తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే రోజుల్లో వర్షాలు దంచికొట్టబోతున్నాయంటూ అమరావతి వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ అధికారుల తాజా సమాచారం ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలపడింది. ఇది జూలై 16 ఉదయం నాటికి అదే ప్రాంతంలో స్థిరంగా ఉంటూ ‘బలమైన అల్పపీడన ప్రాంతం’గా రూపాంతరం చెందింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ వ్యవస్థ ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ప్రయాణిస్తోంది. రాబోయే రెండు రోజుల్లో ఇది ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశ వైపుగా కదిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి జమ్మూ, బరేలీ, బస్తీ, డాల్టన్‌గంజ్ ప్రాంతాల మీదుగా పయనిస్తూ, బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడన కేంద్రం గుండా ప్రయాణిస్తోంది. అక్కడి నుండి తూర్పు-ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపుకు ఈ ద్రోణి కదులుతోంది. మరోవైపు, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ బలమైన అల్పపీడన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక భారీ ద్రోణి విస్తరించి ఉంది. ఈ సుదీర్ఘ ద్రోణి ప్రభావం వల్ల కోస్తాంధ్రతో పాటు రాయలసీమ పరిసర ప్రాంతాల్లోనూ రాబోయే 24 నుండి 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
