ఈ కిలో నెయ్యి రూ.2 లక్షలు.. తినడానికి మాత్రం పనికిరాదు

Telugu BOX Office

సాధారణంగా కిలో నెయ్యి రూ.500 నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది. కానీ గుజరాత్‌లోని ఈ నెయ్యి కొనాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. దాని ధర కేజీ రూ.3500ల నుంచి రూ.2 లక్షల దాకా ఉంటుంది. వామ్మో అంత రేటు పెట్టి నెయ్యి ఎవరు కొనుక్కుంటారు అనే సందేహం రావచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్టు. గుజరాత్‌లోని గోండాల్‌లో రమేష్‌భాయ్‌ రూపరేలియా అనే రైతు గోశాలను నడుపుతున్నాడు. అక్కడ లభ్యమయ్యే ఆవుపాలతో నెయ్యిని చేసి… దాన్నుంచి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తుంటాడు. ఈ నెయ్యిలో కుంకుమ పువ్వు, పసుపు, పిప్పళ్లు, గులాబీ రేకులు, మందారాలు… ఇలా రకరకాల మూలికల్ని కలుపుతాడు.

అంతేకాదు, దాదాపు 31 లీటర్ల పాలకు వచ్చిన వెన్నను కాచి అందులో ఈ మూలికల్ని వేసి కేజీ నెయ్యి అయ్యే వరకూ బాగా మరిగిస్తాడు. చిక్కగా అయిన ఈ నెయ్యిని తినడానికి మాత్రం వాడరు. కేవలం చర్మానికే రాస్తారు. కాస్త రాసుకుంటే తలనొప్పీ, చర్మవ్యాధులూ తగ్గుతాయట. వాసన చూడ్డం వల్ల దగ్గు అదుపులో ఉంటుందట. చర్మంపైన మొటిమల్నీ, నల్లమచ్చల్నీ అదుపుచేస్తుందట ఈ వనమూలికల నెయ్యి. అన్ని అనుమతులతో ఆ ఔషధాల నెయ్యిని రమేశ్‌- అమెరికా, కెనడా, సౌదీ అరేబియాతోపాటు దాదాపు వంద దేశాలకు పంపుతూ ఏడాదికి పదికోట్ల దాకా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మరికొందరు రైతులు కూడా రమేష్‌భాయ్‌ బాటలోనే వెళ్లేందుకు అతడి నుంచి సూచనలు కోరుతున్నారట.

 

Share This Article
Leave a comment