింపు కాదు — కొత్త మార్గం ప్రారంభం. విజయం కావాలంటే మానసిక ధైర్యం, పట్టుదల, ఆలోచన — ఈ మూడు ఉంటే చాలు అని సాగర్ నిరూపించాడు.
