మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది స్వామికి సమర్పించే పానకం. ఇది సాధారణ నైవేద్యం కాదు, యుగాలుగా కొనసాగుతున్న పవిత్ర సంప్రదాయం. స్వామి ఉగ్రరూపాన్ని శాంతపరచడానికి భక్తులు సమర్పించే ఈ పానకం, అదే ఈ క్షేత్రం ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేస్తుంది. ఇంతకీ స్వామివారు నెలకు ఎంత పానకం తాగుతారో తెలుసా. అక్షరాలా 50 వేల లీటర్లు. ఈ విషయాన్ని ఆలయ అధికారులే లెక్కగట్టి చెబుతున్నారు. సరాసరి నెలకు 40 వేల బిందెల పానకం భక్తులు నైవేద్యంగా సమర్పిస్తుంటారని, ఒక్కో బిందె 2.5 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో స్వామి అర్ధభాగం సేవించి, మిగిలినది వదిలేస్తారు. దాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ లెక్కన నెలకు స్వామికి లక్ష లీటర్ల పానకం నివేదిస్తుంటే ఆయన అందులో 50 వేల లీటర్లు స్వీకరిస్తున్నారు. పానకాన్ని స్వామి నోట్లో పోస్తున్నప్పుడు “గుటక” అనే శబ్దం రావడం ఈ క్షేత్రంలో కనిపించే అద్భుతాలలో ఒకటి.

పురాణ కథలు చూస్తే ఈ క్షేత్రం మహిమ మరింత అర్థమవుతుంది. నమూచి అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి అత్యంత ఉగ్రరూపంలో మంగళగిరి కొండ బిలంలో వెలిశారని విశ్వాసం. రౌద్ర స్వరూపంతో దేవతలు కూడా భయపడ్డారని, వారెంత ప్రార్థించినా శాంతించలేదని స్థలపురాణం చెబుతుంది. అప్పుడే లక్ష్మిదేవి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించగా, ఆయన రౌద్రం తగ్గి శాంతస్వరూపం ధరిస్తారు. అప్పటి నుంచి భక్తులు యుగాలవారీగా వివిధ నైవేద్యాలు సమర్పించారని పురాణ గాథ చెబుతుంది—కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో ఆవునెయ్యి, ద్వాపరయుగంలో ఆవుపాలు, ఈ కలియుగంలో బెల్లం పానకం.
ఈ పానకాన్ని ఆలయ పూజారులే కొండపైనే ప్రత్యేకంగా తయారు చేస్తారు. బెల్లం, మిరియాలు, యాలకులు నిర్ణీత మోతాదుల్లో కలిపి, శుద్ధమైన నీటితో పానకం సిద్ధం చేస్తారు. వేల లీటర్ల పానకం రోజూ స్వామికి సమర్పించినా ఆలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవడం ఈ క్షేత్రం వైశిష్ట్యాన్ని మరింత గా పెంచుతోంది. స్వామి ముఖం లోహంతో తయారై తెరిచి ఉన్న నోటితో దర్శనమిస్తుంది. భక్తులు సమర్పించే పానకాన్ని పూజారి స్వామి నోట్లో పోస్తాడు, సగం తాగిన తర్వాత స్వామే శబ్దంతో సంకేతం ఇస్తారని భక్తులు విశ్వసిస్తారు.
పానకాలస్వామి ఆలయం వెనక వైపు కొంచెం ఎత్తులో లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంది. ఆమె ఇక్కడ తపస్సు చేసినట్టుగా పురాణం చెబుతోంది. గుడి పక్కనే ఉన్న రహస్య సొరంగ మార్గం ద్వారా ఉండవల్లి గుహల వరకు వెళ్లవచ్చని, ఋషులు ఆ మార్గం నుంచే కృష్ణానదిలో స్నానం చేసి తిరిగి స్వామిని సేవించేవారని అంటారు. కాలక్రమేణా ఆ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. లక్ష్మీ తపస్సుతో ఈ కొండ మంగళగిరిగా ప్రసిద్ధి చెందింది. దీనికంటే ముందు ఇది మూర్కొండ, మార్కొండ పేర్లతో పిలువబడేది.
మొత్తం చూస్తే, మంగళగిరి పానకాలస్వామి క్షేత్రం భక్తి, పురాణం, అద్భుతాల సమ్మేళనం. స్వామికి పానకం సమర్పించే ఈ శతాబ్దాల నైవేద్యం క్షేత్రానికి అపార మహిమను తీసుకొచ్చింది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి పానకాన్ని సమర్పించడం ఇక్కడి ఒక అతి పవిత్ర సంప్రదాయం.
