పూర్వ జన్మ పాప పుణ్యాలకు సరిపడే తీరులో మనల్ని నడిపించేవాడు గణాధిపతి. అలాంటి గణేశుడిని వినాయక చవితిరోజు ఒక్కరోజు పూజించినా సకల పాపాలు నశించి, విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయి. విఘ్నేశ్వరుడికి అనేక రూపాలు ఉన్నాయి. పురాణాలు, ఆగమ శాస్త్రాల్లో గణపతికి 33 రూపాలు వర్ణించబడ్డాయి. ప్రతీ రూపానికీ ప్రత్యేక ఆరాధన, ఫలితాలను చెప్పారు. వినాయక చవితి రోజున సింహాసనంపై కూర్చొన్న నాలుగు లేదా ఆరు చేతులు కలిగిన గజముఖంతో ఉన్నటువంటి ముఖ్యంగా ఒక చేతిలో కుడుములు, మరో చేయి ఆశీర్వచనం ఇచ్చేలా ఉన్నటువంటి మట్టిగణపతిని పూజించడం శ్రేష్ఠం. వినాయక వ్రతంలో ఏకవింశతి పత్ర పూజ (21) ఎంతో ప్రాధాన్యమైనది. ఆ పత్రాలన్నీ ఔషధ గుణాలతో కూడినవి కావడంతో భాద్రపద మాసంలో ఇంట్లో పూజలు చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉండవని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను భాద్రపదమాసం శుక్లపక్షం చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు. ఈ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన గణేష్ చతుర్థి పండుగ జరుపుకోవాలి. పండితుల సూచన ప్రకారం ఈసారి వినాయక పూజకు ఆగస్టు 27న ఉదయం 11:47 గంటల నుంచి మధ్యాహ్నం 01:41 గంటల వరకు చాలా శుభప్రదంగా ఉంది. ఈ సమయంలో దీపం పెట్టి పూజ, వినాయక వ్రత కల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందొచ్చని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, నియమ, నిష్టలతో పూజ చేయడం వల్ల ఆ గణనాథుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. 27వ తేదీ నుంచి మొత్తం పది రోజుల పాటు అంటే తొమ్మిది రాత్రిళ్లు.. అంటే అనంత చతుర్దశి వరకు ఈ వినాయక పండుగ జరుపుకుంటాం. సెప్టెంబర్ 6న అనంత చతుర్దశి రోజున భక్తి శ్రద్దలతో పూజించిన వినాయకుడిని దగ్గరలో చెరువు లేదా కాలువలో నిమజ్జనం చేస్తాం.
ఏ విధమైన గణపతిని ప్రతిష్టించాలి?
వినాయకుని విగ్రహం ఇంట్లో పెట్టే ముందు కొన్ని విశేష జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. తొండం కుడివైపు ఉన్న విగ్రహాన్నే ఇంట్లో ప్రతిష్ఠించాలి. ఎలుక వాహనంపై కూర్చున్న గణపతి విగ్రహం మాత్రమే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిలబడిన స్థితిలో ఉన్న గణపతి విగ్రహాలు లేదా నాట్యం చేస్తున్న గణపతులు ఇంట్లో పెట్టకూడదు. పగుళ్లు ఉన్న విగ్రహాలు వాడకూడదు. ఇవి శుభ ఫలితాలకు భంగం కలిగించవచ్చని పంచాంగకర్తలు హెచ్చరిస్తున్నారు. అలాగే, గణపతికి సమీపంలో ఏనుగు విగ్రహం కూడా ఉంటే మరింత శుభం కలుగుతుందంటున్నారు.
