విమానాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. టేకాఫ్ అయ్యేటప్పుడు రన్‌వేపై ఏమీ లేకుండా చూసుకోవడం నుంచి వాతావరణ పరిస్థితులు, విమానం కండిషన్ ఇలా ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తారు. ఇక రన్‌వేపై నీళ్లున్నా, భారీ వర్షాలు పడుతున్నా దాన్ని ల్యాండింగ్‌కి అనుమతించారు. అలాంటిది.. రన్‌వే మధ్య నుంచి ఏకంగా ఓ రైల్వే లైన్‌ను ఊహించగలరా? సాధారణంగా రైళ్లు వెళ్తున్నప్పుడు రైల్వే లైన్ దాటి వెళ్లాల్సిన వాహనాలను కొద్దిసేపు నిలిపివేస్తారు. అలాంటిది విమానం వెళ్తోందని రైలునే ఆపేస్తే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటి ఎయిర్‌పోర్టు ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉంది. అదే న్యూజిల్యాండ్‌లోని గిస్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్ (Gisborne Airport). ఇక్కడి రన్‌వేను రెండు ముక్కలు చేస్తున్నట్లుగా మధ్య నుంచి ఓ రైల్వే ట్రాక్ (Railway Line) ఉంది. ఈ విమానాశ్రయాన్ని అటు రైల్వే, ఇటు విమానయాన సేవలకు కూడా వినియోగిస్తున్నారు.

న్యూజిల్యాండ్‌లోని ఉత్తరద్వీపంలో గిస్‌బోర్న్ అనేది ఓ చిన్న పట్టణం. దాదాపు 160 హెక్టార్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. ఇక్కడి విమానాశ్రయం రన్‌వే మీదుగా పాల్మెరస్టన్ నార్త్- గిస్‌బోర్న్ రైల్వే లైన్ వెళ్తోంది. ప్రతిరోజూ ఉదయం 6.40 నుంచి రాత్రి 8.30 వరకు మాత్రమే ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులో ఉంటుంది. విమానాశ్రయ అధికారులే ఇక్కడి సిగ్నలింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తారు. ఒకవేళ విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉంటే.. రైళ్లను కాసేపు నిలిపివేస్తారు. వైమానిక సేవలకే ప్రథమ ప్రాధాన్యం. అంతేకాకుండా వీలైనంత వరకు రైళ్లు, విమానాలు ఒకే సమయంలో రాకుండా టైమ్ టేబుల్ తయారుచేసి దానినే అనుసరిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని టాస్మానియా నగరంలోనూ ఇదే తరహా ఎయిర్‌పోర్టు ఉండేది. అక్కడి వైన్‌యార్డ్ విమానాశ్రయం రన్‌వే మధ్యలో రైల్వే లైను వెళ్లేది. అయితే, 2005లో ఆ మార్గంలో రైల్వే సేవలను నిలిపివేశారు. దీంతో ప్రపంచంలోనే రన్‌వే మీదుగా రైల్వేలైన్ వెళ్తున్న ఏకైక ఎయిర్‌పోర్ట్‌గా గిస్‌బోర్న్ నిలిచింది.
