జపాన్‌లోని అత్యంత పవిత్రమైన షింటో ఆలయాల్లో ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్న ఇసె జింగు మందిర సముదాయం తన ప్రత్యేకతతో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇసె జింగు ఆలయాన్ని ప్రతి 20 ఏళ్లకోసారి కూల్చి తిరిగి నిర్మించడం జపాన్‌లో ఒక అద్భుతమైన ఆచారం. దీనిని స్థానికులు ‘షికినేన్ సెంగు’ (Shikinen Sengu) అని పిలుస్తారు. ఈ సంప్రదాయం 1,300 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతూ వస్తోంది. ఈ ఆచారానికి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఎంతో గొప్పది. మందిరం ఎప్పటికీ నూతనంగా, పవిత్రంగా నిలవాలని, అలాగే పురాతన నిర్మాణ పద్ధతులు, సంప్రదాయాలు తదుపరి తరాలకు అందాలని భావనతో ఈ ఆచారం మొదలైంది. కేవలం గోడలు, స్తంభాలు మాత్రమే కాదు, ఆలయంలో ఉపయోగించే వస్తువులు, వస్త్రాలు, పూజా సామగ్రి అన్నీ కొత్తగా తయారు చేస్తారు. సుమారు 125 ఆలయ భవనాలను, 1,500 పైగా పవిత్ర వస్తువులను నిపుణులు చెక్కతో, వస్త్రాలతో, చేతిపనితో పునర్నిర్మిస్తారు.

ప్రతి పునర్నిర్మాణానికి తొమ్మిది సంవత్సరాల సమయం పడుతుంది. ఈ కాలంలో నిర్మాణం సాగుతూనే 33 ప్రధాన పండుగలు, ఆచారాలు కూడా నిర్వహిస్తారు. ఇవన్నీ జపాన్ ప్రజలకు భక్తి, విశ్వాసం, ఆనందం నింపుతాయి. ఈ మహత్తర కార్యక్రమానికి దాదాపు 39 కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది. తాజాగా ఇసె జింగులో 63వసారి పునర్నిర్మాణం జరుగుతోంది. 2033లో కొత్త ఆలయం పూర్తవుతుంది. అప్పుడు ప్రధాన దేవత అయిన సూర్య దేవత అమతెరాసును కొత్త గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ఈ క్షణం జపాన్ ప్రజలకు ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పదనాన్ని, గౌరవాన్ని అందిస్తుంది. ఈ ఆలయం ఇసుజు నది ఒడ్డున వుంది. ప్రకృతి మధ్యలో ప్రశాంతతను అందించే ఈ ప్రాంతం, జపాన్ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. యుద్ధాలు, రాజకీయ కల్లోలాలు, కాలానికి ఎదురీదుతూ ఈ సంప్రదాయం కొనసాగుతుండడం అద్భుతం. కేవలం రెండు సార్లు మాత్రమే – 15, 16వ శతాబ్దాల అంతర్యుద్ధాల సమయంలో ఒకసారి, రెండో ప్రపంచ యుద్ధం అనంతరం మరోసారి ఈ ఆచారానికి విఘాతం కలిగింది. ఆ రెండు సందర్భాలు మినహా, ఈ సంప్రదాయం ఎప్పుడూ ఆగలేదు. ఆ విషయమే ఇసె జింగు మందిరాన్ని ప్రపంచానికి ప్రత్యేకంగా నిలబెట్టింది.

ఆధునిక సాంకేతికతలతో నిండిన నేటి యుగంలో కూడా, పూర్వీకుల సంప్రదాయాలను అక్షరాలా పాటిస్తూ, చెక్క పనుల్ని, చేతిపనుల్ని, వందలాది కుటుంబాల శ్రమను సమన్వయం చేస్తూ ఆలయాన్ని నిర్మించడం గొప్ప విషయం. ఇసె జింగు ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, జపాన్ సంస్కృతి, వారసత్వం, విశ్వాసానికి ప్రతీక. ప్రతి 20 ఏళ్లకోసారి జరిగే ఈ పునర్నిర్మాణం, ‘పాతదాన్ని కొత్తగా మార్చుకోవడం’ అనే సూత్రాన్ని ప్రతిబింబిస్తూ, భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన వారసత్వాన్ని అందిస్తోంది.
