మనం కూరల్లో వినియోగించే ఉప్పు కిలో ధర రూ.20-30 మధ్యే ఉంటుంది. ఈ మధ్య చాలామంది ఎర్రగా ఉండే రాక్ సాల్ట్ వినియోగిస్తున్నారు. అదికూడా వంద రూపాయలకి అటూఇటూగా ఉంటుంది. మరి కిలో రూ.30వేలు ఖరీదు చేసే ఉప్పు కూడా ఉందంటే మీరు నమ్ముతారా… అంత ధరపెట్టి కొనే ఆ ఉప్పులో ఏముంటుందబ్బా అన్న అనుమానం వస్తోందా… అయితే ప్రపంచంలోనే ఖరీదైన ఆ ఉప్పు గురించి తెలుసుకోవాల్సిందే.
కొరియన్ వంటకాల్లో వాడే ఆ ఉప్పు పేరు బ్యాంబూ పింక్ సాల్ట్. వెదురు బొంగుల్లో ఉప్పును నింపి చివర్లను బంకమట్టితో మూసేసి- 800 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దాదాపు 15 గంటలపాటు కాల్చుతారు. బొంగులోని ఖనిజ లవణాలూ, దాన్నుంచీ వచ్చే నూనెలూ ఉప్పులో కలిసిపోతాయి. బొంగు బాగా కాలిపోయి ఉప్పు నల్లగా అవుతుంది. దాన్ని మళ్లీ ఇంకో బొంగులో పెట్టి కాల్చుతారు. ఈ విధంగా తొమ్మిదిసార్లు కాలిన ఉప్పునే కొరియన్ బ్యాంబూ సాల్ట్ అంటున్నారు. అలా, నిప్పుల్లో కాలిన ఉప్పు ఆరోగ్యానికి ఎన్నోరకాలుగా మేలని కొరియన్లు నమ్ముతారు. తయారీవిధానం వల్లే దానికంత డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు.