ఆడపడుచులకు పవన్ అదిరిపోయే కానుక.. 10వేల చీరల పంపిణీ

Telugu BOX Office

జనసేన అధినేత, ఏఫీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ పరిపాలనలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తన నియోజకవర్గమైన పిఠాపురంలో ఆయన చేపట్టే కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల రాఖీ పండగ సమయంలో తన నియోజకవర్గంలోని వితంతువులకు చీరలు పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం సందర్భంగా పిఠాపురం మహిళలకు కానుక ప్రకటించారు. 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పిఠాపురంలోని శ్రీ పాదగయ క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు ఏర్పాట్లు చేశారు. 22వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఈ వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారు. ఒక్కో బ్యాచ్‌కు ఒక్కో అమ్మవారి పేరున అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని నామకరణం చేశారు.

ఉదయం 5 గంటల నుంచి 12.30 గంటల వరకు బ్యాచ్‌ల వారీగా వరలక్ష్మీ వత్రం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత వచ్చే ఆడపడుచులకు కూడా పసుపు, కుంకుమ, చీరలను కానుకగా అందిస్తారు. మొత్తం 10 వేల మంది ఆడపడుచులకు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన కూపన్ల పంపిణీ గురువారం నుంచి ప్రారంభమవుతుంది. కూపన్లపై సమయం ముద్రించి ఉంటుంది. ఆ సమయానుసారం వ్రతానికి ఏర్పాట్లు చేసుకోవాలని మహిళలకు సూచించారు. చీరలను దేవాలయ సిబ్బంది, పోలీసులు, జనసేన వాలంటీర్లు పంపిణీ చేయనున్నారు.

అంబిక భక్త బృందం ఉదయం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు, భ్రమరాంబ భక్త బృందం 6.30 గంటల నుంచి 8 గంటలు వరకు, చాముండి భక్త బృందం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు, దుర్గ భక్త బృందం 9.30 నుంచి 11 గంటల వరకు, ఈశ్వరి భక్త బృందం 11 నుంచి 12.30 గంటల వరకు వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, మధ్యాహ్నం 1 గంట తరవాత వచ్చే ఆడపడుచులకు కూడా పవన్ కల్యాణ్‌ పంపించిన పసుపు, కుంకుమ, చీరలను కానుకగా అందించనున్నారు.

Share This Article
Leave a Comment