తిరుమల శ్రీవారికి ఉన్న భక్తకోటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక స్వామివారికి బంగారు నగలు, కానుకలకు కొదవ లేదు. అప్పుడెప్పుడో శ్రీకృష్ణ దేవరాయలు వెంకటేశ్వర స్వామికి భారీ స్థాయిలో బంగారు నగలు, కానుకలు పలుమార్లు సమర్పించుకున్నట్లు శాసనాలు చెబుతున్నాయి. అలాగే మైసూరు మహారాజ వంశీయులు అనేక సందర్భాల్లో ఏడుకొండల వెంకన్నకు ఎంతో విలువైన బంగారు నగలు కానుకగా ఇచ్చారు. వాటిని ఇప్పటికీ స్వామికి అలంకరిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వం తరఫున శ్రీవారికి వజ్ర కిరీటం చేయించారు. దాని విలువ రూ.22 కోట్లు. శ్రీవారికి సంబంధించిన వివిధ ట్రస్టులకు పదికోట్లు, ఇరవై కోట్లు విరాళాలు తరచూ అందుతూనే ఉన్నాయి. కానీ… ఇప్పుడు ఒక అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారాన్ని వెంకన్నకు సమర్పిస్తున్నారట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పడంతో ఆ భక్తుడెవరా? అని అందరూ ఆరా తీస్తున్నారు.

మంగళవారం పీ4 కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వెంకటేశ్వరస్వామి భక్తుడొకరు కంపెనీ పెట్టారు. అది చాలా పెద్దస్థాయికి వెళ్లింది. ఆ కంపెనీలో 60 శాతం విక్రయించగా ఆయనకు ఆరేడువేల కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సంపద తనకు వెంకన్న ఇచ్చిందే అని ఆయన నమ్మి అందులో కొంతభాగం స్వామివారికే తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలా 121 కిలోల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇస్తున్నారు. దీని విలువ రూ.140 కోట్ల నుంచి రూ.150 కోట్లు ఉంటుంది. ఆయన నన్ను కలిసి ఈ మేరకు లేఖ కూడా ఇచ్చారు. తన పేరు మాత్రం బయటికి చెప్పొద్దని కోరారు. ఏడుకొండల స్వామికి రోజుకు 120 కిలోల ఆభరణాలు అలంకరిస్తారు. ఆ భక్తుడి ద్వారా అంతకంటే ఒక్క కిలో ఎక్కువ ఇప్పించుకోవాలని స్వామి నిర్ణయించుకున్నట్లుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీవారికి అందనున్న ఈ భారీ కానుకకు సంబంధించి టీటీడీ అధికారులకు సీఎంవో నుంచి సమాచారం అందినట్లు తెలిసింది.
చరిత్రలో రాజులు, సామంతులు, మహంతులు, రాజ వంశీకులు, బ్రిటిష్ పాలకులతో పాటు నవాబులు శ్రీవారికి లెక్కలేనన్ని స్వర్ణాభరణాలు సమర్పించారు. ఇటీవల కాలంలో 2009లో గాలి జనార్దన్ రెడ్డి రూ.42 కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటాన్ని స్వామికి సమర్పించగా.. అధిక బరువు ఉన్న నేపథ్యంలో దానిని అలంకరణకి వాడటం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంతో కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5.2 కోట్ల విలువైన 19.072 కిలోల బరువున్న రెండు స్వర్ణాభరణాలు అందించి మొక్కు తీర్చుకున్నారు. ప్రవాసాంధ్రుడు రామలింగరాజు ఇచ్చిన రూ.11 కోట్ల విరాళంతో శ్రీవారికి నూతన సహస్రనామ కాసుల బంగారు హారాన్ని తయారు చేయించారు. మొత్తంగా శ్రీవారిని అలంకరించేందుకు సుమారు 1100 బంగారు ఆభరణాలు, 376 వజ్ర వైడూర్యాల నగలు ఉన్నాయి. బంగారు ఆభరణాల కానుకలు ఇబ్బడిముబ్బడిగా వస్తుండటంతో… టీటీడీ కొన్ని నియంత్రణలు విధించింది. ముందస్తు అనుమతితో కొన్ని నిబంధనల మేరకు మాత్రమే ఈ కానుకలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హుండీ ద్వారా బంగారు కానుకలు రావడం ఎక్కువైంది. ఏటా హుండీ ద్వారానే సుమారు టన్ను బంగారం వస్తున్నట్లు సమాచారం. 2022 సెప్టెంబరు 30వ తేదీ నాటి లెక్కల ప్రకారం శ్రీవారి బంగారు డిపాజిట్లు 10,258 కేజీలు ఉన్నట్లు తెలుస్తోంది.
