ఉత్తరాంధ్ర అభివృద్ధి పటంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం వైభవంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ మహోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, జీఎంఆర్ గ్రూప్ అధినేతలు జి.మల్లిఖార్జునరావు, జీబీఎస్ రాజులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని నూతన టెర్మినల్ భవనంలోకి వెళ్లి ఆధునిక సాంకేతిక సదుపాయాలు, చెక్-ఇన్ ప్రాసెస్, ఎయిర్‌పోర్ట్ డిజైన్‌ను ప్రత్యేకంగా పరిశీలించారు. జీఎంఆర్ ప్రతినిధులు ఎయిర్‌పోర్ట్ విశేషాలను ప్రధానికి వివరించారు.

13,750 మందితో థింసా నృత్యం
ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధానికి గిరిజన సాంప్రదాయం ప్రతిబింబించేలా ఘన స్వాగతం లభించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలకు చెందిన దాదాపు 13,750 మంది గిరిజన మహిళలు, విద్యార్థినులు, డ్వాక్రా సంఘాల సభ్యులు ఒకే వేదికపై ప్రదర్శించిన ‘థింసా’ నృత్యం వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టెర్మినల్ నుండి బహిరంగ సభా ప్రాంగణానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై నిర్వహించిన ఈ ప్రదర్శనను ప్రధాని మోదీ ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఆసక్తిగా తిలకించారు.
ఏపీ కళలు, సంస్కృతికి అద్దం పట్టేలా..
ఈ విమానాశ్రయం కేవలం మౌలిక వసతుల కేంద్రంగానే కాక, ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాల కాన్వాస్‌గా రూపుదిద్దుకుంది.
- బాహ్య స్వరూపం: సముద్ర తీర ప్రాంతం కావడంతో ఎయిర్‌పోర్ట్‌ను ‘ఎగిరే చేప’ ఆకృతిలో తీర్చిదిద్దారు. టెర్మినల్ పైకప్పును అరకు లోయలోని సాంప్రదాయ ‘చుట్టిలు’ గుడిసెల ఆకారాన్ని తలపించేలా నిర్మించారు.
- స్వాగత తోరణం: ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భారీ ‘ఏటికొప్పాక బొమ్మ’ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. లోపల భాగంలో ముగ్గుల థీమ్, నాదస్వరం ఆకృతులు, తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ, బంగినపల్లి మామిడి విశేషాలను చిత్రాల రూపంలో మలిచారు. తప్పెటగుళ్లు, విజయనగరం కోట, సింహాచలం, అరసవల్లి, శ్రీముఖలింగం, శ్రీకూర్మం, కనకమహాలక్ష్మి దేవాలయాలు మరియు థింసా నృత్య దృశ్యాలను గోడలపై ప్రతిబింబించేలా చేశారు.

కూటమి ప్రభుత్వం శరవేగంగా పనులను పూర్తి చేయించిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ రూ. 4,750 కోట్ల అంచనా వ్యయంతో, 2,203 ఎకరాల భారీ విస్తీర్ణంలో అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. ఎయిర్‌బస్, బోయింగ్ వంటి పెద్ద విమానాలు కూడా సులువుగా ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల (3.8 కి.మీ.) పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్ వేను, అలాగే గంటకు 275 కి.మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా అత్యంత దృఢమైన నిర్మాణాలు చేపట్టారు. రెండు అంతస్తులలో 79,000 చదరపు మీటర్లలో ప్రయాణికుల టెర్మినల్ భవనం, 360 డిగ్రీల ఎయిర్‌సైడ్ వ్యూ ఇచ్చేలా 55 మీటర్ల ఎత్తులో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏటీసీ (ATC) టవర్‌ను నిర్మించారు. ప్రయాణికుల డిజిటల్ అనుభవం కోసం 40 చెక్-ఇన్ కౌంటర్లు, 12 ‘డిజియాత్ర’ పాడ్స్, సెల్ఫ్ చెక్-ఇన్ మరియు బ్యాగేజ్ రీక్లెయిమ్ సదుపాయాలతో పాటు 10 ఇమిగ్రేషన్ కౌంటర్లు, 7 బ్యాగేజ్ బెల్ట్‌లను (5 డొమెస్టిక్, 2 ఇంటర్నేషనల్) అందుబాటులోకి తెచ్చారు. ఇక ప్రయాణికుల సామర్థ్యం విషయానికి వస్తే, దశల వారీగా రద్దీకి తగ్గట్టుగా దీని సేవలను విస్తరించేలా ప్రణాళికలు రూపొందించారు.
ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే దిశగా..
విశాఖపట్నం నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారి 16కు సమీపంలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చనుంది.
పారిశ్రామిక, లాజిస్టిక్స్ విప్లవం: ఫార్మా, ఆక్వా, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల కోసం 5,000 చదరపు మీటర్లలో, 25,000 టన్నుల సరకు రవాణా సామర్థ్యంతో ప్రత్యేక కార్గో టెర్మినల్, లాజిస్టిక్ జోన్ అందుబాటులోకి వచ్చింది.
ఏవియేషన్ హబ్ & ఉపాధి: 25 ఎకరాల్లో విమానాల రిపేర్, మెయింటెనెన్స్ కోసం MRO (మరమ్మతు కేంద్రం), విమానయాన రంగానికి కావాల్సిన నైపుణ్యం కోసం జీఎంఆర్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, కమర్షియల్ హబ్‌లతో ‘జీఎంఆర్ ఏరో సిటీ’ని అభివృద్ధి చేస్తున్నారు.
భారీగా ఉద్యోగావకాశాలు: ఈ విమానాశ్రయ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 15,000 మందికి, ఉత్తరాంధ్రవ్యాప్తంగా పరోక్షంగా దాదాపు 5.85 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఉత్తరాంధ్రను ప్రపంచ పటంలో నిలపడంతో పాటు పర్యాటక, పారిశ్రామిక రంగాలకు ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఒక కొత్త చోదక శక్తిగా మారనుంది.
