వయసు పెరిగేకొద్దీ ముఖంపై ముడతలు, గీతలు కనిపించి ఇబ్బంది పెడతాయి. వాటిని నియంత్రించడంతో పాటు చర్మం నవ యౌవనంగా కనిపించాలంటే.. రోజూ ఈ ఆహారాన్ని తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చర్మం యౌవనంగా కనిపించాలంటే శరీరంలో విటమిన్ సి అవసరం. దీని లోపం ఉంటే ముఖంపై ముడతలతో పాటు అనేక సమస్యలు కనిపిస్తాయి. అందుకే ఆహారంలో నారింజ, కివీ, బెర్రీలు మొదలైన విటమిన్ సి ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఇవి కొలాజెన్ ఉత్పత్తికి సాయపడతాయి. చర్మాన్ని బిగుతుగా చేస్తాయి.
నానబెట్టిన ఐదు బాదం పప్పులు, రెండు వాల్నట్స్లను రోజూ ఉదయం తినండి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడి ముఖంలో మెరుపు వస్తుంది.
డార్క్ చాక్లెట్ హానికర బ్యాక్టీరియా, ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. దీనిలో ఉండే ఫ్లేవనాల్స్ సూర్యుని నుంచి వెలువడే యూవీ కిరణాల నుంచి కాపాడుతాయి.
యాంటీ ఏజింగ్ పోషకాలు చేపల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై కొలాజెన్ నాణ్యతను మెరుగుపరచటంలో ఉపయోగపడతాయి. ముఖంపై గీతల్ని తొలగించి యౌవనంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
ప్రొటీన్ ఎక్కువగా ఉన్నవాటిలో పెరుగు ఒకటి. ఇది తక్కువ కెలొరీలను కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు సాయపడుతుంది. పెరుగులో ఫాస్ఫరస్, విటమిన్ బి12, క్యాల్షియం ఉన్నాయి. ఇవి ముఖంపై ముడతలను, మచ్చలను మాయం చేసి తాజాగా కనిపించేలా చేస్తాయి.