అనూహ్యం.. టీడీపీ నుంచి తొలి జాబితాలోనే వారిద్దరికి టిక్కెట్

Telugu BOX Office

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇప్పటికే అధికార వైసీపీ ఏడు విడతల్లో 65 స్థానాలకు ఇంఛార్జులను ప్రకటించగా.. శనివారం టీడీపీ, జనసేన కూటమి ఏకంగా 99 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. ఇందులో 94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, ఐదు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించాయి. 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన జనసేన.. ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

అయితే టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో కొంతమందికి అనూహ్యంగా చోటు దక్కింది. సామాజిక సమీకరణాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇటీవలే పార్టీలో చేరిన అమరావతి రైతు ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేష్‌లకు తొలి జాబితాలోనే చోటు దక్కింది. వీరికి టికెట్లు వస్తాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. పార్టీలో సీనియర్‌ నాయకులకు సైతం స్థానం దక్కని తొలి జాబితాలోనే వీరి పేర్లు ఉండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

తిరువూరు నుంచి కొలికిపూడి

తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావును బరిలో దించుకున్నట్లు టీడీపీ ప్రకటించింది. కొలికపూడి గతంలో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహించేవారు.. ఆ తర్వాత అమరావతి రైతుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవలే చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో తిరువూరు నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అప్పటికి తిరువూరు టీడీపీ ఇంఛార్జిగా ఉన్న నల్లగుట్ల స్వామిదాస్.. జగన్‌ను కలిసి వైసీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ నుంచి తిరువూరు టికెట్ కొలికిపూడి శ్రీనివాసరావుకు ఖరారైంది.

పి.గన్నవరం నుంచి మహాసేన రాజేష్

మహాసేన రాజేష్‌‌గా ఫేమస్ అయిన సరిపెళ్ల రాజేష్‌ను పి.గన్నవరం నియోజకవర్గం నుంచి బరిలో నిలుపుతున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2019 ఎన్నికల సమయంలో రాజేష్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఓట్లు గుంపగుత్తగా వైసీపీకి పడటంలో కీలకంగా వ్యవహరించారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకీ రాజేష్ దూరమయ్యారు. మహాసేన పేరుతో సోషల్ మీడియాలో, యూట్యూబ్‌ ఛానెళ్లలో వైసీపీ సర్కారు తీరును ఎండగట్టేవారు. ఈ నేపథ్యంలోనే ఓ రాజమండ్రిలో ఆయనపై దాడి జరిగింది. దీంతో ఆయనకు జనసేన నేతలు అండగా నిలిచారు. పవన్‌కళ్యాణ్ సైతం రాజేష్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. దీంతో మహాసేన రాజేష్‌ జనసేనలో చేరడం ఖాయమనే అందరూ అనుకున్నారు. అయితే ఊహించని విధంగా రాజేష్ టీడీపీ కండువా కప్పుకున్నారు. తాను కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్లే టీడీపీలో చేరాల్సి వచ్చిందంటూ రాజేష్ ఓ వీడియో ద్వారా వివరించారు. వైసీపీపై రాజేష్ చూపిస్తోన్న దూకుడు నచ్చే చంద్రబాబు ఆయనకు పి.గన్నవరం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. అయితే ఏకంగా తొలి విడతలోనే ఆయన పేరు ఉండటం ఆ పార్టీ నేతలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

Share This Article
Leave a comment