టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మన అగ్ర కథానాయకులు రికార్డులను బద్దలు కొడుతుంటే థియేటర్లలో ఈలలు, గోలలతో పండగ చేసుకోవడం ప్రేక్షకులకు అలవాటే. వెండితెరపై వారు ఇచ్చే హీరో ఎలివేషన్లు, కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్సులు చూసి మురిసిపోతుంటాం. అయితే, ఆ రెండున్నర గంటల ఊరమాస్ వినోదాన్ని ప్రేక్షకులకు అందించడం వెనుక మన హీరోలు పడే శ్రమ, ప్రాణాలకు తెగించి చేసే సాహసాలు ఎంతో ఉంటాయి. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లోని అగ్ర కథానాయకులు వరుసగా తీవ్ర గాయాల బారిన పడటం, ఒకరి తర్వాత ఒకరు సర్జరీలు చేయించుకోవాల్సి రావడం సినీ వర్గాలతో పాటు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

మెగా కాంపౌండ్‌లో వరుస సర్జరీలు
ముందుగా మెగా కాంపౌండ్ విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి తీవ్ర గాయం కావడంతో ఆయన శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఒకవైపు రాజకీయ బాధ్యతలు, మరొకవైపు సెట్స్‌పై ఉన్న ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్‌కు ఈ శస్త్రచికిత్స తాత్కాలికంగా కొంత బ్రేక్ ఇచ్చింది. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయంలోనూ అనుకోని విధంగా ఇదే జరిగింది. ‘పెద్ది‘ చిత్ర చిత్రీకరణ సమయంలో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొదట కంటికి గాయమైనా రికవరీ అయి సెట్స్‌లో అడుగుపెట్టిన చరణ్‌కు, పహిల్వాన్ సీక్వెన్స్‌లు తీస్తున్న తరుణంలో కుడి చేతి మణికట్టుకు తీవ్రమైన గాయమైంది. అయినప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆ తీవ్రమైన నొప్పితోనే షూటింగ్ మరియు ప్రమోషన్లలో పాల్గొని తన నిబద్ధతను చాటుకున్నారు. ఆ తర్వాత కోయంబత్తూరులో మణికట్టుకు సర్జరీ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఆయన రికవరీ బాట పట్టారు. ఇదే క్రమంలో మెగా ప్రిన్స్ సైతం సర్జరీ అనంతరం చేతికర్ర సాయంతో నడుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయి, అభిమానులను కలచివేశాయి.
నందమూరి బాబాయ్-అబ్బాయిలకు గాయాల షాక్
అటు నందమూరి అభిమానులకు కూడా వరుసగా షాకింగ్ న్యూస్‌లు అందుతున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం ‘NBK111’ సెట్స్‌లో అత్యంత ఉత్సాహంతో పాల్గొంటుండగా, ఒక యాక్షన్ సీక్వెన్స్ సమయంలో ఆయన మోకాలికి తీవ్ర గాయమైంది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇక ‘మ్యాన్ ఆఫ్ మాసెస్‘ ఎన్టీఆర్ పరిస్థితి కూడా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే ‘డ్రాగన్‘ సినిమా షూటింగ్ సమయంలో కొద్దిరోజుల క్రితమే తారక్ చేతికి గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకుని తిరిగి ఉత్సాహంగా సెట్స్‌లోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే, మళ్లీ భుజానికి గాయమవ్వడం కలకలం రేపింది. దీంతో వైద్యులు ఆయనకు కొన్ని వారాల పాటు విశ్రాంతిని సూచించారు.
షూటింగ్‌లు.. విడుదల తేదీల పరిస్థితి ఏంటి?
అగ్ర హీరోలు వరుసగా గాయపడుతుండటంతో ఆయా సినిమాల నిర్మాణంపై, విడుదల తేదీలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చ ట్రేడ్ వర్గాల్లో మొదలైంది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బందులు లేవు. అయితే, డిసెంబర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన బాలకృష్ణ ‘NBK111’ షెడ్యూల్స్ పై ఈ బ్రేక్ కొంత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో చిత్రం ‘డ్రాగన్‘ వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తుండటంతో, ఈ తాత్కాలిక విరామం వల్ల లైనప్‌కు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా, అభిమానులను అలరించడం కోసం డూప్‌లు లేకుండా రిస్కీ స్టంట్లు చేస్తూ, ప్రాణాలు పణంగా పెడుతున్న మన అగ్ర కథానాయకులందరూ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, మళ్లీ అదే ఊరమాస్ ఎనర్జీతో వెండితెరపై రచ్చ చేయాలని సినీ ఇండస్ట్రీతో పాటు కోట్లాది మంది అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
