అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇచ్చే హెచ్-1బీ వీసాల రుసుమును ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లకు పెంచడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ట్రంప్ నిర్ణయం ఎంతో మంది ఉద్యోగార్థులపై ప్రభావం పడనుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు తక్షణం యూఎస్‌కు వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ మెయిళ్లు పంపుతున్నాయి. ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ‘ఎక్స్’ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

హెచ్-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని ఆమె స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమనని తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావొచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. ఈ వన్‌టైమ్ లక్ష డాలర్ల రుసుము ఇకపై కొత్తగా హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే మాత్రమే అమలు చేస్తామని, ప్రస్తుత వీసాదారులకు, రెన్యూవల్‌కు వర్తించదని చెప్పారు.

భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వీసా కొత్త రూల్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికాలో H-1B వీసాలు ఎక్కువగా భారతీయ టెక్నీషియన్లు, ఇంజినీర్లకు ఉన్నాయి. మొత్తం H-1B వీసాల్లో 71-72 శాతం భారతీయులకే దక్కుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న భారతీయులకు సహాయం చేసేందుకు భారత రాయబార కార్యాలయం ఒక అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది. ఈ నంబర్ ద్వారా తక్షణ సహాయం కావాల్సిన భారతీయులు సంప్రదించవచ్చు.+1-202-550-9931 (ఫోన్ & వాట్సాప్). ఈ నంబర్ సాధారణ కాన్సులర్ సేవల కోసం కాదని, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ నంబర్ ఉపయోగించాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
