మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, ఎమోషనల్ చిత్రాలను తెరకెక్కించడంతో దిట్ట అయిన శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’. భక్తి, బలమైన కుటుంబ భావోద్వేగాలు, పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ ప్రియుల్లో విశేష ఆసక్తి నెలకొంది. అన్ని నిర్మాణ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బుధవారం నాడు సినిమా అధికారిక ట్రైలర్‌ను విడుదల చేశారు.

అలరిస్తున్న భక్తి, తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్
తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రవితేజ సరసన తమిళ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ కథానాయికగా అలరించనుండగా, రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటించింది. ట్రైలర్ ఆధారంగా కథలో తండ్రీకూతుళ్ల అనుబంధం మరియు పవిత్రమైన శబరిమల భక్తి నేపథ్యం ప్రధానాకర్షణగా నిలవనున్నాయి. రవితేజ చెప్పిన పవర్ ఫుల్ సంభాషణలు, ఆయన నటనలోని తీవ్రత సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఇప్పటికే విడుదలైన ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు..’ అనే పాట శ్రోతల నుంచి విశేష ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ చిత్రం
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. సీనియర్ నటుడు సాయి కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవి ప్రకాశ్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. వినూత్న కథాంశంతో కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎమోషనల్ డ్రామాగా రాబోతున్న ‘ఇరుముడి’ చిత్రం థియేటర్లలో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
