తమిళనాడులోని చిదంబరంలో ఉన్న ప్రముఖ నటరాజ స్వామి ఆలయం భారతీయ ఆధ్యాత్మిక సంపదలో ఒక అద్భుతమైన అధ్యాయంగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నటరాజ విగ్రహం ఈ ఆలయానికి ప్రాణంగా చెప్పవచ్చు. ఈ గుడిని అద్భుతాల ఆలయం, ఆధ్యాత్మిక శాస్త్రాలకు నిలయంగా పండితులు ప్రశంసిస్తారు. పంచభూతాలలో ఆకాశతత్త్వానికి ప్రతీకగా చిదంబరం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. శాస్త్రం, శిల్పం, సాంప్రదాయం అన్నీ కలిసి చిదంబరాన్ని ప్రపంచంలోనే అరుదైన దేవాలయాలలో ఒకటిగా నిలబెట్టాయి.

ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ఆశ్చర్యకర విశేషాలలో ఒకటి నటరాజ విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువుగా ఉందని పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎనిమిదేళ్ల పరిశోధన తర్వాత నిర్ధారించారు. తమిళ శైవ సన్యాసి తిరుమూలర్ తన గ్రంథం తిరుమందిరంలో దీనిని వేల ఏళ్ల క్రితమే పేర్కొనడం మరింత ఆశ్చర్యం. ఈ కారణంగా చిదంబరం ప్రపంచ అయస్కాంత క్షేత్రానికి ప్రత్యేక కేంద్రంగా భావిస్తారు. పంచభూతాలకు చెందిన మూడు ప్రధాన ఆలయాలు—చిదంబరం (ఆకాశం), శ్రీకాళహస్తి (వాయువు), కాంచీపురం ఏకాంబరేశ్వరుడు (భూమి) మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం 79°41’ పై ఉండటం శాస్త్రీయ ప్రపంచాన్నే అబ్బురపరిచిన విషయం. వేల ఏళ్ల క్రితమే ఇలాంటి ఖచ్చితమైన నిర్మాణాలు చేయడం ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్ట్‌ల మేధస్సుకు నిదర్శనం.
చిదంబరం ఆలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉండటం మానవ శరీరంలోని నవరంధ్రాలకు ప్రతీక. గోపురంపై ఉన్న 21,600 బంగారు రేకులు మనిషి రోజుకు తీసుకునే శ్వాసల సంఖ్యను సూచిస్తాయి. వాటిని తాపడం చేయడానికి ఉపయోగించిన 72,000 బంగారు మేకులు మన శరీరంలో ఉన్న నాడుల సంఖ్యకు ప్రతీకగా పరిగణిస్తారు. గర్భగుడి సమీపంలో ఉన్న పొన్నాంబళం కొంచెం ఎడమవైపున ఉండటం మన హృదయ స్థానం. అక్కడికి చేరడానికి ఎక్కే ‘పంచాక్షర పడి’ – న, మ, శి, వా, య – పంచాక్షరి మంత్రానికి ప్రతీక. ‘కనకసభ’లోని నాలుగు స్తంభాలు నాలుగు వేదాలను సూచిస్తే, పొన్నాంబళంలోని 28 స్తంభాలు 28 శైవ ఆగమాలను సూచిస్తాయి. పక్కనున్న మండపంలోని 18 స్తంభాలు 18 పురాణాలను ప్రతిబింబిస్తాయి. ఇవన్నీ భారతీయ శాస్త్ర, శిల్ప విజ్ఞానానికి నిదర్శనం.
ఈ ఆలయంలోని చిదంబర రహస్యం కూడా భక్తులను ఆకట్టుకునే అంశం. ‘శివోహంభవం’ అనే పవిత్ర స్థలంలో పూజారులు ప్రత్యేక సందర్భాల్లో తెరను తొలగించి ఆకాశ లింగాన్ని దర్శింపజేస్తారు. ఇది మనం – అహం – శివుడి తత్త్వంలో లీనమవడం అనే ఆధ్యాత్మిక భావనను ప్రతిబింబిస్తుంది. నటరాజ స్వామి నృత్యాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డ్యాన్స్ గా విశ్వంలోని సృష్టి–సంహార శక్తుల ప్రతీకగా పేర్కొనడం ఈ దేవాలయ మహిమను అంతర్జాతీయం చేసింది. పురాతన శిల్పకళా మౌలికత్వం, శివతత్త్వం, ఖచ్చితమైన శాస్త్రీయ గణన అన్నీ కలిసి చిదంబర నటరాజ స్వామి ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ మరియు పవిత్ర క్షేత్రంగా నిలబెట్టాయి.
