రూ.300 కోట్లతో దుర్గాదేవి మండపం.. ఎక్కడో తెలుసా?

Telugu BOX Office

దేశవ్యాప్తంగా రేపటి నుంచి దసరా శరన్నవరాత్రులు మొదలుకానున్నాయి. పితృపక్షాలు ముగిశాక ఈ నెల 22 నుంచి శరన్నవరాత్రులు మొదలై, అక్టోబరు 2 దాకా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో వాడవాడలా అమ్మవారి మండపాలు సిద్దమయ్యాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అమ్మవారి నామ స్మరణతో దేశమంగా మార్మోగనుంది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఒక్కోటి 50 అడుగుల ఎత్తు గల పన్నెండు జ్యోతిర్లింగాల ప్రతిమలతో రూ.300 కోట్ల ఖరీదైన దుర్గా మండపం సిద్ధమవుతోంది. దేశంలో అత్యంత ఖరీదైన దసరా మండపం ఇదే అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఏనుగు అంబారీపై దుర్గామాతను ఘనంగా మండపంలోకి తీసుకొచ్చి గర్బా నృత్యాలతో నవరాత్రి వేడుకలకు శ్రీకారం చుడతారు.

ఇండోర్ నగరంలోని వీఐపీ పరస్పర్‌ నగర్‌ ఆవరణలో 30 ఎకరాలకు పైగా విస్తరించిన మైదానంలో దక్షిణాది ఆలయాల నిర్మాణశైలిలో ఈ మండపం రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 500 మందికి పైగా కార్మికులు గత మూడు నెలలుగా ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. భక్తుల విరాళాలతో.. కృష్ణగిరి పీఠాధీశ్వరులైన వసంత్‌ విజయానంద్‌ గిరి మహరాజ్‌ మార్గదర్శకత్వంలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. నవరాత్రి వేడుకల్లో దలేర్‌ మెహందీ, లఖ్‌వీర్‌ సింగ్‌ లఖా, ఉస్మాన్‌ మీర్, శివమణి వంటి కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. అఖిల భారత కవి సమ్మేళనం జరుపుతారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మండపాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.

Share This Article
Leave a Comment