అంగరంగ వైభవంగా పూరీ జగన్నాథుని రథోత్సవం…. దివ్య క్రతువుల పూర్తి వివరాలివే

Telugu BOX Office

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక భావనలు ఉట్టిపడే జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఒడిశాలోని శ్రీక్షేత్ర పూరీలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆషాఢ మాస శుక్ల పక్ష ద్వితీయ తిథి పురస్కరించుకుని గురువారం (జూలై 16, 2026) ఈ రథోత్సవం భక్తుల జయజయధ్వానాల మధ్య మొదలైంది. లోకనాథుడైన ఆ జగన్నాథ స్వామి, తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవి మరియు సుదర్శన చక్రంతో కలిసి చతుర్ధా మూర్తులుగా భక్తులకు దర్శనమివ్వడానికి సిద్ధమయ్యారు. ఈ పవిత్ర యాత్ర భగవంతుడే స్వయంగా ఆలయం వెలుపలికి వచ్చి, లోపలికి ప్రవేశించలేని భక్తులకు సైతం తన కరుణాకటాక్షాలను అందించే అద్భుత ఘట్టానికి ప్రతీకగా నిలుస్తుంది.

సర్వాంగ సుందరంగా మూడు మహా రథాలు

పూరీ సింహద్వారం ఎదుట కళాకారులు విభిన్న రంగులు, సాంప్రదాయ డిజైన్లతో అలంకరించిన మూడు మహా రథాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి.

నందిఘోష (జగన్నాథుని రథం): 16 చక్రాలతో, 45 అడుగుల ఎత్తులో సమున్నతంగా కొలువై ఉంది.

తలధ్వజ (బలభద్రుని రథం): 14 చక్రాలతో, 45.6 అడుగుల ఎత్తుతో శోభిల్లుతోంది.

దేవదళన (సుభద్ర దేవి రథం): 12 చక్రాలు కలిగి, 44.6 అడుగుల ఎత్తుతో సుందరంగా ముస్తాబైంది.

ఈ మహా రథాలపై అధిరోహించి స్వామివారు తన సోదర సోదరీమణులతో కలిసి, తన మౌసి నివాసమైన గుండిచా ఆలయానికి తొమ్మిది రోజుల పాటు పయనమవుతారు. తిరిగి జూలై 24 (శుక్రవారం) నాటి ‘బహుదా యాత్ర’ (తిరుగు ప్రయాణం)తో ఈ ఉత్సవం ముగుస్తుంది.

శాస్త్రోక్తంగా సాగుతున్న దివ్య క్రతువులు

ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా సాగేందుకు వీలుగా ఆలయ అధికారులు ప్రత్యేక పూజా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఉదయం 6 గంటలకే మంగళ హారతితో ఈ ఆధ్యాత్మిక సంబరం ప్రారంభమైంది.

ఉదయం 9 గంటలకు: రథాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉదయం 9:30 గంటలకు: స్వామివార్ల విగ్రహాలను భక్తిపాటలు, నృత్యాలు, జపాల మధ్య రథాలపైకి చేర్చే అత్యంత పవిత్రమైన పహండీ’ ప్రక్రియ ప్రారంభమైంది.

మధ్యాహ్నం 2 గంటలకు: పూరీ గజపతి మహారాజు దివ్యసింగ్ దేవ్ సాంప్రదాయబద్ధంగా బంగారు చీపురుతో రథాలపై శుభ్రం చేసే ఛేరా పహారా’ దివ్య క్రతువును నిర్వహిస్తారు.

సాయంత్రం 4 గంటలకు: రథాలకు గుర్రాలను కట్టి, తాడులు అమర్చిన అనంతరం భక్తులు రథాలను లాగే రథటణ’ ఘట్టం ప్రారంభమవుతుంది.

 

 వానలో తడుస్తూనే.. జనసముద్రమైన బడదండ!

ఈ కనులపండువను వీక్షించేందుకు దేశవిదేశాల నుండి సుమారు 8 నుండి 10 లక్షల మంది భక్తులు తరలిరావడంతో పూరీ రథవీధి (బడదండ) జనసముద్రంగా మారింది. ఒకవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పూరీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ‘రెడ్ అలర్ట్’ జారీ చేసినప్పటికీ, భక్తుల ఉత్సాహానికి వాన అడ్డుకాలేకపోయింది. భక్తులు వర్షంలో తడుస్తూనే, హరినామ స్మరణ చేస్తూ పరమ పవిత్రమైన జగన్నాథుని రథాన్ని ముందుకు లాగేందుకు సిద్ధమయ్యారు.

Share This Article
Leave a Comment