ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఇకపై గూగుల్ మ్యాప్స్ ద్వారానే ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే సంబంధిత డేటాను గూగుల్‌కు అందజేయగా, సాంకేతిక పరిశీలనలు పూర్తవడంతో ఈ కొత్త ఫీచర్ అమలు దశలోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్ బస్టాండ్లలోని కౌంటర్లు, ఏజెంట్లు, సంస్థ అధికారిక వెబ్‌సైట్, యాప్ ద్వారా అందుబాటులో ఉంది. ఇక ఈ సేవను గూగుల్ మ్యాప్స్‌తో అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. ప్రయాణం ప్లాన్ చేసుకునే సమయంలో, మార్గం తెలుసుకునే సమయంలోనే నేరుగా బస్ టికెట్ బుక్ చేసుకునే వీలుంటుంది.

గూగుల్ మ్యాప్స్‌లో బుకింగ్ ఎలా?
ఉదాహరణకు, గూగుల్ మ్యాప్స్‌లో విజయవాడ నుంచి విశాఖపట్నం అని సెర్చ్ చేస్తే,
అందులో దూరం, సమయం, బైక్, కారు, రైలు, బస్ ప్రయాణ అవకాశాలతో పాటు, బస్ ఎంపిక (Bus Transit) ఆప్షన్ కనిపిస్తుంది.
ఈ బస్ సింబల్‌పై క్లిక్ చేస్తే — ఆ మార్గంలో అందుబాటులో ఉన్న ఆర్టీసీ రిజర్వేషన్ బస్సుల జాబితా, బయలుదేరు సమయాలు, చేరుకునే సమయం, మొత్తం ప్రయాణ వ్యవధి వంటి వివరాలు కనిపిస్తాయి. ఆ బస్సు వివరంపై క్లిక్ చేస్తే యూజర్ నేరుగా APSRTC అధికారిక రిజర్వేషన్ వెబ్‌సైట్ కు తీసుకెళ్లబడతారు. అక్కడ నుంచి ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుకింగ్, చెల్లింపు పూర్తిచేయవచ్చు.
పరీక్షల్లో విజయవంతం
ఈ సేవను ప్రారంభించే ముందు ఆర్టీసీ అధికారులు, గూగుల్ ప్రతినిధులు కలిసి ప్రయోగాత్మకంగా విజయవాడ–హైదరాబాద్ మార్గంలో ట్రయల్ నిర్వహించారు. కొన్ని వారాలపాటు ఈ ట్రయల్‌ను పరిశీలించగా బుకింగ్స్ సజావుగా జరిగాయి, ప్రయాణికులు సౌకర్యంగా ఉపయోగించుకున్నారు అని అధికారులు వెల్లడించారు. దాంతో ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ వంటి రిజర్వేషన్ సేవల రూట్ల వివరాలను గూగుల్‌కు పంపారు. గూగుల్ బస్టాప్‌ల వారీగా లొకేషన్ (లాటిట్యూడ్–లాంగిట్యూడ్) డేటా ఆడిట్ చేసింది. మూడు రోజుల క్రితం గూగుల్ తుది అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
త్వరలో అన్ని రూట్లలో అమలు
అధికారుల ప్రకారం, వచ్చే వారం రోజుల్లోనే అన్ని రిజర్వేషన్ రూట్లలో గూగుల్ మ్యాప్స్ ద్వారా APSRTC బుకింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. ప్రయాణికులకు ప్రయోజనాలు, మార్గం తెలుసుకుంటూ టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యం. బస్టాండ్ కౌంటర్ల వద్ద క్యూ తప్పుతుంది. అపాయింట్‌మెంట్ లేకుండా, ఎప్పుడైనా బుకింగ్ సౌకర్యం. ఈ కొత్త ఫీచర్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా మరింత స్మార్ట్, డిజిటల్, సులభమైందిగా మారనుంది. ప్రయాణికులు దీనిని విస్తృతంగా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు విశ్వసిస్తున్నారు
