OGకి బిగ్ షాక్.. టిక్కెట్లు పెంపును సస్పెండ్ చేసిన హైకోర్టు

Telugu BOX Office

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఓజీ విడుదల కోసం ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో, DVV దానయ్య నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ‘ఓజీ’ విడుదల సందర్భంగా టికెట్ ధరలను పెంచేందుకు చిత్ర నిర్మాణ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై తెలంగాణ హోంశాఖ అనుమతి ఇవ్వగా జీవో కూడా జారీ చేసింది. అందులో భాగంగా, ప్రీమియర్ షోస్ కోసం జీఎస్టీతో కలిపి రూ.800 వరకు టికెట్ ధరను నిర్ణయించగా, సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 అదనంగా వసూలు చేసుకునే అవకాశం కల్పించింది.

అయితే ఈ నిర్ణయాన్ని మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశారు. హోంశాఖ స్పెషల్ సీఎస్‌కు టికెట్ ధరలపై నిర్ణయం తీసుకునే అధికారం లేదని, సంబంధిత అధికారం హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్ లేదా జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్‌కే ఉంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అలాగే, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ సందర్భంగా కూడా ఇలాంటి అనుమతి ఇచ్చి తర్వాత అండర్ టేకింగ్ ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్, హోంశాఖ జారీ చేసిన మెమోను సస్పెండ్ చేశారు. దీంతో ‘ఓజీ’ టికెట్ ధరల పెంపు అమలులోకి రాకుండా ఆగిపోయింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేశారు.

ఈ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు, ప్రీమియర్ షోస్‌కి అధిక ధరలు పెట్టడం వల్ల సాధారణ ప్రేక్షకులు ఇబ్బంది పడతారని కొందరు ఆనందిస్తుండగా, మరోవైపు టికెట్ ధరల పెంపు లేకుండా భారీ ప్రాజెక్టుల వసూళ్లు ఎలా సాధ్యమవుతాయని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రీమియర్స్ కోసం ఇప్పటికే భారీ డిమాండ్ ఉండటంతో, టికెట్ ధరలు తగ్గితే రికార్డు స్థాయి వసూళ్లపై ప్రభావం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇకపోతే, ఓజీ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యాక్షన్ స్టైలిష్ ట్రైలర్, థమన్ సంగీతం, సుజీత్ దర్శకత్వం అన్నీ కలిసి సినిమా హైప్‌ను మరింత పెంచాయి. అనకాపల్లి నుంచి అమెరికా వరకూ ఓజీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను తిరగరాస్తున్నాయి. ఈ పరిస్థితిలో టికెట్ ధరల పెంపు ఆగిపోవడం ట్రేడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో ఓజీ కలెక్షన్లు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share This Article
Leave a Comment