తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో నిర్మాణ లోపాలు, సరైన ప్రణాళిక లేకపోవడంపై సీనియర్ నటులు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. ఇటీవల తన కుమారుడు అఖిల్ నటించిన ‘లెనిన్’ సక్సెస్ మీట్ వేదికగా అగ్ర నటుడు అక్కినేని నాగార్జున టాలీవుడ్ మేకర్స్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరి నిమిషం వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులను సాగదీసే సంస్కృతిపై ఆయన ఘాటుగా స్పందించడం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

హాలీవుడ్ స్టైల్ వర్కింగ్ మేలు
ఈ సందర్భంగా హాలీవుడ్ చిత్రాల విడుదల ప్రణాళికను నాగార్జున ఉదాహరణగా ప్రస్తావించారు. హాలీవుడ్ మూవీ ‘ది ఒడిస్సీ’ ఏడాది ముందే తమ విడుదల తేదీని ప్రకటించి, సరిగ్గా అనుకున్న సమయానికే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో థియేటర్లలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఒకప్పుడు మన పరిశ్రమలో కూడా ప్రదర్శనకు నెల రోజుల ముందే ఫైనల్ కాపీ సిద్ధంగా ఉండేదని, కానీ ఇప్పుడు సాంకేతిక నిపుణులు, దర్శకులు చివరి ఘడియ వరకు ఎడిటింగ్ రూమ్‌లు, మ్యూజిక్ స్టూడియోల చుట్టూ తిరగడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా ప్రదర్శనకు కొన్ని గంటల సమయం ఉందనగా కూడా ఫైనల్ కరెక్షన్స్ చేయడం, సీన్లు మార్చడం వల్ల కంటెంట్ బాగున్నా అవుట్‌పుట్ దెబ్బతింటోందని నాగ్ విశ్లేషించారు. ఓవర్సీస్ కాపీలు పంపిన తర్వాత కూడా రీ-రికార్డింగ్, సింక్ సమస్యలు రావడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు.
వేదికపైనే నిర్మాతకు హెచ్చరిక
అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం కూడా సరైన సమయానికి సాంకేతిక పనులు పూర్తి కాకపోవడం వల్లే నిర్ణీత తేదీ నుంచి రెండు వారాలు వాయిదా పడిందని నాగార్జున వెల్లడించారు. చివరి నిమిషంలో తానే స్వయంగా కూర్చుని ఎడిటింగ్ పనులను సరిచేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలోనే వేదికపై ఉన్న ప్రముఖ నిర్మాత నాగవంశీ వైపు తిరుగుతూ.. సినిమాలను ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు. సినిమా విడుదలకు కనీసం రెండు వారాల ముందే ఫైనల్ కాపీ చేతికి వస్తే సాంకేతిక లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని నాగార్జున స్పష్టం చేశారు. మరి నాగ్ చేసిన ఈ విశ్లేషణను టాలీవుడ్ మేకర్స్ పరిగణనలోకి తీసుకుని తమ పనితీరును మార్చుకుంటారో లేదో చూడాలి.
