తిరుమల శ్రీవారికి సోదరుడు.. ఇక్కడ ప్రసాదాల్లో ఉప్ప ఉండదు

Telugu BOX Office

భగవంతుడికి నివేదించే ప్రసాదాలను శ్రద్ధగానే కాదు… రుచిగానూ చేస్తాం. కానీ ఒప్పిలియప్పన్‌గా పిలిచే ఈ తిరువిన్నాగర్‌ వేంకటాచలపతి ఆలయంలో స్వామికి ఉప్పులేని ప్రసాదాలే నివేదిస్తారు. వేంకటేశ్వరస్వామి సోదరుడిగా, త్వరగా వివాహాల్ని కుదిర్చే భక్త వరదుడిగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి… కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం.

ఒప్పిలియప్పన్‌ ఆలయం… తమిళనాడులోని కుంభకోణంకు దగ్గరగా తిరునాగేశ్వరం అనే ఊళ్లో ఉంటుంది. నూట ఎనిమిది వైష్ణవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొంది… విశాలమైన ప్రాంగణంలో అయిదు అంతస్తుల రాజగోపురంతో ఆకట్టుకునే నిర్మాణశైలితో కనిపిస్తుంది. విష్ణుమూర్తి ఇక్కడ ఒప్పిలియప్పన్‌గా పూజలు అందుకుంటున్నాడు. ఈ స్వామిని తిరుమల వేంకటేశ్వరుడికి సోదరుడిగా భావిస్తారు. తిరుమలలోని వేంకటేశ్వరుడికి ఏదయినా మొక్కుకుని ఏ కారణం చేతనైనా అక్కడికి వెళ్లలేనివాళ్లు ఈ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవచ్చట. ఎనిమిదో శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయంలో స్వామి భూదేవి సమేతంగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు.

స్థల పురాణం
బ్రహ్మాండ పురాణం ప్రకారం… ఓసారి తులసిమాత విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిందట. ఆ తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే తనకూ లక్ష్మీదేవితో సమానంగా స్వామి వక్షస్థలంలో చోటు కల్పించమంటూ అడిగిందట. అందుకు అనుగ్రహించిన స్వామి తనకోసం ఎదురుచూడమని చెప్పి అంతర్థానమయ్యాడట. దాంతో తులసి ఈ ప్రాంతానికి వచ్చి స్వామికోసం ఎదురుచూడటం మొదలుపెట్టిందట. అలాగే… మార్కండేయ మహర్షి.. లక్ష్మీ దేవిని తన కుమార్తెగా పుట్టేలా చేయమంటూ తపస్సు చేయడంతో విష్ణుమూర్తి కరుణించాడట. అలా మార్కండేయ మహర్షికి తులసివనంలో ఓ పసిపాప కనిపించడంతో ఆమెను తీసుకొచ్చి భూమిదేవి/భూదేవి అని పేరు పెట్టి పెంచాడట.

కొన్నాళ్లకు ఓ వృద్ధుడు వచ్చి.. ఆ అమ్మాయిని పెళ్లిచేసుకుంటానని మహర్షిని అడగడంతో ససేమిరా అన్నాడట. ఆమెకు వంట సరిగ్గా రాదనీ.. ఇంకా చిన్నదనీ రకరకాల కారణాలు చెప్పాడట. అయినా కూడా.. ఆ వృద్ధుడు ఆమెనే పెళ్లిచేసుకుంటానని పట్టుబట్టడంతో వచ్చింది విష్ణుమూర్తేనని అర్థం చేసుకుని ఆనందంగా పెళ్లిచేసేందుకు సిద్ధమయ్యాడట. అలా స్వామి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని వివాహమాడి ఈ ప్రాంతంలోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడని ప్రతీతి. కొన్నాళ్లకు చోళ రాజులు ఇక్కడ ఆలయాన్ని కట్టిస్తే.. తంజావూరు రాజులు అభివృద్ధి చేసినట్లుగా చెబుతారు. ఈ ఆలయానికి మార్కండేయ క్షేత్రమనే పేరూ ఉంది.

భూదేవీ, మార్కండేయ సమేతంగా…
రాజగోపురం దాటి గర్భగుడికి వెళ్లే భక్తులకు స్వామివారు ఎనిమిది అడుగుల ఎత్తులో నిల్చుని కనిపిస్తాడు. స్వామి చెంత భూదేవీ, మార్కండేయ మహర్షీ కూర్చుని ఉండటాన్నీ చూడొచ్చు. ఆ తరువాత ఈ ప్రాంగణంలోనే కృష్ణుడు, రాముడు, హనుమంతుడు, గరుడ, ఆళ్వార్లు.. తదితర మూర్తులనూ దర్శించుకోవచ్చు. అవివాహితులు ఈ స్వామిని పూజిస్తే త్వరగా పెళ్లవుతుందనీ.. పెళ్లయిన వారు దర్శించుకుంటే వైవాహిక జీవితం ఏ సమస్యలూ లేకుండా సాఫీగా సాగుతుందనీ ఓ నమ్మకం. అలాగే స్వామి సన్నిధిలో షష్టిపూర్తి, శతాభిషేకం వేడుకల్ని జరిపించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారు.


ఉప్పు ఎందుకు ఉండదంటే…
అన్ని ఆలయాల మాదిరి.. ఇక్కడా స్వామికి పులిహోర, దద్ధ్యోదనం, కట్టె పొంగలి, వడలు, మురుకులు, చక్కెరపొంగలి… వంటివన్నీ నివేదిస్తారు. అయితే వేటిల్లోనూ ఉప్పు ఉండదు. ఎందుకంటే… విష్ణుమూర్తి భూదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చినప్పుడు దేవి ఏది వండి పెట్టినా తింటాననీ… ఉప్పు లేకపోయినా ఇష్టంగా ఆరగిస్తానంటూ మార్కండేయ మహర్షితో చెప్పాడట. అందుకే ఇప్పటికీ స్వామికి నివేదించే ప్రసాదాల్లో ఉప్పు వేయరు. అయితే ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలను తింటే ఉప్పులేకపోయినా అవి రుచిగా ఉంటాయనీ బయటకు వస్తే చప్పగా అనిపిస్తాయనీ భక్తులు చెబుతుంటారు.

Share This Article
Leave a comment