ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.2,047 కోట్లతో అమరావతి రైల్వేలైన్‌!

Telugu BOX Office

కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతిలో పనులు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు శాశ్వత నిర్మాణాల్ని వేగంగా పూర్తి చేస్తుండగా.. కేంద్రం నుంచి కూడా భారీగా నిధులు, ప్రాజెక్టులు అందిస్తోంది. ఈ క్రమంలోనే అమరావతికి రైల్వేలైన్‌ అనుసంధానం చేయడం కోసం రూ.2,047 కోట్లతో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 57 కి.మీ. కొత్త లైన్‌ నిర్మిస్తున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ వెల్లడించారు. దీన్ని ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా ప్రకటించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. దీనికోసం 2025-26 బడ్జెట్‌లో రూ.171 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ‘కొత్త లైన్ల నిర్మాణం ద్వారా రాష్ట్ర రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానం కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించిందా’ అని వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

‘అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రైలు అనుసంధానం పెంచడానికి ఇటీవల విజయవాడ-గుడివాడ-నరసాపురం, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు డబ్లింగ్‌ (221 కి.మీ.) ప్రాజెక్టులు ప్రారంభించినట్లు అశ్వినీవైష్ణవ్‌ తెలిపారు. అమరావతి, విజయవాడలకు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి మరికొన్ని ప్రాజెక్టులు కూడా చేపట్టామని, అందులో విజయవాడ-గూడూరు మూడో లైన్‌ మొదలుపెట్టామని తెలిపారు. 287 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 248 కిలోమీటర్ల మేర పనులు, కాజీపేట-విజయవాడ మధ్య తలపెట్టిన మూడో లైన్‌ 220 కిలోమీటర్ల నిర్మాణంలో ఇప్పటికే 149 కిలోమీటర్ల మేర పూర్తయిందన్నారు. 2025-26లో ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.9,417 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతంలో రైల్వే అనుసంధానాన్ని పెంచడానికి కోటిపల్లి-నరసాపురం మధ్య 57 కి.మీ. పొడవైన కొత్త లైన్‌ నిర్మాణాన్ని రూ.2,120 కోట్లతో చేపడుతున్నట్లు అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. కాకినాడ జనసేన ఎంపీ తంగిళ్ల ఉదయ్‌ శ్రీనివాస్, రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. కోటిపల్లి-నరసాపురం మార్గంలో ముఖ్యమైన వంతెనలు, భూసేకరణ పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. తీరప్రాంతం, అక్కడి పోర్టులకు రైల్వే అనుసంధానాన్ని పెంచడానికి 6 లైన్ల సర్వే, డీపీఆర్‌ తయారీకి అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

Share This Article
Leave a Comment