ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన ఈ మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో స్నానాలు చేసి పునీతులవుతున్నారు. అయితే ఈ కార్యక్రమంలో కొందరు బాబాలు, సాధువులు స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహాకుంభ మేళాలో రష్యాకు చెందిన ‘బాహుబలి బాబా’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆయన్ని చూస్తుంటే పురాణ పురుషులను చూస్తున్నంత సంబరంగా ఉందంటూ భక్తులు తన్మయత్వం పొందుతున్నారు.
ఆరున్నర ఆడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, నీలి కళ్లు, అందమైన ముఖవర్ఛస్సు ఉండటంతో ఆయన్ని అందరూ ‘బాహుబలి బాబా’ అని పిలుస్తున్నారు. కుంభమేళాలో ఆయన ఎక్కడ కనిపించినా భక్తులు ఫోటోలు, వీడియోలు తీస్తూ వైరల్ చేస్తున్నారు. రష్యాలో ఉపాధ్యాయుడుగా పనిచేసిన ఆయన ప్రపంచంలోని చాలా దేశాల్లో పర్యటించారు. అలా 30 ఏళ్ల క్రితం భారత పర్యటనకు రావడం తన జీవితాన్ని మలుపు తిప్పిందట. భారత్‌లో సనాతన ధర్మానికి ముగ్ధుడైన ఆయన హిందూధర్మం గొప్పతనాన్ని గ్రహించి వెంటనే దాన్ని స్వీకరించారు. తన పేరును ఆత్మప్రేమ్ గిరి మహరాజ్‌గా మార్చుకున్నారు.
కొన్నాళ్ల పాటు ఈ దేశంలోనే ఉండి హిందూ పురాణాలు, ఇతిహాసాలను పఠించారు. అనంతరం నేపాల్‌కు వెళ్లి అక్కడ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. కుంభమేళా, మహాకుంభ మేళాలు జరిగినప్పుడల్లా నేపాల్ నుంచి భారత్‌కు వచ్చి వెళ్తుంటారు. ఇదండీ బాహుబలి బాబా కథ. విదేశీయుడైన ఆయన హిందూ మతంలోని గొప్పదనాన్ని గుర్తించి దాన్ని స్వీకరించడమే కాకుండా సన్యాసినా మారి సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న వైనానికి అందరూ ముగ్ధులవుతున్నారు. 45 రోజుల పాటు జరగనున్న ఈ మహాకుంభమేళాలో ఇలాంటి సాధువులు, సత్పురుషల దర్శనం కలగడం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు భావిస్తున్నారు.